ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు కళ్లజోడు చాలా సాధారణంగా కనిపిస్తుంది. తరగతి గదిలో బ్లాక్ బోర్డు చూడాలన్నా, టీవీ చూడాలన్నా కూడా మసకగా కనిపించడం వల్ల కళ్లజోడు అవసరం అవుతోంది. ఈ విధంగా దూరంగా ఉన్న వస్తువులు సరిగా కనిపించకపోవడాన్ని మయోపియా (నికట దృష్టి లోపం) అంటారు. చాలా మంది పిల్లల్లో ఈ తరహాలో పాలు పళ్లు రాలకముందే కళ్లజోడు అవసరం అవుతుండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సమయం స్క్రీన్‌లు చూడటం అయినప్పటికీ, చిన్న పిల్లల దృష్టి లోపానికి మరో కారణం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ విషయం గురించి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, బెంగళూరులోని క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ అమోద్ నాయక్ కీలక విషయాలు వెల్లడించారు. పిల్లల్లో నిద్రలేమితో పెరుగుతున్న సమస్యలను వివరిస్తూనే, కళ్లజోడు అవసరం దేనికి కలుగుతుందో ఆయన పేర్కొన్నారు.
"మొత్తం ఆరోగ్యానికి, అంటే శారీరక, మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం తిరిగి శక్తిని పొందడానికి మాత్రమే కాకుండా, ఆలోచనా శక్తిని, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా అవసరం. పిల్లల్లో మెదడు ఎదుగుదలకు, శారీరక ఎదుగుదలకు కూడా నిద్ర ఎంతో తోడ్పడుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా, తగినంత నిద్ర లేకపోవడం, తక్కువ సమయం నిద్రపోవడం లేదా నిద్ర నాణ్యత లోపం వంటి అంశాలు పిల్లలలో మయోపియా (దృష్టి లోపం)కు కారణం అవుతున్నాయి" అని డాక్టర్ అమోద్ నాయక్ వివరించారు.
మరింత వివరణాత్మకంగా విశ్లేషించిన డాక్టర్ అమోద్ నాయక్ నిద్రలేమి అలవాట్లు ఏమిటి, నిద్ర దృష్టిని ఎలా ప్రభావితం చేస్తుంది?తల్లిదండ్రులు ఈ పరిస్థితిని తగ్గించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
1. తక్కువ సమయం పాటు నిద్రపోవడం అంటే రాత్రుళ్లు 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం.
2. రాత్రుళ్లు తరచుగా మేల్కొనడం, కంట్రోల్ లేకుండా నిద్రపోవడం.
3. పడుకునే ముందు ఎక్కువసేపు స్క్రీన్ వినియోగించడం.
పిల్లలకు నిద్ర తగ్గడం వల్ల, ముఖ్యంగా రెండు రకాల నరాల రసాయనాలలో తేడాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే:
డోపమైన్: ఇది మన మెదడులో ఉండే ఒక రసాయనం, ఇది కంటి పెరుగుదలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మెలటోనిన్: ఇది మనం నిద్రపోవడానికి సహాయపడే హార్మోన్, ఇది మన శరీరంలోని సహజంగా నిద్ర-మేల్కొనే చక్రాన్ని (సర్కేడియన్ రిథమ్) నియంత్రిస్తుంది.
ఈ రెండు రసాయనాలు ఆరోగ్యకరమైన నిద్ర, సరైన మానసిక స్థితి, కంటి సరైన అభివృద్ధికి చాలా అవసరం.
పిల్లలకు నిద్ర తగ్గినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీనివల్ల కంటిలోని రెటీనా పనితీరు దెబ్బతింటుంది. కంటి పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
నిద్ర లేకపోతే డోపమైన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. డోపమైన్ కంటి పరిమాణం అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. దీని స్థాయిలు తగ్గడం వల్ల కంటిపాప (eye globe) పొడవు పెరిగి, మయోపియా (దృష్టి లోపం) తీవ్రమయ్యే అవకాశం ఉంది.
సరిగా నిద్రపోని పిల్లలు తరచుగా నీరసంగా ఉంటారు. బయట ఆడుకోవడానికి లేదా వెళ్ళడానికి ఆసక్తి చూపించరు. బయటి సహజ కాంతి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది లేకపోవడం కూడా దృష్టి లోపానికి ఒక కారణం అవుతుంది.
ఫోన్లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు వంటి LED స్క్రీన్ల నుండి వచ్చే కృత్రిమ నీలి కాంతి కళ్ళకు హానికరం. ఇది మన శరీరంలోని సహజ స్లీపింగ్ సైకిల్‌ను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా రెటీనాలో డోపమైన్ విడుదలను అడ్డుకుంటుంది. మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్ర ఆలస్యం అవ్వడం, మొత్తం నిద్ర సమయం తగ్గడం జరుగుతుంది.
పిల్లల కంటి కటకాలు (లెన్సులు) చాలా స్పష్టంగా ఉంటాయి. వారి కంటి పాపలు పెద్దవిగా ఉండి పెద్దల కంటే పిల్లలే నీలి కాంతికి ఎక్కువ ప్రభావానికి గురవుతారు. కాబట్టి స్క్రీన్ల ప్రభావం వారిపై మరింత బలంగా ఉంటుంది.
పిల్లలు ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి నిద్ర లేచేలా చూసుకోండి. ఇది వారి శరీరంలోని సహజ నిద్ర చక్రాన్ని సరిచేస్తుంది.
పిల్లలు పగటిపూట బయట ఆడుకోవడాన్ని ప్రోత్సహించండి. సూర్యరశ్మి, సహజ కాంతి కంటి ఆరోగ్యానికి, నిద్రకు సహాయపడతాయి.
ఫోన్లు, టాబ్లెట్‌లు వాడే సమయాన్ని పరిమితం చేయండి. ముఖ్యంగా, పడుకునే ముందు అస్సలు స్క్రీన్‌లు వాడకుండా చూసుకోండి.
స్క్రీన్ వాడకం తప్పనిసరి అయితే, పరికరాల్లోని బ్లూ లైట్ ఫిల్టర్‌లు లేదా 'నైట్ మోడ్' సెట్టింగ్‌లను వాడండి.
రాత్రి పూట ఇంట్లో తక్కువ వెలుగు ఉండేలా చూసుకోండి. ఇది నిద్ర త్వరగా రావడానికి సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.