International day of happiness 2024: జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు పాటించండి
International day of happiness 2024: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఆనందం విలువను తెలిపేందుకే ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది.
International day of happiness 2024: ఏ మనిషి అయినా ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యానికీ, ఆనందానికీ కనిపించని బలమైన బంధం ఉంది. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో... అతని జీవితంలో ఆనందం కూడా ఉందని అర్థం చేసుకోవాలి. సంతోషం విలువను మనకు తెలియజేసేందుకే ప్రతి ఏడాది మార్చి 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది.
ప్రతి మనిషి ప్రాథమిక హక్కు ఆనందం. ఆనందంగా ఉండడానికి ఎదుటివారి సాయం అవసరం లేదు. మీకు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ఆధునిక జీవితంలో హడావుడి నిర్ణయాల మధ్య, ఆర్థిక సమస్యల మధ్య, ట్రాఫిక్ గందరగోళంలో చిన్న చిన్న క్షణాలను కూడా ఆస్వాదించలేకపోతున్నారు ఎంతోమంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక సమస్యల బారిన పడుతున్నారు. నిజం చెప్పాలంటే చాలా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని సులువుగా వెతుక్కోవచ్చు. సంతోషంగా ఉండడానికి కొన్ని సింపుల్ చిట్కాలను జీవితంలో పాటించండి.
చురుకుగా ఉండండి
ఎప్పుడైతే ఒకే చోట కదలకుండా కూర్చుంటారో మీకు తెలియకుండానే ఒక నిరాశను, నిస్పృహ మిమ్మల్ని కమ్మేస్తుంది. కాబట్టి ఎప్పుడూ పని లేకుండా కూర్చోకండి. నడవడం, డాన్స్ చేయడం, వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీ మెదడులో ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక స్థితిని ఉల్లాసపరుస్తాయి.
కనెక్ట్ అవ్వండి
ఒంటరిగా కూర్చుంటే వచ్చేదేమీ లేదు, రోజులో గంటల గంటలు ఒంటరిగా గడిపే బదులు స్నేహితులతో కాసేపు మాట్లాడండి. మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడపండి. నలుగురితో కలిసి చేసే పనుల్లో పాల్గొనండి. ఇవన్నీ కూడా ఇతరులతో కనెక్టివిటీని పెంచుతాయి. వ్యక్తిగతంగా మెదడును ఉల్లాసపరుస్తాయి.
మైండ్ ఫుల్ నెస్‌ను ప్రాక్టీస్ చేయండి
ధ్యానాన్ని ప్రతిరోజూ చేస్తూ ఉండండి. లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ఇలాంటి మైండ్ ఫుల్ నెస్ అభ్యాసాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆనందాన్ని పెంచేందుకు సహకరిస్తాయి.
జాగ్రత్తగా ఉండండి
ఎంతోమంది తమ కుటుంబాలపై పెట్టిన శ్రద్ధను తమపై పెట్టరు. ఎవరైతే పోషకాహారం తింటూ, తగినంత నిద్రపోతూ తమ అవసరాలను కూడా తీర్చుకుంటూ ఉంటారో వారు ఆనందంగా ఉంటారు. స్వీయ సంరక్షణ అనేది ఒక వ్యక్తి ఆనందానికి, సంతోషానికి ప్రధాన కారణం.
లక్ష్యం పెట్టుకోండి
ఏ లక్ష్యం లేని వ్యక్తి తెగిన గాలిపటంలాంటివాడు. అలాంటివారు ఎటో కొట్టుకు వెళ్తారుకానీ ఒక ఒడ్డుకు చేరరు. కాబట్టి మీరు ఉద్యోగంలోనైనా, మీ అలవాట్లలోనైనా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఒక దిశగా పని చేసే వ్యక్తి చురుకుగా ఉంటాడు. ఆనందంగా జీవిస్తాడు.
కృతజ్ఞతలు చెప్పండి
మీకు జీవితంలో చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక సాయం చేసిన వ్యక్తులు ఉంటారు. అలాగే కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతిరోజూ కొంత సమయం కేటాయించండి. మీకు రుచికరమైన భోజనం వండిన అమ్మకు కృతజ్ఞతలు తెలపండి. మిమ్మల్ని ప్రేమగా చూసుకున్న స్నేహితులకు, కుటుంబీకులకు మీ కృతజ్ఞతా భావాన్ని వివరించండి. సూర్యుడి వెచ్చదనం మీకు హాయిగా అనిపిస్తే ఆ సూర్యుడికి కూడా థాంక్స్ చెప్పండి. ఇలాంటివి మీకు తెలియకుండానే ఎన్నో మార్పులను తెచ్చి పెడతాయి.
టాపిక్