భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే మన భారత ప్రభుత్వం మనందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఒకవేళ పరిస్థితులు ఏమైనా తేడాగా మారితే దానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వం కొన్ని శిక్షణలు అంటే మాక్ డ్రిల్స్, బ్లాక్అవుట్ సన్నాహాలు, హెచ్చరిక సైరన్ల వంటి చర్యలు చేపడుతోంది.
ప్రజలందరూ భయపడకుండా, ప్రశాంతంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కానీ ఇలాంటి సమయాల్లో మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి అత్యవసర పరిస్థితులు ఎదురైతే మనం ఎలా సిద్ధంగా ఉండాలో మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటానికి ఏమేం చేయాలో తెలుసుకోండి. ఇక్కడున్న కొన్ని ముఖ్యమైన వస్తువులతో ఒక ఎమర్జెన్సీ కిట్ తయారుచేసుకుని దాన్ని ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి. ఆ కిట్‌లో ఏమేం ఉండాలో తెలుసుకుందాం రండి.
అత్యవసర పరిస్థితి వస్తే ముందుగా అవసరం అయ్యేది నీళ్లు. కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా కొన్ని నీళ్ల బాటిళ్లు లేదా నీళ్లు నిల్వ చేసుకునే డబ్బాలు సిద్ధంగా ఉంచుకోండి. ఒకవేళ నీళ్లు దొరకకపోతే నీటిని శుభ్రం చేసే మాత్రలు లేదా ఫిల్టర్లును దగ్గర పెట్టుకోండి.
ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోండి. ఉదాహరణకు, డబ్బాల్లో ఉండే కూరగాయలు, బీన్స్, మాంసం, ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెంలు, ఎండిన పండ్లు, గింజలు, ఎనర్జీ బార్లు, శనగలు, ఓట్స్, క్వినోవా, గుడ్లు లాంటివి ఎక్కువ శక్తినిస్తాయి. ఇవి ఇంట్లో ఎప్పుడూ ఉండేలా చూసుకోండి.
ఈ సంక్షోభ సమయంలో చిన్న చిన్న గాయాలకు ప్రాథమిక చికిత్స చేసుకోవడానికి అవసరమయ్యే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడూ మీ దగ్గర ఉండటం చాలా ముఖ్యం. అందులో బ్యాండేజీలుగ్లౌజులు, యాంటిసెప్టిక్ వైఫ్స్, పెయిన్ రిలీవర్స్, థర్మామీటర్, కత్తెర వంటివి ఉండాలి.
శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి, వాతావరణానికి తగ్గట్టుగా ఒంటిని కాపాడుకోవడానికి కొన్ని జతల బట్టలు (లోపలి దుస్తులతో సహా) ఉంచుకోవాలి. బూట్లు, సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్, ఆడవాళ్ల కోసం ప్రత్యేకమైన వస్తువులు, తువ్వాళ్లు, టిష్యూలు, మాస్క్‌లు వంటి వాటిని దగ్గరే పెట్టుకోండి.
మీకు సంబంధించిన ముఖ్యమైన కాగితాలన్నింటినీ నీళ్లు తగలకుండా ఉండేలా ఒక కవర్లో లేదా పెన్ డ్రైవ్‌లో భద్రంగా ఉంచండి. గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌లు, హెల్త్ రిపోర్ట్స్, బీమా పేపర్లు, సర్టిఫికెట్లు వంటి వాటితో పాటు, ఎవరికైనా అత్యవసరంగా ఫోన్ చేయాలంటే వారి నంబర్లు రాసి పెట్టుకోండి.
కష్ట సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి లేదా సమాచారం తెలుసుకోవడానికి కొన్ని వస్తువులు అవసరం. బ్యాటరీతో పనిచేసే లేదా చేతితో తిప్పితే వచ్చే రేడియో, అదనపు బ్యాటరీలు లేదా సోలార్ ఛార్జర్లు, ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంకులు, ఎవరినైనా పిలవడానికి విజిల్ పెట్టుకోండి.
కొన్నిసార్లు ఆన్‌లైన్ పేమెంట్స్ పనిచేయకపోవచ్చు. అందుకే కొంచెం డబ్బును ఇంట్లో ఉంచుకోండి. అలాగే, టార్చ్‌లైట్, చిన్న మరమ్మత్తులు చేయడానికి సుత్తి, రెంచ్, ప్లయర్లు లాంటివి ఉంచుకోండి. అలాగే ఏదైనా అతికించడానికి డక్ట్ టేప్, కట్టడానికి జిప్ టైలు, చెత్త వేసుకోవడానికి కవర్లు కూడా సిద్ధంగా ఉంచుకోండి.
ఎక్కువ కాలం కష్టాల్లో ఉంటే మనసు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి మీ మనసుకు నచ్చిన పుస్తకాలు, రాయడానికి డైరీలు, పజిల్స్ లేదా పేకాట లాంటి ఆటలు పెట్టుకోండి. పిల్లలు ఉంటే వారికిష్టమైన బొమ్మలు తీసుకోండి. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే చిన్న విగ్రహాలు లేదా ప్రార్థన పుస్తకాలు కూడా ఉంచుకోవచ్చు.
ఒకవేళ మీరు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే వేడి తగలకుండా ఉండటానికి, పడుకోవడానికి కొన్ని వస్తువులు అవసరం. అత్యవసర దుప్పట్లు లేదా స్లీపింగ్ బ్యాగులు, చిన్న టెంట్ లేదా టార్పాలిన్ గుడ్డ లాంటిది కప్పుకోవడానికి, చలి ఎక్కువగా ఉంటే చేతులు వెచ్చగా ఉంచుకోవడానికి హ్యాండ్ వార్మర్లు తీసుకోండి.