Iron Pan Seasoning Tips: ఐరన్ ప్యాన్ తుప్పు పట్టకుండా ఉండాలంటే, దోశలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ తప్పక పాటించండి!
Iron Pan Seasoning Tips: పర్ఫెక్ట్ దోశ తయారు చేయాలంటే, పిండి తయారీతో పాటు, దోశ వేయడానికి ఉపయోగించే తవా కూడా చాలా ముఖ్యం. నాన్‌స్టిక్ పెనంతో పోలిస్తే ఇనుప పెనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మంచిది. ఇనుప తవా తుప్పు పట్టకుండా ఉండాలంటే, దోశ పర్ఫెక్ట్‌గా రావాలంటే కొత్తగా ఉన్నప్పుడే ఇలా చేయండి.
దోశ చాలా మందికి ఇష్టమైన టిఫిన్. ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, రాత్రి భోజనం, ఇలా ఎప్పుడైనా దోశను ఆస్వాదించవచ్చు. ముందు రోజు దోశ పిండి నానబెట్టి పులియబెడితే చాలు, మరుసటి రోజు చట్నీ చేసి దోశ వేసుకోవచ్చు. తక్కువ సమయంలో అయ్యే టిఫిన్ అలాగే మంచి బ్రేక్‌ఫాస్ట్ తిన్న సంతోషం. ఒక్కమాటలో చెప్పాలంటే తక్కువ సమయంలో, సులభంగా, రుచికరంగా తయారయ్యే టిఫిన్లలో దోశ ఒకటి.

పిండి ఎంత ముఖ్యమో పెనం కూడా అంతే ముఖ్యం..
వాస్తవమేంటంటే.. హోటళ్లలో రకరకాల దోశలు దొరుకుతాయి. ప్లేన్ దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ. పేరేదైనా బ్రౌన్ కలర్‌లో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. కానీ ఇంట్లో అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తే ఎందుకు రాదు? హోటల్‌లో వాడే పదార్థాలనే మనం కూడా వాడతాం, పిండి నానబెడతాం, పులియబెడతాం. అయినా హోటల్‌లో లాగా బ్రౌన్ కలర్ దోశ ఎందుకు రాదు, ఎక్కడ తప్పు జరుగుతోంది అని ఆలోచించేవారికి ఇక్కడ సమాధానం ఉంది. అదే దోశ వేసే పెనం.
దోశలు చక్కగా రావాలంటే పిండి ఎంత ముఖ్యం అవి వేసే తవా కూడా అంతే ముఖ్యం. పెనం సరిగ్గా లేవంటే దోశ ముక్కలు ముక్కలు అవడం, అతుక్కోవడం లాంటివి జరుగుతాయి. ఇలా జరగకుంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
దోశ రుచికరంగా ఉండాలంటే ఏ పెనం వాడాలి?
ఈ మధ్యకాలంలో చాలా మంది నాన్‌స్టిక్ తవాలను వాడుతున్నారు. కొంతమంది చపాతీ, రోటీ చేసే తవాలనే దోశ వేయడానికి కూడా వాడుతున్నారు. దోశ రుచిగా ఉండాలంటే, బ్రౌన్ కలర్ రావాలంటే, కొంత నెయ్యి లేదా నూనె వేయాలి, కానీ నాన్‌స్టిక్ తవాకి అంత నూనె వేయలేం. రోటీ, చపాతీ చేసే తవాలు పాడైపోతాయి. అందులోనే మీరు దోశ వేయడానికి ప్రయత్నిస్తే ఆ దోశ పెన్నాన్ని వదిలి పైకి రాదు. అందువల్ల మీరు దోశ వేయడానికి వాడాల్సింది ఇనుప తవా. నాన్ స్టిక్ పెనం వాడటం ఆరోగ్యానికి కూడా హనికరమే. మీరు తర్వాత హోటల్‌కి వెళ్ళినప్పుడు గమనించండి. అక్కడ వాడేది ఇనుప తవా, ఏ హోటల్‌లోనూ నాన్‌స్టిక్ తవా వాడరు.
ఇనుప తవాని సీజన్ చేసే విధానం..
దోశ రుచిగా, క్రిస్పీగా, మంచి బ్రౌన్ కలర్ లో రావాలంటే ఇనుప పెనం బెస్ట ఆప్షన్. అయితే ఇది ఊరికే తుప్పు పడుతుంది, చిలుము వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తవా కొన్న వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మీరు మార్కెట్ నుండి తెచ్చిన ఇనుప తవాని వెంటనే వాడలేరు. దాన్ని ముందుగా సీజన్ చేయాలి. అదెలాగో చూద్దాం రండి..
- ముందుగా తవాని బియ్యం కడిగిన నీటిలో ఒక రోజంతా నానబెట్టాలి.
- మరుసటి రోజు స్టవ్ మీద తవా వేడి చేసి నూనె రాసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- పెనం చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేసి మళ్లీ కాస్త నూనెను రాసి పక్కకు పెట్టాలి. ఇలా 5 నుచి 6 సార్లు చేయాలి.
- తవాకి ఇలా నూనె రాసి పక్కక్కు ఉంచడం వల్ల పెనం ఉపరితలం నునుపుగా అవుతుంది.
- ఉపయోగించే ముందు తవాని కడిగి మళ్ళీ నూనె రాసి దోశ వేయవచ్చు.
- లేదా తవా వేడెక్కిన తర్వాత నీళ్ళు చిలకరించి దోశ వేసి ఆ తర్వాత దానిపై నూనె/నెయ్యి రాసుకోవచ్చు.
- ఇలా చేస్తే దోశ క్రిస్పీగా, బ్రౌన్ కలర్‌లో వస్తుంది.
- ఉపయోగించిన తర్వాత కూడా ప్రతిసారి తవాని కడిగి తుడిచి కొద్దిగా నూనె రాసి భద్రపరచండి.
ఇనుప తవా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది, చిలుము, తుప్పు వంటి రాకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.