సిగరెట్ తాగడం కంటే వేపింగ్ సురక్షితమైన ప్రత్యామ్నాయమా? డాక్టర్ చెప్పిందిదే-is vaping actually a safer alternative to smoking cigarettes doctor reveals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సిగరెట్ తాగడం కంటే వేపింగ్ సురక్షితమైన ప్రత్యామ్నాయమా? డాక్టర్ చెప్పిందిదే

సిగరెట్ తాగడం కంటే వేపింగ్ సురక్షితమైన ప్రత్యామ్నాయమా? డాక్టర్ చెప్పిందిదే

HT Telugu Desk HT Telugu

వేపింగ్‌ను సిగరెట్లు తాగడానికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా యువత పరిగణిస్తోంది. కానీ నిజం మరింత సంక్లిష్టమైనది. రెండింటికీ సంబంధించిన ప్రమాదాలను డాక్టర్ వివరించారు. ఇక్కడ తెలుసుకోండి.

వేపింగ్ ఆరోగ్యానికి హానికరమంటున్న డాక్టర్లు (pixabay)

వేపింగ్ (ఇ-సిగరెట్స్ వాడకం)ను సిగరెట్లు తాగడం కంటే 'ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా' చూస్తారు. కానీ ఈ ఆలోచన తప్పుదారి పట్టించేది. సౌలభ్యం, అవాంఛనీయ వాసన లేకపోవడం లేదా అంత హానికరం కాదనే అపోహ కారణంగా వేపింగ్ సిగరెట్ తాగడం కంటే తక్కువ హానికరం అని భావించినప్పటికీ, అది సురక్షితం కాదు. వేప్‌లలో నికోటిన్, ఇతర విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్, రెస్పిరేటరీ, క్రిటికల్ కేర్ మరియు స్లీప్ మెడిసిన్ డాక్టర్ వినీ కాంత్రూ హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరించారు. ప్రజలు నికోటిన్‌ను ఉపయోగించే రెండు సాధారణ మార్గాలు సిగరెట్ తాగడం, వేపింగ్ అని, అయితే ఆరోగ్య ప్రమాదాల విషయానికి వస్తే అవి ఒకేలా ఉండవని చెప్పారు.

సిగరెట్ తాగడం vs వేపింగ్

"సిగరెట్ తాగడంలో పొగాకును కాల్చడం ఉంటుంది. ఇది వేలకొలది రసాయనాలను కలిగి ఉన్న పొగను ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనాలలో చాలా వరకు విషపూరితమైనవి. డజన్ల కొలది క్యాన్సర్‌కు కారణమవుతాయని అందరికీ తెలుసు. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, ఎంఫిసెమా వంటి శ్వాస సమస్యలతో ధూమపానం సంబంధం కలిగి ఉంది" అని ఆమె వివరించారు.

"నికోటిన్, ఫ్లేవరింగ్‌, ఇతర రసాయనాలను సాధారణంగా కలిగి ఉండే ద్రవాన్ని (ఇ-లిక్విడ్ లేదా వేప్ జ్యూస్ అని పిలుస్తారు) వేడి చేయడానికి వేపింగ్ ఒక పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఇది మీరు పీల్చే ఆవిరిని సృష్టిస్తుంది. ఇ-సిగరెట్లు పొగాకును కాల్చవు. కాబట్టి అవి సాధారణ సిగరెట్ల కంటే తక్కువ విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి" అని వివరించారు.

అయితే, ఈ ఆవిరిలో హానికరమైన పదార్థాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. "డైసిటైల్ (కొన్ని ఫ్లేవరింగ్‌లలో ఉపయోగించేది) వంటి రసాయనాలు, వేపింగ్ పరికరం నుండి భారీ లోహాలు పీల్చుకోవాల్సి వస్తుంది. ఊపిరితిత్తుల లోపలి పొరను దెబ్బతీస్తుంది. ఇది మన శరీర కణజాలాల పనితీరును మార్చేస్తాయి. ఇది చికాకు, అధిక శ్లేష్మం లేదా కఫం స్రావాలకు దారితీస్తుంది. ఈ స్రావాలు శ్వాసనాళాలను అడ్డుకున్నప్పుడు, అవి సాధారణ శ్వాసకు అంతరాయం కలిగిస్తాయి. తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి" అని వివరించారు.

స్మోకింగ్
స్మోకింగ్ (Shutterstock)

వేపింగ్‌తో ప్రమాదాలు ఇలా

‘చాలా మంది వేపింగ్ సాంప్రదాయ సిగరెట్లు తాగడం కంటే తక్కువ హానికరం అని భావిస్తారు. పొగాకును కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే ప్రమాదకరమైన రసాయనాలను వేపింగ్ ఉత్పత్తి చేయదు కాబట్టి ఇలా భావిస్తారు. వేపింగ్ ఇప్పటికీ మీ శరీరాన్ని నికోటిన్‌కు గురిచేస్తుంది. ఇది వ్యసనపరులుగా మార్చేస్తుంది. మీ గుండె, మెదడును ప్రభావితం చేయగలదు. ఇ-సిగరెట్ల నుండి వచ్చే ఆవిరిలో కూడా మీ ఊపిరితిత్తులను చికాకుపెట్టే, దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలలో కొన్ని డైసిటైల్ వంటివి, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నాయి." అని వివరించారు.

వేపింగ్ సమయంలో రసాయనాలు, లోహాలు రక్తప్రవాహంలోకి చేరి, శరీర ఇతర భాగాలలో.. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలపై హానికరమైన ప్రభావాలను చూపుతాయని డాక్టర్ కాంత్రూ వివరించారు.

"ఇటువంటి అవయవాలలో ఈ పదార్థాల నిక్షేపణ సహజ డీటాక్సిఫికేషన్ ప్రక్రియలను మార్చగలదు. ముఖ్యమైన రసాయన ప్రతిచర్యలకు ఆటంకం కలిగించగలదు. కాలక్రమేణా ఈ అవయవాలు పనిచేసే విధానాన్ని దెబ్బతీయవచ్చు" అని వివరించారు.

పరిగణించాల్సిన ఆరోగ్య ప్రమాదాలు

ధూమపానంలోనూ, వేపింగ్‌లోనూ నికోటిన్ వ్యసనానికి దారితీస్తుందని డాక్టర్ కాంత్రూ చెప్పారు. "వేపింగ్ ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పైగా వేపింగ్ దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు" అని డాక్టర్ వివరించారు.

"యువకులు, గర్భిణీ స్త్రీలకు వేపింగ్ ప్రమాదకరమైనది. ఇది టీనేజర్లలో మెదడు అభివృద్ధికి హాని కలిగించవచ్చు. తరువాత సాధారణ సిగరెట్లు తాగడం ప్రారంభించే అవకాశాలను పెంచుతుంది" అని హెచ్చరించారు.

"ఈ రెండు అలవాట్లు మీ ఆరోగ్యానికి హాని కలిగించగలవు. వీటిని నివారించడం ఉత్తమం. మీరు వేపింగ్ ప్రారంభించవద్దు. మీరు ధూమపానం చేస్తున్నట్టయితే పూర్తిగా మానేయడమే ఆరోగ్యకరమైన ఎంపిక. మీరు మానేయడానికి సహాయం కావాలంటే, మీ వైద్యుడితో మాట్లాడండి..’ అని సూచించారు.

(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యపరమైన పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)