Menstrual cup Usage: పీరియడ్స్ సమయంలో మెనస్ట్రువల్ కప్ వాడడం ప్రమాదమా? దానివల్ల కిడ్నీలు పాడవుతాయా?-is it dangerous to use a menstrual cup during periods does it damage the kidneys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menstrual Cup Usage: పీరియడ్స్ సమయంలో మెనస్ట్రువల్ కప్ వాడడం ప్రమాదమా? దానివల్ల కిడ్నీలు పాడవుతాయా?

Menstrual cup Usage: పీరియడ్స్ సమయంలో మెనస్ట్రువల్ కప్ వాడడం ప్రమాదమా? దానివల్ల కిడ్నీలు పాడవుతాయా?

Haritha Chappa HT Telugu
Published Feb 19, 2025 12:30 PM IST

Menstrual cup Usage: పీరియడ్స్ సమయంలో వాడే ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో అధికంగానే ఉన్నాయి. ఎక్కువ మంది శానిటరీ ప్యాడ్స్ వాడుతూ ఉంటే కొంతమంది మెనస్ట్రువల్ కప్స్‌ను కూడా వాడుతున్నారు. ఇలా మెనస్ట్రువల్ కప్స్‌ వాడడం ప్రమాదకరమని సందేహం ఎక్కువ మందిలో ఉంది.

మెనస్ట్రవుల్ కప్ ఇలా వాడితే ప్రమాదకరం
మెనస్ట్రవుల్ కప్ ఇలా వాడితే ప్రమాదకరం (Pixabay)

మెనస్ట్రువల్ కప్స్‌ అనేది ఆధునికతరంలో మొదలైన అలవాటు. ఒకప్పుడు పీరియడ్స్ సమయంలో మహిళలు కేవలం సాధారణ వస్త్రాన్ని వినియోగించేవారు. తర్వాత శానిటరీ వినియోగం మొదలైంది. ఇప్పుడు టాంఫోన్లు, మెనస్ట్రువల్ కప్పులు వంటివి వినియోగంలోకి వచ్చాయి.

మెనస్ట్రువల్ కప్ వాడకం

ఈ మెనస్ట్రువల్ కప్పులు సౌకర్యవంతంగా చిన్న గంట ఆకారంలో ఉంటాయి. వీటిని యోనిలోకి చొప్పించుకోవాలి. అది మొత్తం పీరియడ్స్ లోని రక్తాన్ని సేకరిస్తుంది. తర్వాత దానిని తీసి శుభ్రపరుచుకోవాలి. దీన్ని తిరిగి మళ్ళీ వినియోగించుకోవచ్చు. కాబట్టి శానిటరీ ప్యాడ్ లాగా దీన్ని పదే పదే కొనాల్సిన అవసరం లేదు. కేవలం పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

మూత్రపిండాలపై ప్రభావం

కొంతమందిలో ఈ మెనస్ట్రువల్ కప్పు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం ఉంది. ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ కప్పు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే వాదన కూడా ఉంది. అది సరిగా పెట్టుకోకపోతే అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

మెనస్ట్రువల్ కప్పును మీరు వినియోగిస్తూ ఉంటే దానిని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో తెలుసుకోండి. మూత్రపిండాలకు, మూత్ర నాళానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. మెనస్ట్రువల్ కప్పు సరిగా వాడకపోతే మూత్రపిండాలు, మూత్రనాళం వాచిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని యూరిటేరో హైడ్రోనెఫ్రోసిస్ అని పిలుస్తారు. మూత్రం పేరుకుపోవడం వల్ల ఇది కలుగుతుంది.

దీర్ఘకాలికంగా మూత్ర విసర్జనకు అవరోధం ఏర్పడితే మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. మెనస్ట్రువల్ కప్పు వాడిన తర్వాత మూత్ర విసర్జన కష్టంగా మారితే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. అలాగే మెనస్ట్రువల్ కప్పు సరిగ్గా ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి.

తీసేటప్పుడు జాగ్రత్త

నడుముకు దిగువ భాగంలో అప్పుడప్పుడు నొప్పి వస్తూ మూత్రంలో కూడా అప్పుడప్పుడు రక్తం కనిపిస్తే అది యూరిటెరో హైడ్రోనెఫ్రోసిస్ సమస్యగా భావించవచ్చు. మెనస్ట్రువల్ కప్పు సరిగ్గా పెట్టుకోవడమే కాదు, తీయడం కూడా రావాలి. కప్పును ఒకేసారి కిందకి లాగడం వల్ల యోనిలో విపరీతమైన నొప్పి రావచ్చు. ఇది ఎన్నో ఇబ్బందులకు దారితీస్తుంది.

అలాగే యోనిలోని బ్యాక్టీరియా స్థాయిలు అసమతుల్యంగా కూడా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే యోనిలోని బ్యాక్టీరియా అసమతుల్యంగా మారుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఒక రకమైన వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ కప్పును 12 గంటలకంటే ఎక్కువ సేపూ ధరించకూడదు. మధ్య మధ్యలో తీసి రక్తాన్ని శుభ్రపరిచి మళ్లీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

మెనిస్ట్రువల్ కప్పును ఎక్కువ గంటలపాటు ఉపయోగించడం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా జ్వరం, దద్దుర్లు, వికారం, వాంతులు, ఫ్లూ వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. ముందుగా ఆరోగ్య నిపుణులు కలిసి మెనిస్ట్రువల్ కప్పు ఎలా వాడాలో తెలుసుకోండి. లేదా దీన్ని వాడుతున్న వారి దగ్గర నుంచైనా సరైన సలహాలను తీసుకోండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం