Jack Fruit: ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పనస పండును తినడం చాలా ప్రమాదకరం
Jack Fruit: కొంతమంది పనస పండును ఇష్టంగా తింటారు. పనస పండు కోస్తుంటేనే సువాసన వస్తుంది. ఆ వాసన చూస్తే ఎవరికైనా తినేయాలనిపిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసపండు తినడం మంచిది కాదు.
వానాకాలంలోనే పనస పండు అధికంగా లభిస్తుంది. దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. దీన్నుంచి వచ్చే సువాసన తినేయాలన్న కోరికను పెంచుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు మనకు చాలా అవసరం. ఈ పండును తినడం వల్ల జీర్ణవ్యవస్థ, గుండె రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తూ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
పనస పండులో అధిక కేలరీల కంటెంట్ ఉన్నప్పటికీ, దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను వదిలించుకోవచ్చు. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొంతమంది దీనిని తినకపోవడమే మంచిది. పనస పండు తినడం వల్ల కొందరికి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జాక్ ఫ్రూట్ ను ఏ వ్యక్తులు తినకూడదో తెలుసుకుందాం.
అలెర్జీ
తరచూ అలెర్జీల బారిన పడేవారు పనస పండుగకు దూరంగా ఉండడమే మంచిది. రబ్బరు పాలు, పుప్పొడికి అలెర్జీ ఉన్నవారు పనస పండు తినకుండా ఉండాలి. ఈ పండు తినడం వల్ల వారు అలెర్జీ లక్షణాలు ఎక్కువైపోతాయి. అలెర్జీలు, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొంతమందిలో శ్వాస సమస్యలు ఉంటాయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. వారు కూడా పనస పండుకు దూరంగా ఉండడం మంచిది.
డయాబెటిస్
డయాబెటిస్ పేషెంట్లు జాక్ ఫ్రూట్ ను అతి తక్కువగా తినాలి. పనసపండులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం మంచిదే అయినా… ఎక్కువగా తగ్గడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పనస తొనలు ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలావరకు పడిపోతాయి. ఇది షుగర్ పేషెంట్లకు హానికరం.
ప్రెగ్నెన్సీ
గర్భిణీ స్త్రీలు జాక్ ఫ్రూట్ తినకూడదు. జాక్ ఫ్రూట్ లో ఉండే కరగని ఫైబర్.. తల్లీ, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. జాక్ ఫ్రూట్ తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది కాకుండా, పాలిచ్చే మహిళలు కూడా పనస పండు తినకూడదు. ఈ మహిళలు పనస తొనలు తీసుకునే ముందు తమ వైద్యుడిని సంప్రదించాలి.
మూత్రపిండాల వ్యాధి
మూత్రపిండాల వ్యాధితో పోరాడుతుంటే, పనస పండును తినడం మానుకోండి. జాక్ ఫ్రూట్ లో ఉండే పొటాషియం… రక్తంలో పొటాషియం స్థాయిని పెంచడం ద్వారా మూత్రపిండాలకు సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని హైపర్కలేమియా అంటారు. ఇది పక్షవాతం, గుండె వైఫల్యానికి కూడా కారణమవుతుంది.
శస్త్రచికిత్స సమయంలో
ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు లేదా తరువాత పనసపండును కూడా నివారించాలి. ఇలా చేయడం వల్ల మీకు కడుపుకు సంబంధించిన సమస్య పెరుగుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణించుకోవడం కూడా కష్టతరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఆపరేషన్ చేయబోయే వ్యక్తులు రెండు వారాల ముందు జాక్ఫ్రూట్ తీసుకోవడం మానేయాలి.