Parenting Tips: పిల్లల్లో చదివే అలవాటును ఇలా పెంచండి, ఇందుకోసం మీరు చేయాల్సిన పనులు ఇవే
Parenting Tips: పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు చేయడం మంచిది. ఇది వారికి పెద్దయ్యాక కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దానికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
Parenting Tips: పిల్లలకు చిన్నప్పుడు మనం ఎలాంటి పనులు, విలువలు నేర్పుతామో వారు పెద్దయ్యాక కూడా వాటిని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి చిన్న వయసులోనే వారికి పుస్తక పఠనాన్ని దగ్గర చేయాలి. ఇలా పుస్తకాలు చదివే పిల్లలు తెలివైన వారుగా మారుతారు. ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకు ఉంటే వారి భవిష్యత్తు అందంగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. చిన్నప్పటి నుంచి వారిని పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులే ప్రోత్సహించాలి. పుస్తక పఠనం అనేది జ్ఞానంతో ముడిపడి ఉన్నది. పిల్లలకు చిన్న వయసులోనే పుస్తకాలు చదవడం పట్ల ఇష్టాన్ని పెంచాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి.

ముందుగా మీరు చదవండి
చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. అందుకే తల్లే మొదటి గురువు అని అంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. తండ్రి క్రికెట్ చూస్తున్నప్పుడు పిల్లలు కూడా క్రికెట్ ఆట పట్ల ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. అలాగే ఆహార పద్ధతులు కూడా తల్లిదండ్రులు వేటిని ఇష్టంగా తింటారో... పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని బట్టి మీరు చేయాల్సింది... పిల్లలకు పుస్తక పఠనం అలవాటు అవ్వాలంటే మీరు ముందుగా పుస్తకాన్ని పట్టుకోండి. పిల్లలు చూసినప్పుడల్లా మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల పుస్తకాలు చదవాలన్న ఆలోచన పుడుతుంది. ఆసక్తి పెరుగుతుంది. మీరు చదవకుండా పిల్లలు మాత్రమే చదవాలంటే కుదరదు. పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు ఏవైనా సరే చదువుతున్నట్లు మీరు వారికి కనిపించాలి. అప్పుడే వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలుగుతుంది. స్వయంగా తామే ఒక పుస్తకాన్ని తీసి చదవడం మొదలుపెడతారు.
పుస్తకాలు చదవడం పై కాస్త ఆసక్తి కలిగితే చాలు, మీరు దాన్ని రోజూ ఒక షెడ్యూల్ గా మార్చేయండి. ముఖ్యంగా నిద్ర పోవడానికి ముందు పుస్తకం చదవడం అనేది విశ్రాంతిగా అనిపిస్తుంది. ఇది పిల్లలకు కూడా ఎంతో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు పిల్లలకు ఒక పుస్తకాన్ని ఇచ్చి కాసేపు ప్రశాంతంగా చదువుకోమనండి. వారికి పావుగంటలోనే నిద్ర వచ్చేస్తుంది.
పిల్లలకి చదవాలన్న ఆసక్తి పుట్టాక... ఆ ఆసక్తి, అలవాటు కొనసాగాలంటే వారి వయసుకు నచ్చే పుస్తకాలను ఎంపిక చేయాలి. కథల పుస్తకాలు, ఫాంటసీ, అడ్వెంచర్ మిస్టరీ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను చదివించడం ద్వారా వారిలో ఆ అలవాటును కొనసాగేలా చేయవచ్చు. కొంతమంది పిల్లలు సైన్స్‌ని బాగా ఇష్టపడతారు. అలాంటి వారికి సైన్స్ పుస్తకాలను ఇవ్వండి. అలాగే హిస్టరీ బుక్స్ కూడా ఆసక్తిని పెంచుతాయి.
ఇప్పుడు సాంకేతికత అధికంగా ఉన్న రోజులు అయితే పిల్లలకు E బుక్స్, ఆడియో బుక్‌లు కన్నా సాధారణ పుస్తకాలను చేతికిచ్చి చదివించడమే మంచిది. ఇదే వారిలో మంచి ఫలితాలను ఇస్తుంది. E బుక్స్‌ను ఇవ్వడం వల్ల కంటిచూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అందరి పిల్లలు ఫాస్ట్‌గా చదవాలని లేదు, అలాంటప్పుడు మీరు వారికి చదవడం దగ్గరుండి నేర్పించవచ్చు. పిల్లలకు ఆ పుస్తకం బోరింగ్‌గా అనిపిస్తే కామిక్స్, మ్యాగజైన్లు వంటివి ఇచ్చి చదవమని చెప్పండి. ఏదేమైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన పిల్లలు భవిష్యత్తులో కచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటారు.