వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించే వీలు మీకు లేకపోతే తప్పకుండా కొన్ని వంటింటి చిట్కాలు తెల్సుకోవాల్సిందే. వంటకు అవసరమయ్యే కొన్ని పదార్థాలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఎంత హడావుడి ఉన్నా రుచికరమైన వంటలు చేయగలుగుతారు. అవేంటో తెల్సుకోండి.
ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటే చాలా వంటలు చేయడం సులువవుతుంది. సాంబార్, చట్నీలు, పులిహోర.. ఇలా చాలా వంటలు టక్కుమని చేసుకోవచ్చు. దానికోసం శుభ్రంగా ఉన్న చింతపండును కనీసం గంటపాటు వేడినీళ్లలో నానబెట్టాలి. చింతపండులో ఎలాంటి చెత్త లేకపోతే నీళ్లు లేకుండా వడకట్టి మిక్సీ పట్టేయాలి. లేదంటే చిక్కటి గుజ్జు చేత్తో పిండుకోవాలి. ఈ గుజ్జును చిక్కగా అయ్యేదాక ఉడికించుకుని చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలు. గాజు సీసాలో భద్ర పరుచుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వదు. అవసరమైనప్పుడు చేయి పెట్టకుండా చెంచాతో కాస్త గుజ్జు తీసి వంటల్లోకి వాడుకుంటే సరి.
ఉదయాన్నే నిమ్మరసం,తేనె కలిపి నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దాంతో పాటూ పప్పుల్లో, కూరల్లో నిమ్మరసం చాలానే వాడతాం. ప్రతిసారి నిమ్మరసం పిండుకునే పనిలేకుండా ఒకేసారి సమయం ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ నిమ్మకాయల రసం గిన్నెలో పిండుకోవాలి. ఐస్ క్యూబ్ ట్రేలలో ఈ రసాన్ని వేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు నేరుగా వాడుకోవచ్చు.
అల్లం వెల్లుల్లి ముద్ద రెండు మూడు నెలలైనా తాజాగా ఉండాలంటే మంచి మార్గం ఫ్రిజ్ లో స్టోర్ చేయడం. అల్లం వెల్లుల్లి ముద్ద మిక్సీ పట్టేటప్పుడు కప్పు ముద్దకు చెంచా నూనె, చెంచా ఉప్పు లెక్కన వేసుకోవాలి. మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి ముద్దను బాగా కలిపి ఒక ప్లేట్లో చిన్న చిన్న ముద్దల్లా చెంచాతో పెట్టుకుని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. అవి గడ్డల్లాగా మారిపోయాక ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు ఒక ముక్క తీసుకుని వాడుకోవడమే. లేదంటే ఐస్ క్యూబ్ ట్రే కూడా వాడొచ్చు.
మీకు సమయం ఉండదు అనుకున్నప్పుడు నాలుగైదు రోజులు వండబోయే కూరల కోసం ముందుగానే కర్రీ బేస్ తయారు చేసుకోవచ్చు. దీన్ని నూనెలో వేయించి ఏవైనా కూరగాయ ముక్కలు వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. దానికోసం జీడిపప్పు, కర్బూజా గింజలు, టమాటాలు నూనెలో మెత్తగా మగ్గేదాకా వేయించుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనె వేసుకుని మీకిష్టమైన మసాలాలు.. లవంగాలు, జాపత్రి, దాల్చినచెక్క, యాలకులు వేసి అవి వేగాక ముందుగా పట్టుకున్న ప్యూరీ కలుపుకుని చిక్కగా అవనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కలుపుకుని దించేసుకుంటే చాలు. దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకుని నాలుగైదు రోజులు వాడుకొవచ్చు. ఏ కూర అయినా సులువుగా రెడీ అయిపోతుంది.
టాపిక్