International Carrot Day: ప్రతిరోజూ ఒక క్యారెట్ తింటే మీలో వచ్చే మార్పులు ఇవే
International Carrot Day: అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం సందర్భంగా క్యారెట్ వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి. క్యారెట్ కోసం ఎందుకు ఒక ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
International Carrot Day: ఇంటర్నేషనల్ క్యారెట్ డే... క్యారెట్ మనకు చేసే మేలును దృష్టిలో పెట్టుకొని క్యారెట్ కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించారు. ఈ రోజున క్యారెట్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 2003 నుండి ఈ ఇంటర్నేషనల్ క్యారెట్ డే నిర్వహించుకుంటున్నాము. ప్రతీ ఏడాది ఏప్రిల్ 4న అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండే క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. క్యారెట్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.
రోజుకో క్యారెట్‌తో ఆరోగ్యం
రోజుకు ఒక క్యారెట్ తిని చూడండి. నెల రోజుల్లో మీకు మీలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. ఒక క్యారెట్‌కు మించి తినకపోవడం మంచిది. క్యారెట్లు అధికంగా తింటే మాత్రం ఇతర సమస్యలు రావచ్చు. కేవలం ఒక క్యారెట్‌ను ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల నెల రోజుల్లోనే మీ చర్మం, కంటి చూపు, ఆరోగ్యం విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి.
ప్రతిరోజూ పచ్చి క్యారెట్‌ను నెలరోజుల పాటు తిని చూడండి. క్యారెట్లలో శక్తివంతమైన బీటా కెరటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కంటి చూపుకు అవసరం. అంధత్వం రాకుండా అడ్డుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది.
చర్మానికి మెరుపు
క్యారెట్లలో కెరటానాయిడ్లు, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. చర్మాన్ని శుభ్రపరచడానికి ఇది చాలా అవసరం. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో ఇవి పోరాడుతాయి. చర్మాన్ని మెరిపిస్తాయి. క్యారెట్లు ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని పెంచే కొలాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
క్యారెట్ ప్రతిరోజూ తింటే విటమిన్ b6, విటమిన్ సి శరీరానికి అందుతాయి. ఇవి రెండూ కూడా రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ బి6, యాంటీ బాడీస్ ఉత్పత్తికి సహకరిస్తాయి.
క్యారెట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. పేగు కదలికలను చురుగ్గా మార్చడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు రోజంతా చురుగ్గా ఉండేలా చూస్తోంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. క్యారెట్లతో గాజర్ కా హల్వా, క్యారెట్ రైస్, క్యారెట్ ఫ్రై వంటి ఎన్నో వంటలు చేసుకోవచ్చు.
క్యారెట్లు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అలాగే కొవ్వు కూడా తక్కువ. కాబట్టి ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల బరువు పెరగరు. ఇందులో నీరు, ఫైబర్ స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఒక క్యారెట్ తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఆకలి త్వరగా వేయదు. కాబట్టి ఇతర ఆహారాలను తగ్గిస్తారు. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.
క్యారెట్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుంది. రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రతిరోజూ ఒక క్యారెట్ తీసుకునే వారిలో కొలెరెక్టాల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంటే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి క్యారెట్ కు ఉంది. అలాగే మెదడుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్లో ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. శ్వాస సంబంధిత వ్యాధులతో పోరాటడానికి క్యారెట్ ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ తినడం వల్ల నోటి దుర్వాసన వంటి సమస్యలు పోతాయి. నోటి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. కాబటి చిగుళ్ల వ్యాధి, దంతక్షయం వంటివి రాకుండా క్యారెట్ కాపాడుతుంది.
రోజుకి ఒక క్యారెట్‌కు మించి తినకపోవడమే మంచిది. ప్రతిరోజూ క్యారెట్ తినేవారు ఒక క్యారెట్‌తోనే ఆపేయాలి. వారానికి రెండు మూడు సార్లు తినేవారు మాత్రం ప్రతిసారీ మూడు నుంచి నాలుగు క్యారెట్లు తినవచ్చు. క్యారెట్లు ప్రతిరోజూ తినేవారు అధికంగా తింటే వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
టాపిక్