International Men's Day 2023 : జీవితమనే పరుగు పందెంలో అలసిపోతున్న పురుషులందరికీ హ్యాపీ మెన్స్ డే
International Men's Day 2023 : మహిళా దినోత్సవం గురించి చాలా మందికి తెలుసు. కానీ పురుషులకు కూడా పురుషుల దినోత్సవం ఎప్పుడో తెలియదు. నవంబర్ 19 ఆదివారం రోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
బంధాలు, బాధ్యతల్లో చిక్కుకుని ఎందరో మగాళ్లు తమ కలలను వదిలిపెడుతున్నారు. జీవితం అనే పరుగు పందెంలో పరుగెత్తలేక.. అలసిపోతుంటారు. కుటంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటారు. నిజానికి కుటుంబం కోసం, సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేసిన పురుషులకు కూడా ఓ రోజు ఉండాలి కదా. ఉంది.. కానీ ఎవరికీ పెద్దగా తెలియదు.

ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని(International Men's Day) జరుపుకొంటారు. ఇది వెస్ట్ ఇండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999లో ప్రారంభించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారతదేశం, USA, UK, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, హంగేరి మొదలైన వాటితో సహా ప్రపంచంలోని 70 కంటే ఎక్కువ దేశాలు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకొంటాయి.
పురుషులను గౌరవించేందుకు అంతర్జాతీయంగా పురుషుల దినోత్సవాన్ని జరుపుతారు. పురుషుల శ్రేయస్సు, ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, అలాగే వారు చేసే పనిని గుర్తించి గౌరవించటానికి ఇది ఒక రోజు. పురుషులలో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ జెరోమ్ టీలుక్ సింగ్ తొలిసారిగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అతను తన తండ్రి జయంతిని పురస్కరించుకుని 1999లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని మెుదలుపెట్టారు. భవిష్యత్తులో పురుషులు, బాలురకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి ఈ రోజును అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది బాగా ఫేమస్ అయింది.
ఈ రోజున, పురుషుల శ్రేయస్సు, ఆరోగ్యంపై మరింత చర్చ చేస్తారు. మగవారు ఎదుర్కొనే సామాజిక స్థితిగతుల గురించి మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు యొక్క అంతిమ లక్ష్యం ప్రాథమిక మానవ విలువలను ప్రోత్సహించడం, పురుషుల గురించి అవగాహన కల్పించడం. పురుషుల దినోత్సవం రోజైనా కాస్త మగవారికి మనశ్శాంతినివ్వండి. హ్యాపీగా వారితో గడపండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ, పురుషులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. స్త్రీలు తమ బాధల గురించి చెప్పుకుంటారు. పురుషులు ఆ పని చేయరు. మగవారు తమ బాధలను కనబరచకుండా, ఏడవకుండా తమ భావోద్వేగాలను బలవంతంగా దాచుకుంటారు. భావోద్వేగాలు మానవ సహజం. ఈ సమాజం మగవారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడే మగవారికి ఆనందం.. కుటుంబ కోసం జీవితాలను త్యాగం చేస్తున్న పురుషులందరికీ Happy Men's Day 2023..
టాపిక్