Monday Motivation: కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం మంచిది, ఎందుకంటే నాణాలు చేసినంత శబ్దం నోట్లు చేయవు
Monday Motivation: నిశ్శబ్దం... సమస్యలను పరిష్కరించగలరు. సమస్య పెరగకుండా అడ్డుకోగలదు. సమస్య లేకుండా చేయగలదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం చాలా ముఖ్యం.
ఒక మనిషికి నిశ్శబ్దంగా ఉండడం వస్తే చాలు, అతని మనసు అతని అదుపులోనే ఉంటుంది. అతని పనులు అతనికి నచ్చినట్టే జరుగుతాయి. ఎప్పుడైతే మాటను అదుపులో ఉంచుకోలేకపోతాడో అతడికి సమస్యలు ఎదురవుతాయి. నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే చాలు, మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించేందుకు ఆ నిశ్శబ్దమే సాయపడుతుంది.
మౌనవ్రతం మంచిదే
మన భారతీయ సంస్కృతిలో మౌనవ్రతం కూడా ఒక భాగమే. ఎంతోమంది వారంలో ఒకరోజు మౌనవ్రతం ఉంటూ ఉంటారు. దీన్ని ఆధ్యాత్మికతకు ముడిపెట్టారు. అలాగే యోగాలో ఒక భాగంగా కూడా ఇది ఉంది. అయితే మౌనవ్రతం అనేది పూర్తిగా ఆధ్యాత్మికమైనదే కాదు, అది మానసిక ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంది. ఇది స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణను నేర్పుతుంది. అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి.
నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్న వ్యక్తికి మానసిక, శారీరక ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుందట. వారిలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందట. చాలామంది ఉద్వేగంతో లేదా ఉద్రేకంతో ఎదుటివారిపై అరిచేస్తూ ఉంటారు. అనవసరమైన మాటలతో లేనిపోని నిందలకు గురవుతూ ఉంటారు. అదే వారు ఆ క్షణం నిశ్శబ్దంగా ఉండుంటే చాలా సమస్యలు వచ్చి ఉండేవి కాదు. అందుకే నిశ్శబ్దంగా ఉండడం కూడా ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయాలి. ఇది మీలో స్వీయ నియంత్రణను పెంచుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెబుతారు. అనవసర విషయాలకు, బాధలకు దూరంగా ఉంటారు.
భగవద్గీత చెప్పిన ప్రకారం మనసుపై అదుపు ఉండడం అవసరం. ఎవరి మనసుపై వారికి అదుపు లేకుంటే అది విషపూరితంగా మారుతుందని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. మనసును అదుపులో పెట్టుకోవాలంటే మీరు చేయాల్సిన మొదటి పని నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. రోజులో ఒక గంట సేపు నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నించండి.
మనిషికి భావోద్వేగాలు ఎంతో ముఖ్యం. అవి మితిమీరితే సమస్యలు కూడా వస్తాయి. ఆ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేని వారే మానసిక సమస్యల బారిన పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మొదలుపెడతారో... మీ జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. ఇంట్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు.. మీ బంధాలు భద్రంగా ఉండాలంటే ఎక్కువ కాలం నిశ్శబ్దంగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు మీపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి మీ మనసును కంట్రోల్ చేయాలంటే మౌనవ్రతం పాటించండి. కచ్చితంగా మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
అనవసరంగా మాట్లాడడం వల్ల శక్తి కూడా వృధా అవుతుంది. శరీరంలోని శక్తిని ఇలా వృధా చేయకుండా నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటే అది ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో ఒక గంటపాటు ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉండడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తి కూడా చాలావరకు తగ్గిపోతుంది.
మీలో క్రియేటివిటీ ఆలోచనలు పెరుగుతాయి. ఎమోషనల్ గా అవ్వడం కంట్రోల్‌లో ఉంటుంది. ఎదుటివారితో ప్రభావంతంగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడాన్ని తేలికగా తీసుకోకండి. కొంతమంది ఇలా మౌనంగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాంటి వారిని చూసి ఎంతోమంది ‘ఏమీ మాట్లాడడు, మూగవాడిలా కూర్చుంటాడు’ అని కామెంట్లు చేస్తారు. నిజానికి అతిగా మాట్లాడే వారి కన్నా నిశ్శబ్దంగా ఉన్నవాడే శక్తివంతమైన వ్యక్తి. అతను ఆచితూచి మాట్లాడే ప్రతి మాట తూటాల పేలుతుంది. కాబట్టి మీరు కూడా నిశ్శబ్ధాన్ని ముందుగా ప్రాక్టీస్ చేయండి. మానసిక ఆనందం పెరుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యము దక్కుతుంది.
సంబంధిత కథనం