మీ బాయ్ ఫ్రెండ్‌‌కు ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, అతనితో జీవించడం కష్టం-if your boyfriend has such habits leave him immediately it will be difficult to live with him ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ బాయ్ ఫ్రెండ్‌‌కు ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, అతనితో జీవించడం కష్టం

మీ బాయ్ ఫ్రెండ్‌‌కు ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయండి, అతనితో జీవించడం కష్టం

Haritha Chappa HT Telugu

బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అతడి అనుబంధాన్నిపెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే కొన్ని రకాల లక్షణాలు వారిలో ఉండాలి. అలాగే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు.

భాగస్వామిలో ఉండకూడని లక్షణాలు (Pixabay)

ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. మొదట బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గా మొదలైన ప్రయాణం తర్వాత ప్రేమికులుగా.. ఆ తర్వాత భార్యాభర్తలుగా మారుతుంది. అయితే ఒక సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే ఎదుటి వ్యక్తిలో కొన్ని రకాల గుణాలు ఉండాలి. అలాగే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. మీ భాగస్వామిలో ఎలాంటి అలవాట్లు ఉంటే ప్రమాదమో తెలుసుకోండి.

మీ స్వేచ్ఛను అడ్డుకోకూడదు

మీరు చేసే మంచి పనులకు అతని తోడు ఎప్పుడూ అవసరం. మీరు బయటకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు లేదా ఫోన్‌తో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, స్నేహితుల్ని కలవడానికి వెళుతున్నప్పుడు... అతడు పదేపదే అడ్డుకుంటే అది మంచి సంకేతం కాదు. అతను మిమ్మల్ని జీవితాంతం స్వేచ్ఛగా వదిలిపెట్టడని అర్థం. స్వేచ్ఛ లేని జీవితాన్ని గడపడం చాలా కష్టం. మీ మీద నమ్మకం ఉన్న వ్యక్తి మీరు ఎక్కడికి వెళ్ళినా అంగీకరించాలి. ఫోన్లో అందరితో మాట్లాడేందుకు ఒప్పుకోవాలి. అలా చేయడం లేదంటే అతడిలో విషపు గుణాలు ఉన్నాయని అర్థం చేసుకోండి.

నియంత్రించే వ్యక్తి వద్దు

మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ నిత్యం మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటే వారితో జీవితం కష్టంగా మారుతుంది. ఆమె లేదా అతడు ప్రేమతోనే మిమ్మల్ని నియంత్రిస్తున్నా కూడా జీవితాంతం భరించడం చాలా కష్టం. మీ కోరికలు మీ ఇష్టాల ప్రకారం జీవితాన్ని జీవించే అవకాశాన్ని వాళ్ళు మీకు ఇవ్వరు. కొన్నాళ్లకు మీ మధ్య బంధం కూడా వీగిపోతుంది. పెళ్లయ్యాక విడాకులు తీసుకునే బదులు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడే విడిపోవడం మీ కుటుంబాలకు మంచిది.

తక్కువ చేసి మాట్లాడే వ్యక్తి

మీ భాగస్వామి అతని స్నేహితుల ముందు కుటుంబ సభ్యుల ముందు మీకు ఎక్కువ విలువను ఇవ్వాలి. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.. కానీ అందరి ముందు మిమ్మల్ని ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నా, మీ ఇష్టాలను తక్కువ చేస్తున్నా, మీ భావోద్వేగాలకు విలువ లేనట్టు మాట్లాడుతున్నా... ఆ వ్యక్తితో జీవితం చాలా కష్టం. అలాంటి వ్యక్తి విషపూరిత భాగస్వామి అని అర్థం చేసుకోండి. అలాంటి భాగస్వామితో సంబంధం లో ఉండడం ఎప్పటికైనా ప్రమాదకరమే.

పైన చెప్పిన లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం రెండు కుటుంబాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు జీవితాన్నే కోల్పోవాల్సి రావచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పిన లక్షణాలున్న బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ మీకు ఉంటే వీలైనంతవరకు బ్రేకప్ చెప్పుకొని ముందుకు వెళ్లడం ఉత్తమం. దీనివల్ల మీ జీవితమే కాదు మీ ఇంట్లోని వారి జీవితం కూడా నరకప్రాయం కాకుండా కాపాడుకోవచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.