నిపా వైరస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేరళ. కేరళలో నిఫా వైరస్ బారినపడి అప్పట్లో ఎంతో మంది మరణించారు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిపా వైరస్ గురించి ఆందోళన కూడా తగ్గింది.
కానీ ఇప్పుడు మళ్లీ నిపా వైరస్ కలకలం రేగుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఒక మహిళ లో నిపా వైరస్ లాంటి లక్షణాలు కనిపించాయి. ఆమె ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆ జిల్లాలో మళ్లీ కలవరం మొదలైంది.
ఈ మహిళ మలప్పురం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందినది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకున్న లక్షణాలు నిపా వైరస్ లక్షణాలలాగే కనిపించాయి. జిల్లా ఆరోగ్య అధికారులు దగ్గరుండి ఆమెను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎటువంటి అధికారిక ధ్రువీకరణను ఇవ్వలేదు. రోగి నమూనాలను పరీక్ష కోసం జాతీయ ప్రయోగశాలకు పంపించినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. దాని నుంచి వచ్చిన ఫలితాలను బట్టి వారు అది నిపా వైరస్ కాదా అనేది ప్రకటించబోతున్నారు.
నిపా వైరస్ సోకిన వారిలో మొదట చిన్నగా జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటివి మొదలవుతాయి. అవి కొన్ని గంటల తర్వాత విపరీతంగా మారుతాయి. వారు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కండరాల నొప్పులు పెరిగిపోతాయి. వాంతులు అవుతాయి. కొన్ని సందర్భాల్లో మెదడు వాపు వచ్చే అవకాశం కూడా ఉంది. మూర్చలు కూడా రావచ్చు. లక్షణాలు అన్నీ సాధారణ జ్వరంలో కూడా ఉంటాయని ఎంతోమంది పట్టించుకోరు. చివరికి ప్రాణాంతకంగా మారేవరకు వదిలేస్తారు.
నిపా వైరస్ గాలి ద్వారా వ్యాపించి వైరస్ కాదు. అయితే నిపా వైరస్ సోకిన వారితో దగ్గరగా ఉన్న వారి నోటిలోని నీటి తుంపరలు ఎదుటివారిపై పడి శ్వాసకోశంలోకి చేరుతాయి. వారు ఈ నిపా వైరస్ బారిన పడే అవకాశాలు పెరిగిపోతాయి.
ఈ వైరస్ తీవ్రంగా మారితే ప్రాణాంతకమైన పరిస్థితులు వస్తాయి. దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి మీకు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిపా వైరస్ అనేది ఒక ప్రాణాంతకమైన వైరస్. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు వస్తుంది. మనుషుల నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే నిపా వైరస్ ఒక అంటువ్యాధి. దీనికి ఇప్పటివరకు సమర్థవంతమైన టీకా, చికిత్స లేదు. ఇది సోకిన వారిలో కొంతమంది కోమాలో కూడా చేరిపోయారు.మరణాల రేటు కూడా ఎక్కువే ఉంది. కాబట్టి ఈ వైరస్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
టాపిక్