Heart Attack: గుండెపోటు వచ్చిన వారికి వెంటనే నీరు త్రాగించడం మంచిదా? కాదా?
Heart Attack: గుండెపోటు సమయంలో ఆ రోగికి నీరు తాగించవచ్చో లేదో అన్న సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. గుండెపోటు సమయంలో నీరు ఇవ్వకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒకప్పటి పరిస్థితి వేరు. గుండెపోటు సమస్య కేవలం వయసు ముదిరిన వాళ్లలోనే కనిపించేది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి గుండె పోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. చుట్టుపక్కల వారికి ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. ఇలా చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలబెట్టినవారు అవుతారు. గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలని ఆరోగ్య నిపుణులు తరచూ సూచిస్తూనే ఉంటారు. సిపిఆర్ చేయడం వల్ల గుండె తిరిగి కొట్టుకోవడం మొదలై ప్రాణం నిలబడుతుంది. అదేవిధంగా గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నీరు ఇవ్వాలా వద్దా అనే సందేహం కూడా ఎక్కువమందిలో ఉంది. ఈ సందేహానికి వైద్యులు సమాధానం ఇస్తున్నారు.
మీ చుట్టుపక్కల ఉన్నవారికి లేదా బంధువులకు మీ ముందే గుండెపోటు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి నీటిని అందించకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరగడంతో పాటు ఇతర రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేయాలి .రోగి ప్రాణాలను సకాలంలో కాపాడడానికి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
గుండెపోటు సమయంలో నీరు పెడితే ఇతర రకాల సమస్యలు వస్తాయి. గుండెపోటు బారిన పడిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళవచ్చు. అలాంటి వ్యక్తికి నీరు తాగిపిస్తే ఊపిరాడకుండా అవుతుంది. ఊపిరితిత్తుల్లోకి ఆ ద్రవం చేరిపోవచ్చు. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే కొన్ని రకాల శస్త్ర చికిత్సలు లేదా మందులు ఇస్తారు. దీనికోసం పొట్ట ఖాళీగా ఉండడం చాలా అవసరం. కాబట్టి గుండెపోటు వచ్చిన వ్యక్తికి నీటిని తాగిపించడం వంటి పనులు చేయవద్దు.
అలానే గుండెపోటు సమయంలో నీరు తాగడం ప్రమాదకరం. కాకపోయినా కూడా వారికి నీరు ఇవ్వకపోవడం అనేది ఇతర సమస్యలు రాకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. గుండెపోటు సమయంలో తినడం, తాగడం వంటివి పూర్తిగా నిషేధమనే చెబుతారు వైద్య నిపుణులు. ఎందుకంటే వాటి వల్ల వాంతి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరి ఆడకపోవడం, శ్వాసకు అడ్డు అడ్డుపడడం వంటివి జరగవచ్చు.
మనిషి హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. అది నిజమే... కానీ గుండెపోటు వచ్చిన వెంటనే నీరు తాగించడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి గుండెపోటు రాకుండా ముందుగానే ఎక్కువ నీటిని తాగడానికి అందరూ ప్రయత్నించాలి. గుండె జబ్బులు ఉన్న వ్యక్తుల్లో అవసరానికి మించి ద్రవాహారాన్ని తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తారు. దీనికి కారణం అదనపు ద్రవాలు శరీరంలో పేరుకుపోతాయి. అలా పేరుకుపోతే గుండెపై ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంటుంది. గుండెపోటుకు గురైన చాలామందికి ఆకలి ఉండదు. తినడానికి ఇష్టపడరు. ఎవరైనా గుండెపోటుతో బాధపడుతున్నారని మీరు గమనిస్తే వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేయండి. దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లండి. అతను అపస్మారక స్థితికి చేరుకుంటే వెంటనే సిపిఆర్ చేయండి. అంతే తప్ప నీటిని మాత్రం తాగించకండి.
గుండె కోసం ఆహారాలు
గుండె ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ప్రతి రోజు తినాలి. ద్రాక్షలు, స్ట్రాబెర్రీలు వంటివి అధికంగా తినండి. పండ్లు, చక్కెర కలపని పండ్ల రసాలు, పాలు, నీరు తీసుకుంటూ ఉండాలి. కెఫిన్ ఉన్న కాఫీ, టీ, సోడా వంటివి తాగకపోవడమే మంచిది. అలాగే ఉప్పగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పంచదార వేసిన పదార్థాలను కూడా తినకూడదు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తినేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ మసాలాలు దట్టించిన ఆహారాలను ప్రతిరోజు తినడం మానుకోండి. గుండెను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)