Irregular Periods after Delivery: డెలివరీ తర్వాత పీరియడ్స్ సరిగా రాకపోవడం సాధారణమేనా? ఎలాంటి సమయంలో వైద్యుల్ని కలవాలి?
Irregular Periods after Delivery: చాలా మంది స్త్రీలలో ప్రసవం తర్వాత పీరియడ్స్ సరిగా రావు. దీనిని చాలా సాధారణమైన విషయంగానే అనుకుంటారు. కానీ, ఈ విధంగా సమయంతో పని లేకుండా క్రమం లేని పీరియడ్స్ రావడానికి కారణమేంటి? ఈ సమస్యను ఎంతమేర సాధారణమైనదిగా పరిగణించాలో తెలుసుకుందామా..
పసిబిడ్డ రూపంలో ఓ కొత్త వ్యక్తి మన జీవితాల్లోకి రాగానే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ, అప్పుడే తల్లి అయిన మహిళలకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిద్రలేని రాత్రులు, హార్మోనల్ సమస్యలు, క్రమంలేని పీరియడ్స్ వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటాయి. పిల్లలకి పాలిస్తుండటం వల్ల తల్లుల్లో హార్మోనల్ సమస్యలు, స్ట్రెస్ పెరగడం లాంటివి సంభవించి చికాకును కలిగిస్తాయి. ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ప్రధానంగా డెలివరీ తర్వాత పీరియడ్స్ రావడం కూడా ఆలస్యంగా లేదా ముందే రావడం జరుగుతుంటుంది. దీనిని చాలా వరకూ సాధారణంగానే పరిగణించాలి. కాకపోతే, అదే సమస్య నెలల తరబడి కొనసాగుతుంటే, తప్పకుండా వైద్యుడ్ని కలవాల్సి ఉంటుంది.
పీరియడ్స్ క్రమం తప్పడం అంటే ఏంటి?
డెలివరీ తర్వాత మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పి రావడం జరుగుతుంది. పిల్లల్ని కనడం వల్ల జరిగే హార్మోనల్ మార్పులు కూడా దీనికి కారణం కావొచ్చు. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లలో మార్పులు నెలసరి ముందు అయిపోవడం లేదా నెలలు గడుస్తున్నా కాకపోవడం వంటి వాటికి కారణమవుతుంది. దీనిని చాలా వరకూ సాధారణ సమస్యగానే పరిగణించొచ్చు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది.
డెలివరీ తర్వాత కలిగే క్రమం లేని పీరియడ్స్‌కు కారణాలు:
హార్మోనల్ మార్పులు:
గర్భిణీగా ఉన్నప్పుడు మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. ప్రత్యేకించి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ లలో హెచ్చుతగ్గులు కలుగుతుంటాయి. ప్రసవం తర్వాత శరీరంలో హార్మోన్లు స్థిరంగా మారిపోతాయి. ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. ఇవి నెలసరి రావడాన్ని వేగవంతం లేదా వాయిదా పడేలా చేస్తాయి. ఒక్కొక్కసారి పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల మార్పుల కారణంగా, ఐదారు నెలల సమయం కూడా పడుతుందట.
ప్రొలాక్టిన్ ఎఫెక్ట్
నెలసరి సరిగ్గా జరగకపోవడానికి ప్రధాన కారణం పిల్లలకు పాలివ్వడం. ఎప్పుడైతే తల్లి తన బిడ్డలకు పాలిస్తుందో అప్పుడు ఆమెలోని ప్రొలాక్టిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో రీప్రొడక్డివ్ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యతను కోల్పోతాయి. దీని వల్ల అండాలు రిలీజ్ అవడం తగ్గిపోతుంది. ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లుల్లో వచ్చే పీరియడ్స్ కంటే, పాలు ఇవ్వని మహిళల్లో నెలసరి రెగ్యూలర్గా జరుగుతుందట. అంటే, పిల్లలకు ఎక్కువ కాలం పాటు పాలిచ్చే స్త్రీలలో పీరియడ్స్ రావడానికి కచ్చితంగా ఐదారు నెలల సమయం పడుతుందట.
ఫిజికల్, ఎమోషనల్ స్ట్రెస్
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో సున్నితత్వం పెరిగిపోతుంది. అంతేకాకుండా నిద్ర తక్కువ ఉండటంతో ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఒత్తిడి మెదడులోని హార్మోన్లను కంట్రోల్ చేసే ప్రాంతమైన హైపోతలమస్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇది అండాలు విడుదలలోనూ, నెలసరిలోనూ ఇన్వాల్వ్ అయి పీరియడ్స్ క్రమం తప్పేలా చేస్తుంది. ఒక్కోసారి ఒత్తిడి పెరగడం వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి కూడా పీరియడ్స్ కలిగే సమయాన్ని మార్చేయొచ్చు.
గర్భాశయ పరిమాణం
గర్భిణీ కావడానికి ముందు, డెలివరీ అయిన తర్వాత గర్భాశయ పరిమాణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. డెలివరీ తర్వాత కొన్ని రోజుల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో గర్భాశయం తిరిగి యథావిధంగా తన పరిమాణంలోకి వచ్చేస్తుంది. కానీ, ఇలా రావడానికి కొద్ది వారాల నుంచి నెలల సమయం పట్టొచ్చు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్లాసెంటా టిష్యూ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా పీరియడ్స్ మరింత ఆలస్యం కావొచ్చు కూడా.
బరువుతో పాటు పోషకాహారం
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో ఉండే పోషకాలన్నీ పోతాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ డీలతో పాటు ఇతర కీలక పోషకాలు లోపించి హార్మోనల్ మార్పులకు, అండాల విడుదలలో ఆలస్యానికి కారణమవుతాయి. అంతేకాకుండా, ఒకేసారి బరువు తగ్గిపోవడం, బరువు పెరగడం వంటి వాటికి దారి తీస్తుంది. ఒక్కోసారి పీరియడ్స్ మిస్ అవడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. ప్రత్యేకించి శరీరంలో ఇన్సులిన్ నిరోధక స్థాయిల్లో మార్పుల వల్ల ఈ మార్పులు చోటు చేసుకుంటాయి.
ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?
ఇర్రెగ్యూలర్ పీరియడ్స్ (క్రమం తప్పిన పీరియడ్స్) మళ్లీ రొటీన్ గా జరగాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ డ్ డైట్ తో పాటు ఐరన్, కాల్షియం, ప్రత్యేకమైన విటమిన్లు తీసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయిల్లో సమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాకుండా హైడ్రేటెడ్ గా ఉండటం, చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీలు అయిన వాకింగ్, యోగాలు వంటివి చేస్తుండాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసే ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల హార్మోన్ స్థాయిల్లో స్థిరత్వం కలుగుతుంది.
మీరు పిల్లలకు పాలిచ్చే తల్లులు అయితే కచ్చితంగా నిద్రా సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమస్య నిదానంగా సర్దుకుపోయేదే. శరీరంలో కలిగే మార్పులకు తక్షణ ఫలితాలు ఆశించకండి. సమస్య పరిష్కారం కానప్పుడు వైద్యులను కలవండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం