Irani Chai Recipe: ఇరానీ ఛాయ్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు
Irani Chai Recipe: ఇరానీ ఛాయ్ పేరు చెబితేనే టీ ప్రియులకు నోరూరి పోతుంది. ఇది చాలా ఫేమస్ టీ. దీన్ని ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
Irani Chai Recipe: టీలలో ఇరానీ ఛాయ్ చాలా ఫేమస్. దీన్ని తాగేందుకు ప్రత్యేకంగా బయటకు వెళతారు. ఎంతోమంది ఛాయ్ దుకాణాల్లో ఇరానీ టీని ఆర్డర్ చేసుకుంటారు. నిజానికి ఇంట్లోనే ఇరానీ ఛాయ్ చాలా సులువుగా చేసుకోవచ్చు. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయితే మీరూ రోజూ ఇరానీ ఛాయ్ తక్కువ ఖర్చుతోనే తాగవచ్చు.
ఛాయ్ పేరులోనే అది ఏ దేశానికి చెందిందో తెలిసిపోతుంది. ఇది ఇరాన్ దేశంలో పుట్టింది. ఇరానీయులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిచయం చేశారు. ఇరానీయులు ఒకప్పుడు భారీ సంఖ్యలో మన దేశానికి వచ్చేవారు. ఇక్కడ ఛాయ్ సెంటర్లు కూడా స్థాపించి ఎన్నో ఏళ్లపాటు జీవించారు. అందుకే ఇక్కడ కొన్ని ఛాయ్ సెంటర్ల పేర్లు ఇరానీ కేఫ్‌లుగా ఉన్నాయి. హైదరాబాదు, ముంబైలోనే ఎక్కువగా ఇరానీ కేఫ్‌లు కనిపిస్తాయి. వర్షాకాలంలో ఇరానీ ఛాయ్ తాగితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. నాణ్యమైన ఇరానీ ఛాయ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
ఇరానీ ఛాయ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలు - రెండు గ్లాసులు
నీరు - ఒక గ్లాసు
పంచదార - మూడు స్పూన్లు
కుంకుమ పువ్వులు - నాలుగు రేకులు
యాలకులు - మూడు
ఛాయ్ పత్తి లేదా టీ ఆకులు - రెండు స్పూన్లు
ఇరానీ ఛాయ్ రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు వేసి బాగా మరిగించాలి.
2. మీడియం మంట మీద ఉంచి మరిగిస్తే పాలు, నీళ్లు కలిపి బాగా మరుగుతాయి.
3. అవి సలసలా మరుగుతున్నప్పుడే రెండు స్పూన్ల టీ ఆకులను కూడా వేసి మరిగించాలి.
4. ఈలోపు యాలకులను చూర్ణం చేసి పక్కన పెట్టుకోవాలి.
5. అలాగే కుంకుమ పువ్వులు కూడా యాలకుల్లోనే వేసి బాగా పొడిలా చేసుకోవాలి.
6. పాలు, టీ ఆకులు కలిపి మరుగుతున్నప్పుడు ఈ యాలకుల చూర్ణం, కుంకుమ పువ్వు పొడి, పంచదార వేసి మరిగించాలి.
7. మంటను తగ్గించి కనీసం పావుగంట సేపు అలా మరిగిస్తూనే ఉండాలి.
8. ఈ ఛాయ్ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది.
9. ఇది బాగా మరిగితే విపరీతమైన సువాసన వస్తుంది.
10. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకట్టి ఒక గ్లాసులో వేసుకొని తాగాలి. అంతే టేస్టీ ఇరానీ ఛాయ్ రెడీ అయినట్టే. దీన్ని ఇష్టంగా తాగే వారి సంఖ్య ఎక్కువే.
ఇరానీ ఛాయ్ లో ముఖ్యమైనది టీ ఆకులు. మీరు నాణ్యమైన ఛాయ పత్తిని ఎంచుకుంటేనే ఇరానీ ఛాయ్ టేస్టీగా ఉంటుంది. సాధారణమైనవి ఎంచుకుంటే ఎలాంటి సువాసన రాదు. తాగాలన్న ఆసక్తి కూడా ఉండదు. కాబట్టి నాణ్యమైన టీ ఆకులతోనే ఇరానీ ఛాయ్ పెట్టేందుకు ప్రయత్నించండి.
టాపిక్