Cognitive decline: అలా ఆందోళన చెందితే.. జ్ఞాపకశక్తి ఎక్కువ దెబ్బ తింటుందట!
Cognitive decline: జ్ఞాపక శక్తి విషయంలో ఆందోళన చెందితే వచ్చే రిస్క్ గురించి తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మతిమరుపుకు కారణం అవుతుందని పేర్కొంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
వయసుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. ఎక్కువ మంది దాన్ని అంగీకరిస్తారు. అందుకే వయసు మీద పడితే మెదడు పనితీరు తగ్గిపోతుందని మనం అనుకుంటూ ఉంటాం. అయితే, మర్చిపోతామని ఆందోళన చెంది, దాన్ని నమ్మడం వల్ల మెదడు పనితీరుకు దెబ్బగా మారుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
సానుకూలంగా ఉంటే..
వయసు పెరిగే కొద్ది తమ పరిస్థితిపై సానుకూల దృక్పథంతో ఉన్న వృద్ధుల్లో జ్ఞాపక శక్తి తగ్గడం తక్కువగానే ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. జ్ఞాపకశక్తి దెబ్బ తింటుందని ఆలోచించకపోతే.. మెదడు తీరు మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. వయసురీత్యా వచ్చే సమస్య గురించి మనం ఏం ఆలోచిస్తామో అది జ్ఞాపకాలు, మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. మర్చిపోవడం గురించి ఆందోళన చెందితే జ్ఞాపకశక్తి నిజంగానే దెబ్బ తినే అవకాశం పెరుగుతుందని వెల్లడించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ నిక్కీ ఎల్ హిల్ నేతృత్వంలోని బృందం ఈ స్టడీ చేసింది.
అధ్యయనం ఇలా..
65 నుంచి 90 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 581 మందిపై ఈ అధ్యయనం జరిగింది. వయసు సగటున 71గా ఉంది. వయసు మీద పడడం గురించి వారు ఎలా ఆలోచిస్తున్నారు, జ్ఞాపకశక్తి గురించి ఏం అనుకుంటున్నారు, వారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల ఎలా ఉంది అనే అంశాలపై ఈ అధ్యయనం సాగింది.
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి కోల్పోవడం సాధారణం అనుకుంటూ.. అలానే ఎక్కువగా ఆలోచించిన వారిలో జ్ఞాపక శక్తి నిజంగానే ఎక్కువగా క్షీణస్తుందని ఈ స్టడీ వెల్లడించింది. మరోవైపు, సానుకూల దృక్పథం కలిగి ఉన్న వారు జ్ఞాపకశక్తిలో లోపాలను అప్పుడప్పుడే ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది.
వయసు మీద పడే కొద్ది ఎదురయ్యే పరిస్థితుల అంచనాలపై ఈ అధ్యయనం జరిగింది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి అంశాలపై సాగింది. వ్యక్తిగత ఆలోచన ప్రభావం ఈ మూడింటిపైనా ఉంటుందని ఈ స్టడీ తేల్చింది. అంతా బాగుంటుందని సానుకూలంగా అనుకునే వారిలో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉన్నాయని తేల్చింది. వారిలో మతిమరుపు తక్కువగా ఉందని పేర్కొంది. వయసురీత్యా వచ్చే సమస్యలకు, ఆలోచలను బలమైన సంబంధం ఉంటుందని తేల్చింది.
వయసురీత్యా ఎదురయ్యే సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెంది ఆలోచించకూడదని ఈ అధ్యయనం పేర్కొంది. సానుకూల దృక్పథంలో ఉండాలని చెబుతోంది. వృద్ధాప్యం గురించి ముందు నుంచే నెగెటివ్ ఆలోచనలు చేయకూడదని చెప్పింది. వృద్ధాప్యం గురించి ఎలాంటి దృక్పథంలో ఉండాలో వెల్లడించింది.
టాపిక్