Instant Sambar Recipe: తక్కువ సమయంలో ఇన్‌స్టెంట్ సాంబార్ రెసిపీ, అతిధులు వచ్చినప్పుడు ఇలా చేసేయండి-instant sambar recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Sambar Recipe: తక్కువ సమయంలో ఇన్‌స్టెంట్ సాంబార్ రెసిపీ, అతిధులు వచ్చినప్పుడు ఇలా చేసేయండి

Instant Sambar Recipe: తక్కువ సమయంలో ఇన్‌స్టెంట్ సాంబార్ రెసిపీ, అతిధులు వచ్చినప్పుడు ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu
Jan 22, 2025 11:41 AM IST

Instant Sambar Recipe: సాంబారు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇడ్లీ, దోశెలు, అన్నంతో సాంబారు రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలో సాంబారు ఎలా వండాలో తెలుసుకోండి.

ఇన్ స్టెంట్ సాంబారు రెసిపీ
ఇన్ స్టెంట్ సాంబారు రెసిపీ

తెలుగిళ్లల్లో సాంబారుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పిల్లలకు, పెద్దలకు సాంబారు అంటే ఎంతో నచ్చుతుంది. దీన్ని వండాలంటే ముందుగానే కందిపప్పును నాననబెట్టుకుని ఉడకబెట్టి వండాలి. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా కంది పప్పు ఉడకడానికి ఇంకా అధిక సమయం పడుతుంది. కాబట్టి ఇన్ స్టెంట్ గా తక్కువ సమయంలో సాంబారును వండడం నేర్చుకోవాలి. కంది పప్పు కన్న పెసరపప్పుతో వండితే సాంబారు సులువుగా ఉడికిపోతుంది. ఇన్ స్టెంట్ గా సాంబారు ఎలా వండాలో తెలుసుకోండి.

ఇన్ స్టెంట్ సాంబారు రెసిపీకి కావల్సిన పదార్థాలు

పెసరపప్పు - అర కప్పు

పచ్చిమిర్చి - ఒకటి

పసుపు - అర స్పూను

ఆవాలు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఉల్లిపాయ - రెండు

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

టొమాటోలు - రెండు

మునక్కాడలు - ఒకటి

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

ఎండు మిర్చి - రెండు

వెల్లుల్లి పాయలు - అయిదు

ఇంగువ - చిటికెడు

సొరకాయ - అర ముక్క

నీళ్లు - తగినంత

సాంబారు పొడి - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

ధనియాల పొడి - ఒక స్పూను

ఇన్ స్టెంట్ సాంబారు రెసిపీ

  1. సాంబారు త్వరగా ఉడకాలంటే కందిపప్పుకు బదులు పెసరపప్పును ఎంపిక చేసుకోండి.
  2. పెసరపప్పును కుక్కర్లో వేసి తగినంత నీళ్లు ఒక విజిల్ వచ్చే దాకా ఉడికిస్తే చాలు
  3. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టి నూనె వేయాలి.
  4. ఆ నూనెలో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
  5. తరువాత టోమాటోలు, సొరకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.

6. ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, సాంబారు పొడి, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

7. రెండు గ్లాసుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అందులోనే కొత్తిమీర తరుగును కూడా వేసి కలుపుకోవాలి.

8. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా కలుపుకోవాలి.

9. దీన్ని బాగా మరిగించాలి. ఇప్పుడు మరో బర్నర్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

10. ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.

11. ఆ తాళింపును వేసి మరుగుతున్న సాంబారులో వేయాలి. మూత పెట్టి అయిదు నిమిషాలు వేసి మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ సాంబారు రెడీ అయినట్టే.

కందిపప్పుతో చేసిన సాంబారు కన్నా పెసరపప్పు చేసిన సాంబారు త్వరగా ఉడికిపోతుంది. పైగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నం, ఉప్మా, ఇడ్లీ, దోశెల్లోకి కూడా తింటే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో వండుకుని చూడండి.. మీకెంతో త్వరగా నచ్చుతుంది.

Whats_app_banner