Breast Cancer: రొమ్ము క్యాన్సర్ వంశపారపర్యంగా వస్తుందా?.. కారణాలు, లక్షణాలు చెప్పిన ఆంకాలజిస్ట్
Breast Cancer: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గురించి చాలా సందేహాలు ఉంటాయి. వంశపారపర్యంగా ఇది వస్తుందా అనే డౌట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఓ ఆంకాలజిస్ట్ సమాధానం ఇచ్చారు. ఈ క్యాన్సర్ వచ్చేందుకు కారణాలు, లక్షణాల గురించి కూడా వివరించారు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) సమస్య ఇటీవల పెరుగుతోంది. ఇండియాలో చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో ఈ క్యాన్సర్‌పై సందేహాలు చాలా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమ్మలు, అమ్మల నుంచి వంశపారపర్యంగా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరించారు మణిపాల్ హాస్పిటల్ వైట్‍ఫీల్డ్ మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అభయ కుమార్. ఆ వివరాలు ఇవే..
వంశపారపర్యంగా కొంత శాతమే..
వంశపారపర్యంగా రొమ్ము క్యాన్సర్ వచ్చేది కొంత శాతమే అని, వివిధ కారణాల వల్లే ఎక్కువగా వస్తోందని డాక్టర్ అభయ కుమార్ తెలిపారు. “కేవలం 5 నుంచి 20 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు మాత్రమే వంశపారపర్యంగా కుటుంబాల్లో తరాల నుంచి వస్తున్నవిగా ఉన్నాయి. అయితే, అన్ని రొమ్ము క్యాన్సర్ కేసులు వంశపారపర్యంగా వచ్చినవి కావని గుర్తుంచుకోవడం ముఖ్యం” అని కుమార్ తెలిపారు.
రొమ్ము క్యాన్సర్ సోకేందుకు కారణాలు
బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణాలను చెప్పారు డాక్టర్ అభయ కుమార్. “పట్టణీకరణ పెరిగిపోవడం, ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తినడం, కూరగాయలు ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, ఊబకాయం లాంటివి రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను పెంచేస్తాయి. ఆలస్యంగా పెళ్లి, ఆలస్యంగా పిల్లలను జన్మనివ్వడం, పిల్లలకు చనుపాలు ఇవ్వకపోవడం కూడా ఈ క్యాన్సర్ వచ్చేందుకు కారణాలుగా ఉంటాయి” అని అభయ కుమార్ వెల్లడించారు.
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు
“రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారికి రొమ్ములో ఓ గడ్డ (కణితి) ఏర్పడుతుంది. అయితే ఇది నొప్పి కలిగించదు, గట్టిగా, రొమ్ము కణజాలంలో ఫిక్స్ అయి ఉంటుంది. ఈ వ్యాధి ముదిరేకొద్ది.. చర్మం గట్టిపడడం, పుండు అవడం, రంగు మారడం జరుగుతుంది. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ వాధిగ్రస్తుల్లో చనుమొన నుంచి స్రావం, రక్తస్రావం కూడా రావొచ్చు. ఈ వ్యాధి మరింత ముదిరితే చంకలో కూడా గడ్డలు కనిపించవచ్చు” అని అభయ కుమార్ వెల్లడించారు.
ప్రాథమిక దశలో గుర్తించవచ్చా?
ఎలాంటి క్యాన్సర్‌నైనా ప్రాథమిక దశలో గుర్తించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే చికిత్స తీసుకొని కోలుకునేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో ఎలా గుర్తించాలో డాక్టర్ అభయ్ కుమార్ తెలిపారు. “మామ్మొగ్రఫీ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. రొమ్ములోని గడ్డలను గుర్తించేందుకు చేసే ఎక్స్‌రే లాంటిదే ఇది. ఇది చాలా విలువైన టూల్. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. త్వరగా గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుంది, వ్యాధి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 40 ఏళ్ల వయసు తర్వాతి నుంచి మహిళలు ఏడాదికి ఒకసారైనా మమ్మోగ్రామ్స్ చేయించుకుంటే మంచిది” అని ఆంకాలజిస్ట్ డాక్టర్ అభయ కుమార్ తెలిపారు.
రొమ్ములో ఏదైనా గడ్డలా ఉన్నట్టు అనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకుంటూనే మేలు. తొలి దశలో వ్యాధిని గురిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.