Fruits in Pregnancy: గర్భం ధరించాక ఈ పండ్లు తినడం మంచిది కాదు, ఆ పండ్లేంటో తెలుసుకోండి
Fruits in Pregnancy: గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తినకూడని కొన్ని పండ్ల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇవి తల్లికి, బిడ్డకూ ఇద్దరికీ మంచిది కాదు. ఆ పండ్లు ఏమిటో తెలుసుకోండి.
గర్భధారణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇద్దరి ఆరోగ్యానికి హాని కలగవచ్చు. తల్లి తినే ఆహారం ఆమె ఆరోగ్యంపై, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. సరైన అవగాహన లేకుండా గర్భిణీలు కొన్ని రకాల పదార్థాలను, పానీయాలను తినడం వంటివి చేస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా భావించే కొన్ని పండ్లు గర్భధారణ సమయంలో మాత్రం తల్లీబిడ్డల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆ పండ్లు ఏమిటో తెలుసుకోండి. వీటిని గర్భం ధరించాక తక్కువగా తీసుకుంటే మంచిది.

పైనాపిల్ తినొద్దు
గర్భధారణ సమయంలో తీపిగా పుల్లగా ఉండే పైనాపిల్ తినడం మంచిది కాదు. పైనాపిల్ లో 'బ్రోమెలైన్' అనే మూలకం ఉంటుంది. ఇది గర్భధారణలో హానికరంగా మారుతుంది. పైనాపిల్ ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో పైనాపిల్ తినకుండా ఉండటం మంచిది.
నల్ల ద్రాక్షలు
గర్భధారణ సమయంలో అధికంగా పుల్లని ద్రాక్షలు తినడం హానికరం. నిజానికి ద్రాక్షలో 'రెస్వెరాట్రాల్' అనే మూలకం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. గర్భధారణ సమయంలో ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినడం వల్ల తల్లికి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అదే సమయంలో శిశువు ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. అయితే, డాక్టర్ సలహాతో, మీ ఆహారంలో కొద్ది మొత్తంలో ద్రాక్షను చేర్చవచ్చు.
చింతకాయలు
ప్రెగ్నెన్సీ సమయంలో పుల్లని చింతకాయలు తినాలని అనిపించడం సహజం. అయితే, ఇది ఆరోగ్య పరంగా మంచిది కాదు. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో అంటే మూడు నెలల్లో చాలా తక్కువగా చింతకాయలు తీసుకోవాలి. వాస్తవానికి, చింతపండు లేదా చింతకాయ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడే కొన్ని అంశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, చింతపండు ఎక్కువగా తినడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది.
బొప్పాయి
స్త్రీలు తమ ఆహారంలో పచ్చి బొప్పాయిని లేదా బొప్పాయి పండును తినకూడదు. పచ్చి బొప్పాయి తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా, దీనిలో ఉండే లేటెక్స్ పిండానికి హానికరంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, డాక్టర్ సలహా లేకుండా మీ ఆహారంలో ఎక్కువ పచ్చి బొప్పాయిని చేర్చడం మానుకోండి.
అరటిపండ్లు తినొద్దు
గర్భధారణ సమయంలో అరటిపండ్లు తినడం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పోషకాలు తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో, గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తినకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్న మహిళలకు, అరటిపండ్లు తినడం సురక్షితంగా కాదు. అంతేకాకుండా అలర్జీ లేదా జెస్టేషనల్ డయాబెటిస్ సమస్య ఉంటే గర్భధారణ సమయంలో అరటిపండ్లకు దూరంగా ఉండాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)