White Egg vs Brown Egg: బ్రౌన్ కలర్ కోడిగుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయా? నిజం ఇదే..
White Egg vs Brown Egg: కోడిగుడ్ల విషయంలో కొన్ని సందేహాలు చాలా మందికి ఉంటాయి. ముఖ్యంగా తెలుపు, బ్రౌన్ రంగుల గుడ్లలో ఏది మేలు అనే డౌట్ ఉంటుంది. బ్రౌన్ గుడ్లలో పోషకాలు ఎక్కువనే వాదన వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఏది నిజమో ఇక్కడ తెలుసుకోండి.
కోడిగుడ్లు అత్యుత్తమ పోషకాహారం. గుడ్లను ప్రతీ రోజు తింటే ఆరోగ్యానికి చాలా విధాలుగా ప్రయోజనాలు దక్కుతాయి. గుడ్లలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ12, ఫోలెట్, ఐరన్, కాల్షియమ్, ప్రోటీన్, సెలేనియం, పొటాషియం సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అందుకే కోడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కోడిగుడ్ల విషయంలో కొన్ని అపోహలు కొందరిలో ఉంటాయి. ముఖ్యంగా తెలుపు రంగు, గోధుమ రంగు (బ్రౌన్) కోడిగుడ్లలో ఏది మేలని ఆలోచిస్తుంటారు. బ్రౌన్ కలర్ గుడ్లలో పోషకాలు ఎక్కువ అని అనుకుంటారు. అందులో వాస్తవమెంతో ఇక్కడ చూడండి.
పోషకాల్లో తేడా ఉండదు.. అంతా ఒకటే
వైట్ కలర్ కోడిగుడ్లతో పోలిస్తే బ్రౌన్ గుడ్లు ఆరోగ్యానికి మరింత మంచివని, వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయనే అపోహ ఉంది. అయితే, అందులో వాస్తవం ఏ మాత్రం లేదు. కోడిగుడ్డు పెంకు రంగు ఏదైనా.. పోషకాలు మాత్రం ఒకేలా ఉంటాయి. రంగుతో పోషకాలకు సంబంధం ఉండదు. తెలుపు, గ్రౌన్ ఈ రెండు రంగుల గుడ్లలో విటమిన్లు, మినలర్స్, ప్రోటీన్ సహా పోషకాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అందుకే ఏ రంగు గుడ్లు తీసుకున్నా పోషకాల విషయంలో తేడా ఉండదు.
రంగులు విభిన్నంగా ఎందుకు..
కోడిగుడ్ల పెంకుల రంగులు ఎందుకు డిఫరెంట్‍గా ఉంటాయనే సందేహం కూడా చాలా మందిలో ఉండొచ్చు. కోడిపెట్టె జాతిని బట్టి గుడ్ల పెంకుల రంగు మారుతుంది. తెల్ల ఈకలు ఉన్న కోడిపెట్టలు తెల్ల రంగు గుడ్లు పెడతాయి. ఎరుపు, బ్రౌన్ రంగు ఈకలు ఉండేవి బ్రౌన్ పెంకుతో ఉండే గుడ్లు పెడతాయి. అయితే, కొన్నిసార్లు ఇది మారొచ్చు కూడా. వాతావరణ పరిస్థితులు, కోడిపెట్ట తీసుకున్న ఆహారం, ఒత్తిడి అంశాలు కూడా కూడా గుడ్ల పెంకు రంగుపై ప్రభావం చూపుతాయి. అయితే, పెంకు రంగు ఎలా ఉన్నా.. పోషకాలు మాత్రం అన్ని గుడ్లలో దాదాపు ఒకే రకంగా ఉంటాయి. బ్లూ, ఎల్లో రంగుల్లోనూ కొన్ని గుడ్లు ఉంటాయి.
రుచి కూడా..
కోడిగుడ్డు రుచికి కూడా పెంకు రంగుతో సంబంధం ఉండదు. గుడ్డు పెట్టిన కోడి ఆరోగ్యం, అది తిన్న ఆహారం, గుడ్డు తాజాదనం, స్టోర్ చేసిన విధానం, మనం దాన్ని వండిన తీరు ఇలా రకరకాల అంశాలపై రుచి అంశం ఆధారపడి ఉంటుంది. దాదాపు అన్ని రంగుల కోడిగుడ్లు ఒకే రకమైన రుచితో ఉంటాయి. అయితే, పై అంశాలు ప్రభావితం చేస్తాయి.
కోడిగుడ్లపై మరిన్ని అపోహలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుడ్డు పచ్చసొన తింటే బరువు విపరీతంగా పెరుగుతారని కొందరు నమ్ముతారు. అయితే, సొనలో ప్రోటీన్, విటమిన్ ఏ, డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వారు సొనతో సహా మొత్తం గుడ్డు తినొచ్చు. ఎగ్ వైట్‍తో పాటు సొన కూడా తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. దీంతో తరచూ ఏదో ఒకటి తినాలనే ఆశ తగ్గుతుంది. క్యాలరీలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
టాపిక్