Walking after Dinner: రాత్రి భోజనం చేశాక 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు, ఎన్ని లాభాలో తెలుసుకోండి
Walking after Dinner: రాత్రి భోజనం చేశాక చాలామంది వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక పది నిమిషాలు వాకింగ్ చేస్తే ఎన్నో మంచి మార్పులు కలుగుతాయి.

Walking after Dinner: ఆధునిక కాలంలో అలవాట్లన్నీ మారిపోయాయి. ఒకప్పుడు రాత్రి భోజనం చేశాక అందరూ బయట కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఉండేవారు. కొంతమంది నడవడం, కొంతమంది ఏదో ఒక పనులు చేసుకోవడం చేసేవారు. ఇప్పుడు ఎవరింట్లో వారే ఉంటున్నారు. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా అన్నం తిన్న వెంటనే నిద్రపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం పూర్తయ్యాక ఒక 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా అవసరం. వాకింగ్ చేయలేకపోతే కనీసం నిటారుగా కూర్చోండి. అంతేతప్ప వెంటనే పడుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
వాకింగ్ చేయడం వల్ల లాభాలు
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల దగ్గు వేధిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేశాక ముందు నిటారుగా కాసేపు కూర్చోండి. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు మెల్లగా ఇటూ అటూ వాకింగ్ చేయండి చాలు. జీర్ణశక్తి పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. వెంటనే నిద్రపోతే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. భోజనం తర్వాత వాకింగ్ చేసే వారిలో జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం కూడా రావు. జీర్ణక్రియ ఎప్పుడైతే సవ్యంగా సాగుతుందో శరీరంలో ఉన్న వ్యర్ధాలు, విషాలు బయటికి పోతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు
డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం మంచి పద్ధతి కాదు. వారు ఒక పది నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇలా వాకింగ్ చేసేవారిలో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది. ఎప్పుడైతే అన్నం తిన్నాక వ్యాయామం లేదా వాకింగ్ చేస్తారో... అప్పుడు శరీరం రక్తంలోనే కొంత గ్లూకోజ్‌ను వినియోగించుకుంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒకేసారి పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా అన్నం తిన్నాక వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
తీవ్రంగా దగ్గు వేధిస్తున్నప్పుడు దానికి అన్నం తిన్న వెంటనే నిద్రపోవడం కారణం కావచ్చు. ఎప్పుడైతే ఇలా నిద్రపోతారో ఆహారంలోని జీర్ణ రసాలు యాసిడ్ రిఫ్లెక్స్‌కు గురవుతాయి. అప్పుడు విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిన్న వెంటనే ఇప్పుడు పడుకోవద్దు. వీలైనంత వరకు నిటారుగా కూర్చుని ఉండడానికి ప్రయత్నించండి. అలాగే నడవడానికి ప్రయత్నించండి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా నడవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాకింగ్ చేయడం కేవలం శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక యాంటీ డిప్రెసెంట్ లా పనిచేస్తుంది. డిప్రెషన్ భార్యను పడే వారికి వాకింగ్ మంచి ఔషధమని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రతిరోజూ వాకింగ్ చేస్తారో మానసిక స్థితి కూడా చక్కగా ఉంటుంది. ఒక నెలరోజుల పాటు ఇలా వాకింగ్ చేసి చూడండి. మీలో వచ్చే మంచి మార్పులను మీరే గమనిస్తారు.