Monday Motivation: సమయం ఉన్నప్పుడు మాట్లాడడం కాదు, సమయం కల్పించుకుని మాట్లాడితేనే బంధుత్వం నిలిచేది
Monday Motivation: ప్రతి జీవితంలో బంధుత్వాలు, స్నేహాలు చాలా అవసరం. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహం, బంధం ఈ రెండూ జీవితానికి ఎంతో ముఖ్యం.
Monday Motivation: బంధమైన, బంధుత్వాలయినా, స్నేహమైనా... మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఈ జన్మలోనే వాటిని కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవడం చాలా కష్టం, దూరం కాకుండా ప్రతి బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహం, బంధం పదిలంగా ఉండాలంటే... మన మాట తీరే ముఖ్యం. ఎదుటివారి మనసు గాయపడేట్టు మాట్లాడితే.. స్నేహితులైనా, బంధువులైనా విరోధులవుతారు. మంచి మనస్సుకు, మంచి మాటకు మాత్రమే విలువ ఉంటుంది.
బంధుత్వం అనేది ఒక పుస్తకం లాంటిది. రాయడానికి ఒక సంవత్సరం పడుతుంది. కానీ కాల్చేయడానికి ఒక్క సెకనులో కాలి బూడిద అయిపోతుంది. అందుకే బంధుత్వమైనా, స్నేహమైనా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని బంధాలు, బంధుత్వం దగ్గరే ఆగిపోతాయి. కానీ కొన్ని స్నేహాలు, బంధాలు మనసులోకి జారి మనతోనే ఉండిపోతాయి. అలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాలి. కష్టమొస్తే చెప్పుకోవడానికి మనవారంటూ మనుషులు ఉండాలి.
బంధమైనా, స్నేహమైనా మనసుకు సంబంధించింది. ఎదుటివారి ఆస్తి అంతస్థులను చూసి బంధుత్వాలను, స్నేహాలను కలుపుకుంటే అవి కలకాలం నిలవవు. బంధం, స్నేహం అనేవి పేద, ధనిక, కుల,మత భేదం లేనిది. వాటిని చూసి స్నేహాన్ని, బంధుత్వాన్ని పెంచుకోలేం. అలానే తగ్గించుకోలేం.
బంధుత్వాన్ని గాజు బొమ్మలా కాపాడుకుంటూ రావాలి. బంధుత్వం మధ్యలో తెగిపోతే కలుపుకోవాల్సిన బాధ్యత మీదే. చుట్టూ నలుగురు బంధువులు లేని జీవితం, నలుగురు స్నేహితులు లేని జీవితం వృధా. బంధుత్వాన్ని నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది. నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది.
చిన్ననాటి అనుబంధాలు, రక్త సంబంధాలు ఎంతో విలువైనవి. ఆ బంధం ఉన్ననాడే వాటి విలువను తెలుసుకొని మసులుకోవాలి. ఒక్కసారి ఆ బంధాలు దూరం అయితే ఎవరూ లేని ఒంటరి వారిగా అయిపోతారు.
కొంతమంది బంధువులు అన్నీ ఉన్ననాడే కలిసి వస్తారు, మీ దగ్గర ఏమీ లేనప్పుడు దూరంగా వెళ్తారు. అలాంటి వారిని దూరంగానే ఉంచండి. మీ దగ్గర ఏమీలేనినాడు ఎవరూ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారో వారే అసలైన ఆత్మ బంధువులు.
మన అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టానికి ఎదురెళ్లి మీరే నిలబడాలి. అప్పుడే నీది నిజమైన బంధం, స్నేహం అని అర్థం. బంధువులకు, స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆ బాధలన్నీ తీర్చక్కర్లేదు, కానీ ఆ బాధల్లో వారికి తోడుగా ఉంటే చాలు. మీరు విలువైన వ్యక్తిగా ఎదుగుతారు.