భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుండి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుండి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు ఇది. ఈ సంవత్సరం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకల గురించి తెలుసుకోండి.
ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం యొక్క థీమ్ ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ (ముందు దేశం.. ఎల్లప్పుడూ ముందు). అన్ని స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు, ఈవెంట్‌లు ఈ థీమ్‌పై ఆధారపడి ఉంటాయి.
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ నేతృత్వంలో స్వాతంత్య్ర ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధంతో ప్రారంభమైంది. జూలై 4, 1947న భారత స్వాతంత్య్రబిల్లు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. అది పక్షం రోజుల్లో ఆమోదం పొందింది. ఆగష్టు 15, 1947 న 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన అంతం కావడంతో భారతదేశం స్వాతంత్య్ర పొందింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మరెందరో నాయకులు భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.
స్వాతంత్య్ర దినోత్సవం స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అనేక త్యాగాలు, పోరాటాలను గుర్తుచేస్తుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం దేశం పట్ల దేశభక్తి భావాలను, దేశానికి సేవ చేయాలనే సంకల్పాన్ని నడిపిస్తుంది. ఇది పౌరులలో ఐక్యత, కర్తవ్య భావాన్ని కూడా సృష్టిస్తుంది.
భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ సెలవుదినం. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత సైనిక కవాతు నిర్వహిస్తారు. ఆగష్టు 15, 1947 న భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట యొక్క లాహోరీ గేట్ పైన భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి ప్రధాని ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలలు, వారి కార్యాలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రదేశాలను త్రివర్ణ అలంకరణలతో అలంకరించడం, త్రివర్ణ నేపథ్య దుస్తులు ధరించడం, దేశభక్తి సినిమాలు చూడటం, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పాటలు వినడం, నేతలను గుర్తు చేసుకోవడం ద్వారా వేడుకలు జరుపుకుంటారు.