New Study: షాకింగ్ అధ్యయనం, ఇలాంటి ఆహారాలు తింటే 32 రకాల వ్యాధులు వచ్చే అవకాశం
New Study: కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మనుషులకు 32 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఇది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
New Study: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతను తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు... కలుషితం కాకుండా ఉండాలి. కానీ మనిషి తనకి తానుగానే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టంగా తింటూ అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు అంతా కలిసి ఒక కొత్త అధ్యయనం ద్వారా తేల్చారు. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ను తినడం వల్ల మానసిక, శ్వాసకోశ, హృదయనాళ, జీర్ణాశయాంతర వ్యాధులు అధికంగా పెరుగుతున్నట్టు గుర్తించారు.
అలాగే వీటి వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నట్టు చెప్పారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కార్డియోస్క్యులర్ డిసీజ్‌లకు సంబంధించిన మరణాల ప్రమాదం 50 శాతం పెరుగుతుందని వారు అధ్యయనంలో తేల్చారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారిలో టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదం 12 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి వారు మిగతా వారితో పోలిస్తే ముందుగా మరణించే అవకాశం ఇరవై ఒక్క శాతం అధికంగా ఉంటుందని చెప్పారు.
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల దాదాపు 32 రకాల వ్యాధులు మనిషి పై దాడి చేసే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. అందులో ఊబకాయం, నిద్రా సమస్యలు, డిప్రెషన్, క్రోన్స్ వ్యాధి, జీర్ణాశయంతర వ్యాధులు... ఇంకెన్నో ఉన్నాయి. అలాగే రొమ్ము క్యాన్సర్, నాడీ వ్యవస్థలో కణితులు ఏర్పడడం, లుకేమియా, కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే
అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటే సహజంగా తయారైనవి కాదు. పారిశ్రామిక పద్ధతుల ద్వారా సృష్టించబడేవి. కొన్ని రకాల ప్రక్రియలకు గురి చేయడం ద్వారా వాటిని సృష్టిస్తారు. ఉదాహరణకు చక్కెర నిండిన స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, డ్రింకులు... ఇలాంటివన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలోకి వస్తాయి. వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉండదు. అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు, ఉప్పు అధికంగా ఉంటాయి. వీటివల్లే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
అలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. అప్పుడే తాజాగా వండిన ఆహారాన్ని తినడం, పండ్లు, కూరగాయలతో చేసిన ఆహారాలను తినేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యం. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ నాలికకు రుచిగా ఉంటాయి. కానీ శరీరంలో చేరాక అవి చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీర్ఘకాలంలో మీరు 32 రకాల వ్యాధులలో ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం అధికంగా ఉన్నట్టు అధ్యయనకర్తలు చెబుతున్నారు. కాబట్టి చక్కెర పానీయాలు, కూల్ డ్రింకులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మైదాతో వండిన స్వీట్లు వంటివి తినడం మానేయాలి. ముఖ్యంగా ఎక్కువ రోజులు పాటు నిల్వ చేసే ప్యాక్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పిల్లలకు అలాంటి ఆహారాలను దూరంగా ఉంచండి. వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే.