Jowar Burfi: జొన్న పిండితో ఇలా తియ్యటి బర్ఫీ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది
Jowar Burfi: జొన్న పిండితో చేసే టేస్టీ స్వీట్ జొన్న బర్ఫీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఒకసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది.
Jowar Burfi: జొన్న పిండితో వంటలు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. నిజానికి జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనితో కొన్ని రకాల స్వీట్లు తయారు చేసుకోవచ్చు. అందులో చాలా సులువుగా చేసేది జొన్న బర్ఫీ. దీనిలో చాలా తక్కువ పదార్థాలను వాడతాము. వాడినవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ముఖ్యంగా పిల్లలకు ఇది ఎన్నో పోషకాలను అందిస్తుంది. జొన్న పిండితో చేసే ఈ బర్ఫీ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
జొన్న బర్ఫీకి కావలసిన పదార్థాలు
జొన్న పిండి - ఒక కప్పు
యాలకుల పొడి - పావు స్పూను
నెయ్యి - పావు కప్పు
తెల్ల నువ్వులు - మూడు స్పూన్లు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
నీరు - అరకప్పు
జొన్న బర్ఫీ రెసిపీ
1. స్టవ్ మీద లోతుగా ఉండే కళాయి పెట్టి జొన్న పిండిని వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు నువ్వులను కూడా వేసి వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
3. అదే బాణలిలో బెల్లం తురుము, నీరు వేసి జిగురుగా అయ్యేవరకు ఉంచాలి.
4. బెల్లం పాకం అయ్యాక జొన్న పిండి, నువ్వుల పిండి, యాలకుల పొడి, నెయ్యి వేసి గరిటతో కలుపుతూ ఉండాలి.
5. అది దగ్గరగా హల్వా లాగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి.
6. తర్వాత స్టవ్ కట్టేసి ఈ మొత్తం మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
7. అది చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేయాలి.
8. అంతే జొన్న బర్ఫీ రెడీ అయినట్టే.
9. ఇందులో వాడిన బెల్లం, జొన్నపిండి, నెయ్యి, యాలకుల పొడి, తెల్ల నువ్వులు... ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక్కసారి తిన్నారంటే ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నల్లో కాపర్, క్యాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. జొన్నలతో చేసిన ఆహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో శక్తి స్థాయిలను పెంచడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
రక్తనాళాల్లో రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అప్పుడప్పుడు జొన్న రొట్టెలను కూడా చేసుకుని తినడం వల్ల శరీరానికి శక్తి అందించిన వారు అవుతారు. ఇలా జొన్న పిండితో బర్ఫీ చేసుకున్నా మంచిదే. ఇందులో బెల్లాన్ని వాడాము. కనుక రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. పిల్లలు, మహిళలు ఈ జొన్న బర్ఫీ తినడం వల్ల వారిలో ఉన్న ఎనీమియా సమస్య తగ్గుతుంది.
టాపిక్