International Men’s Day 2024: మగాళ్లు.. ఈ విషయాలను నిర్లక్ష్యం చేయకండి!
International Men’s Day 2024: పురుషులు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. మౌనంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా మనసులోని బాధను బయటికి ఎక్కువగా చెప్పుకోలేరు. మానసిక ఆరోగ్యం కోసం పురుషులు ఏం చేయాలో చూడండి. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ కథనం..
పురుషులకు నేడు (నవంబర్ 19) ప్రత్యేకమైన రోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుగుతుంది. పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై చర్చ జరిగేందుకు, వారి విజయాలను ప్రశంసించేందుకు ఈరోజును స్పెషల్‍గా పరిగణిస్తారు. సామాజిక పరిస్థితుల కారణంగా పురుషులకు ఓ సమస్య నిరంతం ఉంటుంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాధలను మహిళలతో పోలిస్తే పురుషులు బయటికి పెద్దగా చెప్పుకోలేరు. తమ వేదనను చెబితే ఇతరులు తక్కువ చేసి చూస్తారనో, దీన్ని కూడా ఎదుర్కోలేవా అని మాట్లాడతారేమోనని చింతిస్తుంటారు. దీంతో మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంటుంది.
నిర్లక్ష్యం వద్దు
సాధారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారనే అభిప్రాయం ఉంటుంది. అయితే, మహిళలు తమ సమస్యలను బయటికి ఎక్కువగా చెప్పుకోవడంతో ఈ నమ్మకం ఏర్పడింది. అయితే, పురుషులు తమ మానసిక వేదనను ఎక్కువగా బయటికి వ్యక్తులకు చెప్పుకోలేరు. సమాజంలోని లింగపరమైన పరిస్థితుల వల్ల ఇతరుల వద్ద సమస్యలను చెప్పుకోరు. తమలోనే అణచుకుంటారు. దీనివల్ల పురుషుల్లో చాలాసార్లు కోపం, చిరాకు, ఆందోళన, ఇతరులను దూషించడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే, ఇలా కాకుండా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు పురుషులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదు. ఆ టిప్స్ ఏవంటే..
స్నేహితులు, సామాజిక బంధాలు
సాధారణంగా ఓ వయసు వచ్చాక ఉద్యోగం, కుటుంబం అంటూ పురుషులు చాలా బిజీ అవుతారు. స్నేహితులతో పాటు సమాజంలోని బంధాలపై దృష్టి పెట్టరు. అయితే, తాము మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులను పురుషులు ఎప్పటికీ కలిగి ఉండాలి. మిమ్మల్ని జడ్జ్ చేయని వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. మీ బాధలను దాపురికాలు లేకుండా చెప్పుకోగలిగే స్నేహితులను, సామాజిక బంధాలను పెంచుకోవాలి.
వ్యాయామం, ధ్యానం
వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఫిట్‍గా ఉండటంతో పాటు మానసికంగానూ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే కనీసం 40 నిమషాలైనా వ్యాయామం, ధ్యానం కోసం కేటాయించాలి. ఆరోగ్య లాభాలతో పాటు మీపై మీరు శ్రద్ధ చూపించుకున్నట్టుగా ఫీల్ కావొచ్చు. వీటి వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి ఫ్రెష్‍గా ఫీల్ అవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటుంది.
ఏదైనా హాబీ
పురుషులు ఏదైనా హాబీని అలవరుచుకోవాలి. ప్రతీ రోజూ దానిపైనే కొంత సమయం దృష్టి పెడితే మైండ్ రిలాక్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఆందోళనలు ఆ సమయంలో గుర్తుకు రావు. హాబీగా వంట చేస్తే ఇంటి పనుల్లోనూ పాలుపంచుకున్నట్టు ఉంటుంది. పెయింటింగ్ కూడా చేయవచ్చు. ట్రెక్కింగ్ కూడా మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఇలా మనసుకు నచ్చిన దాన్ని ఓ హాబీగా కొనసాగిస్తే మానసిక ఆరోగ్యానికి మంచిది.
పోషకాహారం
ఎన్ని పనులు ఉన్నా తినే ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, కాయధాన్యాలు లాంటి పోషకాలు పుష్కలంగా ఆహారం తినాలి. పోషకాలు ఉండే ఆహారం తింటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. పొగతాగడం, మద్యం అన్ని విధాలుగా చేటే. అందుకే ఆ అలవాటు ఉంటే మానేయాలి.
అవసరమైతే నిపుణుడు
మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్టు అనిపిస్తే సంబంధిత మానసిక నిపుణుల వద్దకు వెళ్లాలి. అవసరమైతే థెరపీ తీసుకోవాలి. మీ ఒత్తిడి, ఆందోళన తగ్గేలా నిపుణులు సూచనలు చేయగలరు.
టాపిక్