Honey: పచ్చితేనెను ప్రతిరోజూ తినడం సురక్షితమేనా? ఈ తేనెను ఎవరు తినకూడదు?
Honey: చాలామంది ఒక స్పూన్ తేనె తింటూ ఉంటారు. కొంతమంది గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. తేనెను పచ్చిగా తినడం మంచిదా లేక ఏదైనా పానీయంలో కలుపుకొని తాగడం మంచిదా?
Honey: పచ్చి తేనె లేదా ముడి తేనె అంటే ఈ తేనెలో ఎలాంటి రసాయనాలు కలపరు. పచ్చి తేనెను ఒక స్పూను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో లేదో చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక స్పూను పచ్చితేనెను తినడం వల్ల కొంతమందికి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరికొందరికి మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు. అలా కాకుండా గోరువెచ్చని నీళ్లలో లేదా పాలల్లో కలుపుకుని తాగే వారు కూడా ఉన్నారు. నిజానికి తేనె ఎలా తిన్నా ఎంతో కొంత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఉత్తి తేనే తినడం వల్ల ప్రయోజనమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనేతో ఉపయోగాలు
ముడి తేనెలో ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ తేనెను తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని ఈ తేనే అందిస్తుంది. సెల్ డామేజ్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దీనిలో ఎక్కువ ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు తేనె ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను పెరగకుండా అడ్డుకుంటాయి.
గొంతు నొప్పి, దగ్గులతో బాధపడేవారు ప్రతిరోజూ కచ్చితంగా ఒక స్పూను తినడం చాలా మంచిది. ఇది సహజంగానే దగ్గును తగ్గిస్తుంది. గొంతు సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గొంతు చికాకు, గొంతు పూత వంటివి రాకుండా తగ్గిస్తుంది.
పచ్చి తేనే జీర్ణక్రియలో ఎంతో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ పేగులలో ప్రయోజనకరమైన, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పోషించేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది.
ముడి తేనెలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇవి రోగ నిరోధిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్లు అనారోగ్యాలతో పోరాడే శక్తిని అందిస్తాయి.
తేనె ఎవరు తినకూడదు?
పచ్చి తేనెను ఎవరు తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలా ముడి తేనెను శిశువులకు తినిపించకపోవడమే మంచిది. ఒక ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న శిశువులు పచ్చి తేనెను తినడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి కచ్చితంగా తేనే శిశువులకు పెట్టకూడదు.
కొంతమందికి త్వరగా అలెర్జీలు వస్తూ ఉంటాయి. అలాంటివారికి ముడి తేనె పడకపోవచ్చు. ఎందుకంటే ఈ పచ్చి తేనెలో పుప్పొడి, తేనెటీగ నుంచి వచ్చే ప్రోటీన్ కలిసి ఉంటాయి. ఇది అలెర్జీలకు కారణం అవ్వచ్చు. ఎవరైతే దురద బారిన త్వరగా పడుతూ ఉంటారో... అలాంటివారు కచ్చితంగా తేనే తినడం మానేయాలి. అలాగే తేనెటీగల ఉత్పత్తులు కొంతమందికి అలెర్జీలను కలిగిస్తాయి. అలాంటివారు దీనికి దూరంగా ఉండడం మంచిది.
పురుగుమందులు వాడిన మొక్కలకు పూసిన పూల నుంచి సేకరించిన పుప్పొడితో తయారైన తేనెను తినకూడదు. అలాంటి ప్రాంతాల నుంచి తేనెను సేకరించి ఉంటే దానిని తినకపోవడమే మంచిది. అడవులలో చెట్లపై పెట్టే తేనెపట్టు సేంద్రియమైనవి. కాబట్టి అలాంటివే ఎంచుకోవాలి.
తేనె ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మితంగా తీసుకోవాలి. తేనెను అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.