Instant Idli Recipe: సాఫ్ట్‌గా నోట్లో కరిగిపోయేలా ఇన్‍స్టంట్ ఇడ్లీ.. అప్పటికప్పుడు చేసుకోవచ్చిలా..
Instant Idli Recipe: పిండి పులియబెట్టకుండానే అప్పటికప్పుడు ఇడ్లీలు చేసుకోవచ్చు. అటుకులు, పెరుగు, రవ్వతో చేసే ఈ ఇడ్లీలు చాలా మృధువుగా ఉంటాయి. బాగా నచ్చేస్తుంది. ఈ ఇన్‍స్టంట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
మామూలుగా ఇడ్లీ చేయాలంటే మినప్పప్పును కొన్ని గంటల పాటు నానబెట్టి, గ్రైండ్ చేసుకొని, రవ్వతో కలిపి రాత్రంతా పులియబెట్టాల్సి ఉంటుంది. దీని కోసం కనీసం ఒక రోజు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అయితే, ఎప్పుడైనా అప్పటికప్పుడే ఇడ్లీ చేసుకోవాలని అనుకుంటే.. ఈ ‘ఇన్‍స్టంట్ ఇడ్లీ’ బెస్ట్ ఆప్షన్‍గా ఉంటుంది. పులిబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ ఇడ్లీలను చేసుకోవచ్చు. మృధువుగా నోట్లో కరిగిపోయేలా ఉంటాయి. ఈ ఇన్‍స్టంట్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఇన్‍స్టంట్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
- ఓ కప్పు మందం అటుకులు (కడిగి, నీటిలో అరగంట నానబెట్టాలి)
- ఒకటిన్నర కప్పుల పెరుగు
- ఓ కప్ బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ)
- అర టీస్పూన్ వంటసోడా
- పిండి గ్రైండ్ చేసుకునేందుకు, కలుపుకునేందుకు నీరు
- తగినంత ఉప్పు
ఇన్‍స్టంట్ ఇడ్లీ తయారీ విధానం
- ముందుగా అటుకులను నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో అటుకులు మునిగేలా నీరు పోసి సుమారు అరగంట నాననివ్వాలి.
- మరో మిక్సింగ్ బౌల్‍లో పెరుగు వేయాలి. దాంట్లో వంటసోడా కూడా వేసి విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి. పెరుగు గడ్డలు లేకుండా మెత్తగా అయ్యేలా మిక్స్ చేయాలి. దాన్ని ఓ ఐదు నిమిషాలు పక్కనపెట్టాలి.
- ఆ తర్వాత పెరుగులో బొంబాయి రవ్వ వేసి, బాగా కలపాలి. మిక్స్ చేసిన తర్వాత అరగంట పక్కనపెట్టాలి.
- నానబెట్టిన అటుకులను మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
- అరగంట పక్కనపెట్టిన పెరుగు, రవ్వ మిశ్రమంలో అటుకుల పేస్ట్ వేయాలి. వాటన్నింటినీ బాగా కలపాలి. చాలాసేపు మిక్స్ చేస్తే ఇడ్లీలు మృధువుగా వస్తాయి. ముందు నీరు వేయకుండా కలపాలి. ఆ తర్వాత కాస్త నీరు పోయాలి. సాధారణ ఇడ్లీ పిండి జారులోనే ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఇడ్లీ ప్లేట్ గుంతల్లో నూనె రాసి లేదా క్లాత్ పరిచి పిండిని పోసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పిండి పోసిన ప్లేట్స్ పెట్టి ఉడికించుకోవాలి. అంతే ఇన్‍స్టంట్ ఇడ్లీ తయారవతుంది.
ఈ ఇన్‍స్టంట్ ఇడ్లీని సుమారు గంటలో తయారు చేసుకోవచ్చు. ఇవి తినేందుకు చాలా మృధువుగా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటాయి. అయితే, పెరుగు, రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఎక్కువ సేపు బాగా కలిపితేనే సాఫ్ట్‌గా వస్తాయని గుర్తుంచుకోవాలి. పుల్లటి పెరుగు వాడితే మరింత మెరుగ్గా ఉంటాయి.
సంబంధిత కథనం