Indians and Health: భారతీయులకే అలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే-indians are at high risk of heart diseases and everyone should be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indians And Health: భారతీయులకే అలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే

Indians and Health: భారతీయులకే అలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే

Haritha Chappa HT Telugu
Jun 20, 2024 11:04 AM IST

Indians and Health: ఇతర దేశాల వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం మన దేశ ప్రజలకే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా సంస్థ పేర్కొంది.

భారతీయల్లో గుండె సమస్యలు
భారతీయల్లో గుండె సమస్యలు (Pexels)

Indians and Health: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారతీయలే అధికంగా గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నట్టు అంచనా వేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం మనదేశంలో గుండె జబ్బులు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, జీవనశైలిలో మార్పులు వంటి కారకాల వల్ల ఇలా ఎక్కువమంది గుండెపోటు బారిన పడుతున్నారు. వారి ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి పెరగడం ఇవన్నీ కూడా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధులలో భారతీయులే అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా కరోనరీ వ్యాధి కేసులు మనదేశంలోని అధికంగా నమోదయ్యాయి. అందుకే భారతీయులు గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయుల్లో కరోనరీ ఆర్టరీ వ్యాధి వల్ల మరణిస్తున్న శాతం 20 నుంచి 50శాతం ఎక్కువగా ఉంది. జన్యువులు కారణంగా లేదా జీవనశైలి కారణంగా భారతీయులకు ఇలా కరోనరీ ఆర్టరీ వ్యాధి అధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం వంటి పనులు చేయడం వల్ల, ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక లిపో ప్రోటీన్ వంటివి కూడా కరోనరీ ఆర్టరీ వ్యాధి బారిన పడేలా చేస్తున్నాయి. అధిక లిపో ప్రోటీన్ స్థాయిలు వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె సమస్యలు వారసత్వంగా వస్తున్నట్లు ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. కాబట్టి భారతీయులు గుండె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

మహిళల్లోనే ఎక్కువ

గుండె జబ్బులు వచ్చే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు వైద్యులు. దవడ లేదా మెడ నొప్పి, అలసట, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల్లో హృదయ సంబంధ వ్యాధుల లక్షణాలను గుర్తించడం కాస్త కష్టంగానే ఉంటుంది. స్త్రీలకు సాధారణంగా ఛాతీ నొప్పి, తీవ్ర అలసట, శ్వాస ఆడక పోవడం, వికారంగా అనిపించడం, వెన్నులో నొప్పి రావడం వంటివి వస్తూ ఉంటాయి. ఇవి గుండె సంబంధమైనవా? కాదా? అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. హార్మోన్లలో హెచ్చుతగ్గులు రావడం, మెనోపాజ్ సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపించడం జరుగుతాయి. అవి సాధారణ లక్షణాలా లేక గుండె సమస్య లక్షణాలొ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేయలేకపోతున్నారు. మహిళల్లో గుండె జబ్బులపై తక్కువ అవగాహన ఉంది. గుండె జబ్బుల లక్షణాలు వారికి తెలియవు. దీనివల్ల ఏవైనా నొప్పులు లేదా సౌకర్యం కలిగితే కాసేపు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వైద్యులను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీనివల్ల వారిలో మరణాల రేటు పెరిగిపోతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా, చెమట అధికంగా పడుతున్నా, గుండెల్లో మంటగా ఉన్నా, వికారంగా ఉన్నా వెంటనే వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. అలాగే దవడ లేదా మెడ నొప్పి, ఛాతిలో అసౌకర్యం ఎక్కువ సమయం పాటు వేధిస్తే వైద్యులను సంప్రదించాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వయసు వారికి గుండెపోటు లేదా గుండె వైఫల్యం వంటి సమస్యలు వస్తాయో అంచనా వేయడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

WhatsApp channel