భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘వసుధైవ కుటుంబకం’ అంటే యావత్ ప్రపంచమే ఒక కుటుంబం అని మన సంస్కృతి చాటుతుంది. మనం ఎంత ఎదిగినా, మన మూలాలను, మన చరిత్రను, ముఖ్యంగా మన కుటుంబాన్ని ఎప్పటికీ మరచిపోకూడదని పెద్దలు చెబుతారు. వ్యక్తి ఉంటేనే కుటుంబం, కుటుంబాలు కలిసి ఉంటేనే సమాజం ఏర్పడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి.
కుటుంబం మన అస్తిత్వం. కష్టకాలంలో ప్రపంచం మొత్తం మనకు దూరమైనా, కుటుంబం మాత్రం వెన్నంటే ఉంటుంది. ఇది ఒకప్పటి మాటలా అనిపించినా, నేటి సమాజంలో కూడా కుటుంబానికి దానికి ప్రత్యేక స్థానం ఉంది. అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బాబాయి, పిన్ని, తాతయ్య, నాయనమ్మ, మామయ్య, అత్తయ్య ఇలా అనేక బంధాలతో కలిసి ఉండే కుటుంబాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక గొప్ప బలాన్నిస్తాయి.
కుటుంబ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి , ఈ సంవత్సరం థీమ్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
సామాజిక అభివృద్ధి కమిషన్ , ఆర్థిక, సామాజిక మండలి సమర్పించిన సిఫార్సుల మేరకు, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1983లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
సాంకేతిక అభివృద్ధి, జనాభా విస్ఫోటనం, నగరీకరణ, వలసలు, వాతావరణ మార్పు వంటి ధోరణుల మధ్య కుటుంబ ఆధారిత విధానాలు సుస్థిర అభివృద్ధిని ఎలా ముందుకు నడిపిస్తాయో ఈ అంశం హైలైట్ చేస్తుంది.
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సామాజిక ప్రగతిని , అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచ కార్యక్రమాలలో ఒక భాగం. ఇది కుటుంబ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, సమాజంలో కుటుంబ స్థానం, వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, అలాగే అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది.