ఇప్పుడు కాశ్మీర్ వెళ్లడం కష్టం, కాబట్టి ఈ మినీ కాశ్మీర్ చూసేయండి, మే జూన్ నెలల్లో అద్భుతంగా ఉంటుంది-its difficult to go to kashmir now so lets see this mini kashmir it will be amazing in the months of may and june ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఇప్పుడు కాశ్మీర్ వెళ్లడం కష్టం, కాబట్టి ఈ మినీ కాశ్మీర్ చూసేయండి, మే జూన్ నెలల్లో అద్భుతంగా ఉంటుంది

ఇప్పుడు కాశ్మీర్ వెళ్లడం కష్టం, కాబట్టి ఈ మినీ కాశ్మీర్ చూసేయండి, మే జూన్ నెలల్లో అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

కాశ్మీర్ అందాలను ఎంత పొగిడినా తక్కువే. కానీ ఇప్పుడు కాశ్మీర్ వెళ్లే పరిస్థితి లేదు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కాబట్టి ఈసారి మినీ కాశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించండి. ఇది ఉత్తరాఖండ్ లో ఉంది.

మున్సియారిలోని మంచు కొండలు

కాశ్మీర్‌ను స్వర్గమనే పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ స్వర్గంలో యుద్ధ వాతావరణం ఉంది. వేసవి సెలవుల్లో కాశ్మీర్ వెళ్లాలనుకునే వారు ఈసారి మినీ కాశ్మీర్ కు వెళ్ళండి. ఇది కూడా ఎంతో అందంగా ఉంటుంది. కాశ్మీర్ ఉత్తరాఖండ్లో ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దేవ భూమి అని పిలుచుకుంటారు. ఇక్కడ ఉన్న సహజ సౌందర్యం కళ్ళను కట్టిపడేస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉత్తరాఖండ్లో ఎక్కువే.

మున్సియారి.. మినీ కాశ్మీర్

వేసవి సెలవుల్లో మీరు ఉత్తరాఖండ్లోని మినీ కాశ్మీర్ చూసేందుకు ప్రయత్నించండి. ఇక్కడి అందాలను చూస్తుంటే మీకు కాశ్మీర్ గుర్తుకు రావడం ఖాయం. అందుకే దీన్ని మినీ కాశ్మీర్ ఆఫ్ ఇండియా గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం అసలు పేరు మున్సియారి. ఇక్కడ ఉన్న పచ్చనిలోయలు, ఎత్తయిన హిమాలయ పర్వతాలు, ప్రశాంతమైన వాతావరణం మీకు కాశ్మీర్లో ఉన్న అనుభూతిని అందిస్తుంది.

మున్సియారి ప్రాంతాన్ని చూసేందుకు మే, జూన్ నెలలు ఉత్తమమైనవి. ఎలాగూ మే నెలలోనే వేసవి సెలవులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఈ మినీ కాశ్మీర్ ను చూస్తే అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి వెళ్లేందుకు ఈ ప్రాంతం అనువైనది కూడా.

స్వర్గాన్ని గుర్తుకు తెస్తుంది

మున్సియారి అనేది ఉత్తరాఖండ్లోని పితోరాఘడ్ జిల్లాలో ఉంది. సముద్రమట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న కొండ ప్రాంతం ఇది. ఈ ప్రదేశం పంచచూలి పర్వత శ్రేణిలో ఉంది. ఇక్కడున్న స్వచ్ఛమైన గాలి, మంచుతో కప్పిన పర్వతాలు, దట్టమైన అడవులు స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

మే, జూన్ నెలలో మున్సియారి వాతావరణం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది సందర్శించడానికి ఎప్పుడైనా అనుకూలమే. వేసవిలో కూడా ఇక్కడ వేడి ఎక్కువగా ఉండదు. చల్లని గాలి, పచ్చని సూర్యరశ్మి కలిసి ఒక వింతైన అనుభూతిని అందిస్తాయి.

పచ్చని ప్రకృతి సౌందర్యం మున్సియారి లోయలో నిండి ఉంటాయి. పూలతో నిండిన మొక్కలు జలపాతాలు, నదులు ఈ ప్రదేశం అందాన్ని రెట్టింపు చేస్తాయి.

ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు మున్సియారికి వెళ్ళండి. అక్కడ ఉన్న మిలాన్ గ్లేసియర్ ట్రెక్, కాలియాటాప్ ట్రెక్, నామిక్ గ్లేసియర్ ట్రెక్ వంటివి ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ అద్భుతంగా ఉంటుంది.

ఇక్కడి ప్రాంతంలోనే పురాతన ఆలయం ఒకటి ఉంది. అదే నందా దేవి ఆలయం. ఇది పార్వతీదేవికి అంకితం చేసిన గుడి. మున్సియారి ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఉత్తరాఖండ్లోనే ప్రాచీన ఆలయాలలో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఉన్న మరొక అందమైన సరస్సు తమరి కుండ్. ఈ సరస్సు నీరు నీలం రంగులో స్పష్టంగా ఉంటుంది. చుట్టూ పర్వతాల మధ్య ఉండే సరస్సును ఎంత చూసినా తనివి తీరదు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.