Before Sleep: నిద్రపోయే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, ఏ ఇబ్బంది లేకుండా నిద్రపోతారు-just do this little thing before going to bed and you will fall asleep without any problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Before Sleep: నిద్రపోయే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, ఏ ఇబ్బంది లేకుండా నిద్రపోతారు

Before Sleep: నిద్రపోయే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, ఏ ఇబ్బంది లేకుండా నిద్రపోతారు

Haritha Chappa HT Telugu

Before Sleep: రాత్రి నిద్రపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు కొందరికి పొట్ట నొప్పి, గ్యాస్టిక్ సమస్యలు మొదలవుతాయి. పిల్లల్లో కూడా ఒక్కోసారి ఈ సమస్య కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు చేసే ఒక చిన్నపని ఈ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

రాత్రి నిద్రపోయే ముందు చేయాల్సిన పని (shutterstock)

రాత్రి భోజనం పూర్తి చేశాక పొట్ట ప్రశాంతంగా ఉంటేనే చక్కగా నిద్రపట్టేది. కొంతమంది నిద్రపోయే ముందు చాలా ఇబ్బంది పడతారు. పొట్టలో గ్యాస్ ఏర్పడటం, పొట్ట నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. పొట్ట అసౌకర్యంగా ఉండటం వల్ల నిద్ర పట్టదు. ఇలాగే ప్రతిరోజూ పొట్ట అసౌకర్యంగా ఉంటే నిద్రలేమి సమస్య మొదలవుతుంది. నిద్రపోయేముందు చేసే చిన్న పనులు గ్యాస్టిక్ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు.

పొట్ట సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంతో పాటు జీవనశైలి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ సమస్య తరచూ రాత్రిపూట వేధిస్తుంటే నిద్రించే ముందు చిన్న పని చేయాలి. ఇది గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

ఏం చేయాలి?

నిద్రపోయే సమయంలో పొట్టలో గ్యాస్ ఏర్పడే సమస్యకు కార్బోహైడ్రేట్లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మీరు రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడు, అది పొట్టలో వాయువు ఏర్పడటం ప్రారంభిస్తుంది. నిద్రపోతున్నప్పుడు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లతో స్పందించి గ్యాస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.

రాత్రిపూట ఏర్పడే గ్యాస్ ను ఎలా వదిలించుకోవాలి?

రాత్రిపూట గ్యాస్ ఏర్పడే సమస్య రాకుండా ఉండాలంటే భోజనం చేశాక కనీసం పావుగంట సేపు వాకింగ్ చేయాలి. ఇది గ్యాస్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. అలాగే పొట్ట మీద రోజూ మసాజ్ చేయాలి. యోగా నిపుణులు కూడా పొట్ట మీద మసాజ్ చేయడం ద్వారా గ్యాస్ ఏర్పడకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. ఇది చేతుల గుండా వెళ్లే నాడిని యాక్టివేట్ చేసి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే అరచేతులకు నూనె రాసి, అరచేతులను కలిపి రుద్దాలి.

నిద్రలేమి సమస్య వేధిస్తుంటే రెండు చేతుల వేళ్లను మిక్స్ చేసి నుదుటి అంచులను తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను కొన్ని సెకన్ల పాటు నిరంతరాయంగా చేయడం వల్ల నిద్రపోవడానికి సహాయపడుతుంది.

ఈ ఆహారాలు వద్దు

గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తినడం మానేయాలి. పప్పులు, బంగాళాదుంపలు, కొమ్ము శెనగలు వంటివి రాత్రిపూట తినకపోవడమే మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటే మానేయండి. పాలు, పెరుగు వంటివి కూడా గ్యాస్ ఉత్పత్తిని పెంచుతాయి. క్యాబేజీ, బీన్స్, బ్రోకలీ వంటి ఆహారాలను కూడా రాత్రి భోజనంలో తినకూడదు. ఈ ఆహారాలు గ్యాస్ నొప్పిని కలిగిస్తాయి. అలాగే స్వీట్లు, బ్రెడ్ వంటివి కూడా రాత్రిపూట తినకూడదు. అలాగే శీతల పానీయాలు, పండ్ల రసాలకు రాత్రి వేళల్లో దూరంగా ఉండాలి. పాస్తాలు, మొక్కజొన్న, గోధుమ పిండితో చేసిన ఆహారం, మద్యం సేవించడం వంటివి రాత్రి పూట తినడం మానేయాలి. రాత్రి తేలికపాటి ఆహారంతో భోజనాన్ని ముగించాలి.