Sravana Masam 2022 : శ్రావణ మాసం వచ్చేసింది.. ముఖ్యమైన తేదిలివే..-important and devotional days of sravana masam 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Important And Devotional Days Of Sravana Masam 2022

Sravana Masam 2022 : శ్రావణ మాసం వచ్చేసింది.. ముఖ్యమైన తేదిలివే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 29, 2022 06:35 AM IST

Sravana Masam 2022 : మహిళలకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది. 2022 శ్రీ శుభకృత్నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి.. శ్రావణమాసం మొదలై.. శ్రావణ బహుళ అమావాస్యకు ముగుస్తుంది. అంటే 2022 జూలై 29న అనగా ఈరోజు ప్రారంభమై.. ఆగస్టు 27న ముగుస్తుంది. తెలుగు మాసాల ప్రకారం ఇది ఐదవ నెల. ఆషాడమాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. మరి ఈ మాసంలోని ముఖ్యమైన తేదీలు, వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ మాసం 2022
శ్రావణ మాసం 2022

Sravana Masam 2022 : హిందువులు శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. చాలా మంది హిందువులు ఈ నెల మొత్తం ఉపవాసం పాటిస్తారు. అంతేకాకుండా లక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పైగా ఈ మాసం మొత్తం లక్ష్మీదేవికి అంకితం. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం కూడా అత్యంత పవిత్రమైన ఫలితాలను తెస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు (పౌర్ణమి) శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు పెట్టారు. అయితే శ్రావణ మాసం జూలై 29 శుక్రవారం మొదలై.. ఆగస్టు 27 శనివారం ముగుస్తుంది.

2022లో శ్రావణ శుక్రవారం తేదీలివే..

శ్రావణ మాసంలో శుక్రవారాలు శ్రీ మహా లక్ష్మీ ఆరాధనకు అత్యంత ముఖ్యమైనవి. మహిళలు శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. సాధారణంగా రెండవ శుక్రవారం లేదా పూర్ణిమ రోజు ముందు శుక్రవారం ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. పైగా ఈసారి శ్రావణ మాసం మొదలైందే శుక్రవారంతో కాబట్టి. ఈసారి దీనిని మరింత శుభ సూచికంగా భావిస్తున్నారు. మరి శ్రావణ మాసంలో శుక్రవారం తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* జూలై 29

* ఆగస్టు 5

* ఆగస్టు 12

* ఆగస్టు 19

2022లో శ్రావణ సోమవారం తేదీలు

శ్రావణ మాసంలో సోమవారాలు శివునికి అంకితం చేస్తారు. ఇంతకీ శ్రావణమాసంలో శివుని ఎందుకు పూజిస్తారో తెలుసా? తెలియదా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన గ్రంధాల ప్రకారం.. ఈ శ్రావణమాసంలో సముద్ర మథనం జరిగింది. ఇది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి చేసిన కృషి. దేవతలు, రాక్షసులు సుమేరు పర్వతాన్ని మథనానికి ఉపయోగించారు. శివుని మెడలోని పాము వాసుకిని తాడుగా ఉపయోగించారు.

ఈ మథనం ఫలితంగా సముద్రం నుంచి అమృతం కన్నా ముందు పెద్ద మొత్తంలో విషం రాగా.. దేవతలు, రాక్షసులు ఎవరూ ఈ విషాన్ని ఎదుర్కోలేకపోయారు. అప్పుడు శివుడు వారిని రక్షించటానికి వచ్చి.. విషం మొత్తం తాగాడు. ఈ విషం కారణంగానే శివుని కంఠం నీలిరంగులోకి మారింది. అందుకే శివుడిని నీలకంఠుడు అంటారు. ఈ విధంగా శివుడు శ్రావణమాసంలో అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి.. శివుని పూజిస్తారు.

* ఆగస్టు 1

* ఆగస్టు 8

* ఆగస్టు 15

* ఆగస్టు 22

2022లో మంగళ గౌరీ వ్రతం తేదీలు

మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో మంగళవారాల్లో వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని అమ్మవారిని పూజిస్తారు.

* ఆగస్టు 2

* ఆగస్టు 9

* ఆగస్టు 16

* ఆగస్టు 23

శ్రావణమాసం ప్రాముఖ్యత

శ్రావణమాసం చాలా పవిత్రమైనది. ఎందుకంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ మాసం శ్రీ మహా లక్ష్మీ దేవి ఆరాధనకు అంకితం చేశారు. మంగళవారాలు, శుక్రవారాలు ఏవైనా లక్ష్మీని ఆరాధించడానికి ముఖ్యమైన రోజులు. శ్రావణ మాసంలో ఈ రోజులను పాటించడం మరింత శక్తివంతమైనది. ఫలవంతమైనది.

శ్రావణ మాసంలో ప్రధాన పండుగలు

శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవరం, మంగళ గౌరీ వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలు.

శ్రావణ మాసంలో శుభకార్యాలు

శ్రావణమాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. గృహప్రవేశాలకు, వివాహాలకు, మరే ఇతర కార్యక్రమాలకైనా శ్రావణమాసం చాలా శుభప్రదమైనది. కానీ అధిక మాసం లేదా అశుభ దినాలు వచ్చినప్పుడు వివాహాలు, గృహ ప్రవేశం లేదా ఇతర కార్యక్రమాలకు మంచిది కాదు.

WhatsApp channel

సంబంధిత కథనం