చెమటకు మొటిమలు ఎక్కువ అవుతున్నాయా? ఈ ఐస్ ట్రిక్‌తో వాటికి చెక్ పెట్టేయండి!-is sweat worsening your acne discover the cooling power of this ice cube hack to banish breakouts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చెమటకు మొటిమలు ఎక్కువ అవుతున్నాయా? ఈ ఐస్ ట్రిక్‌తో వాటికి చెక్ పెట్టేయండి!

చెమటకు మొటిమలు ఎక్కువ అవుతున్నాయా? ఈ ఐస్ ట్రిక్‌తో వాటికి చెక్ పెట్టేయండి!

Ramya Sri Marka HT Telugu

మొటిమల సమస్యతో విసిగిపోయారా? చెమట కారణంగా అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతున్నాయా? ఎన్నో రకాల క్రీములు వాడి అలసిపోయిన వాళ్లకి, ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోగలిగే ఒక సహజమైన పరిష్కారం ఉంది. మీ చర్మాన్ని మళ్ళీ ఆరోగ్యంగా, మెరిసేలా మార్చే ఐస్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలకు ఐస్ క్యూబ్ తో పరిష్కారం (shutterstock)

వేసవికాలంలో చెమట పట్టడం మామూలే. కానీ కొందరికి ముఖం మీద చాలా ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల చర్మం కింద ఉండే జిడ్డు గ్రంథులు (నూనె తీసేవి) మరీ ఎక్కువగా పనిచేసి, జిడ్డుని బయటికి పంపుతాయి. ఈ జిడ్డు చెమటతో కలిసి ముఖం మీద ఉండే చిన్న రంధ్రాలను (pores) మూసేస్తుంది. ఇలా రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు ఎక్కువ వస్తాయి. అంతేకాదు, ముఖం మీద ఉండే మెరుపు తగ్గిపోయి, డల్, నిర్జీవంగా కనిపిస్తుంది.

మీరు కూడా ఇలా ఎక్కువగా చెమట పట్టడం వల్ల, మొటిమలతో, లేదా ముఖం కాంతి కోల్పోవడంతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ సమస్యలన్నింటికీ ఒక మంచి సులభమైన పరిష్కారం ఉంది. అదే ఐస్ క్యూబ్ ట్రిక్.

మీరు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే ఈ ప్రత్యేకమైన ఐస్ క్యూబ్‌ను వాడటం వల్ల ముఖం మీద మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. చెమట పట్టడం తగ్గుతుంది. అంతేకాకుండా, మొటిమలు రాకుండా చూస్తుంది. మీ ముఖానికి మళ్ళీ మంచి మెరుపు వస్తుంది. ఇకపై చెమట వల్ల వచ్చే చర్మ సమస్యల గురించి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఐస్ క్యూబ్‌ను ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో చూద్దాం.

ఐస్ క్యూబ్ తయారు చేయడానికి 3 పదార్థాలు:

  1. దోసకాయ (ఒకటి మీడియం సైజ్)
  2. గ్రీన్ టీ (ఒక టీ బ్యాగ్ లేదా ఒక చెంచా గ్రీన్ టీ ఆకులు)
  3. ముల్తానీ మట్టి (రెండు నుండి మూడు చెంచాలు)

ఐస్ ప్యాక్ తయారు చేయడం ఎలా?
ఐస్ ప్యాక్ తయారు చేయడం ఎలా?

ఐస్ క్యూబ్ ఎలా తయారు చేయాలి

  • ముందుగా ఒక దోసకాయను తీసుకుని శుభ్రంగా కడిగి దాని పై తొక్క తీయకుండానే తురుముకోండి.
  • తురిమిన దోసకాయను ఒక గిన్నెలో ఉంచండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది చర్మానికి చల్లదనాన్ని, తేమను అందిస్తుంది.
  • ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు పోసి వేడి చేయండి. నీరు మరుగుతున్నప్పుడు, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను లేదా గ్రీన్ టీ ఆకులను వేసి, రెండు నిమిషాలు మరిగించండి.
  • ఆ తర్వాత మంట ఆర్పేసి, టీని చల్లార్చండి.
  • పూర్తిగా చల్లారిన తర్వాత, టీని వడకట్టి, ఆ నీటిని పక్కన పెట్టుకోండి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో ముల్తానీ మట్టిని వేయండి.
  • తర్వాత తురిమిన దోసకాయను, దాని నుండి వచ్చే దోసకాయ రసాన్ని కూడా ముల్తానీ మట్టిలో కలపండి.
  • చివరగా, చల్లార్చిన గ్రీన్ టీని కూడా ఈ మిశ్రమంలో పోయండి.
  • ఈ పదార్థాలన్నింటినీ ఉండలు లేకుండా బాగా కలపండి. ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ పేస్ట్ మరీ పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే మరికొద్దిగా గ్రీన్ టీ లేదా నీటిని కలుపుకోవచ్చు.
  • ఈ మిశ్రమాన్ని సిలికాన్ మోల్డ్‌లలో లేదా మీ ఇంట్లో ఉన్న సాధారణ ఐస్ ట్రేలలో పోయండి.
  • ఈ ఐస్ ట్రేలను ఫ్రీజర్‌లో కనీసం 3-4 గంటల పాటు లేదా గట్టిగా గడ్డకట్టే వరకు ఉంచండి. అంతే చెమట కారణంగా మొటిమలకు చెక్ పెట్టే ఐస్ క్యూబ్‌లు రెడీ అయినట్టే.

ఐస్ క్యూబ్ వాడే విధానం ఏంటో చూద్దాం..

  1. ఈ ప్యాక్ వాడటానికి ముందుగా మీ ముఖాన్ని ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోండి. ముఖంపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి.
  2. తరువాత ఫ్రీజర్‌లో గడ్డకట్టిన ఐస్ క్యూబ్‌ను తీసుకోండి. కావాలంటే ఒక పల్చని శుభ్రమైన కాటన్ వస్త్రంలో చుట్టి వాడుకోవచ్చు, లేదా నేరుగా కూడా వాడవచ్చు.
  3. ఐస్ క్యూబ్‌ను మీ ముఖంపై ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే లేదా మొటిమలు వచ్చే భాగాలపై 4-5 నిమిషాల పాటు తేలికగా, వృత్తాకారంలో (గుండ్రంగా) మసాజ్ చేస్తూ రుద్దండి. ఐస్ క్యూబ్ చర్మంపై నేరుగా ఎక్కువసేపు ఒకే చోట ఉంచకుండా, కదుపుతూ ఉండాలి.
  4. మసాజ్ చేసిన తర్వాత ముఖంపై ఉన్న ద్రవం ఆరిపోయేలా కొంతసేపు అలాగే వదిలేయండి.
  5. ఆ తర్వాత మీ ముఖాన్నిచల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
  6. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, బయటికి వెళ్లేటట్లయితే తప్పకుండా సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోకండి.

ఈ ఐస్ క్యూబ్ ట్రిక్‌ను ప్రతిరోజూ ఉదయం ప్రయత్నించండం వల్ల వేసవిలో వచ్చే మొటిమల సమస్య నుండి ఉపశమనం పొందడమే కాకుండా, మీ ముఖం ప్రకాశవంతంగా, తాజాగా మారుతుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.