ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ కొందరు మాత్రం దానిని వదలుకోలేరు. ఒక్కసారి అలవాటైతే ఇక దాని నుంచి బయటకు రావడం కష్టంగా మారుతుంది. మానేయాలంటే మనతో మనం చిన్నపాటి యుద్ధమే చేయాలి. పొగ తాగితే లెక్కలేనని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ వదిలేసేందుకు మాత్రం పెద్దగా ఇంట్రస్ట్ చూపించం. అయితే మీరు ఒక్కసారిగా సిగరెట్ మానేస్తే కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి.
ధూమపానం చేస్తే గుండె, హార్మోన్లు, జీవక్రియ, మెదడుతో సహా శరీరంలోని అనేక భాగాలు ప్రభావితం అవుతాయి. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు, మహిళలు దీనికి పొగ తాగేందుకు బానిసలయ్యారు. ఈ ధూమపానం మానేయాలని భావించేవారు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
ధూమపానం మానేయడం అనేది మనం అనుకునేంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు వెంటనే ధూమపానం మానేసినప్పుడు, మీరు ఆకలి, అలసట, తలనొప్పి, నిద్రలేమి, దగ్గు, మలబద్ధకం వంటి కొన్ని తాత్కాలిక సమస్యలను చూడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు లైఫ్ టైమ్ ఉంటాయని మీరు భ్రమ పడకూడదు. కొన్ని రోజులు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు లేదా మూడు వారాలు మాత్రమే ఇబ్బంది పడతారు. తర్వాత అలవాటైపోతుంది. ఒకవేళ మీకు మీరు ధూమపానానికి బానిసలైతే.. మానేసిన తర్వాత తిరిగి రాకుండా ఉండేందుకు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ మందులు కూడా వాడొచ్చు. అయితే వైద్యుడి సూచనల మేరకు వాడాలి.
ధూమపానం చేయాలనే కోరిక 15 నుండి 20 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఒకసారి సిగరెట్ తాగాలనే ఆలోచన వస్తే.. కొన్ని నిమిషాలు మాత్రమే దానిపైకి మనసలు లాగుతుంది. సంగీతం వినడం, వీడియోలు చూడటం, పనిని కొనసాగించడం లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం చేయాలి. నిజానికి మిమ్మల్ని మీరు చాలా బిజీగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మీరు ఈ కోరిక నుంచి బయటపడతారు. లేదు పాన్ షాపు వెళ్దాం అనుకుంటే మీరు ఈ అలవాటు అస్సలు మానేయలేరు. ధూమపానం మానేసేందుకు మీ చుట్టు ఉన్న పరిస్థితులు కూడా కారణమవుతాయి. మీ కుటుంబం, సహోద్యోగులు, సలహాదారుల నుండి మద్దతు అవసరం. వైద్యుడి నుండి సకాలంలో, తగిన వైద్య సంరక్షణ అవసరం. ధూమపానం మానేస్తే.. ఎంత సమయానికి ఏం అవుతుందో చూద్దాం..
20 నిమిషాలు : రక్తపోటు, హృదయ స్పందన రేటు స్థిరీకరించబడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
8 గంటలు : రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సగానికి తగ్గుతాయి. ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్థాయి. గుండెపోటు ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుంది.
12 గంటలు : రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి.
24 గంటలు : కార్బన్ మోనాక్సైడ్ పూర్తిగా కరిగిపోతుంది. దగ్గు ద్వారా గొంతులో నుంచి కొన్ని వెళ్లిపోతాయి.
72 గంటలు : ఊపిరితిత్తులు ఇప్పుడు మరింత గాలిని పంపడం ప్రారంభిస్తాయి. శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది.
1 నుండి 2 వారాలు : ఊపిరితిత్తుల పనితీరు, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
1 నెల మానేస్తే : మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. చర్మాన్ని పోషిస్తుంది, ముడతలు రాకుండా చేస్తుంది.
1 సంవత్సరం : ధూమపానం చేసేవారితో పోలిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం సగానికి తగ్గిపోతుంది.
15 సంవత్సరాలు : గుండెపోటు వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారితో సమానంగా ఉంటుంది.
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం చేయడం మానేస్తేనే మంచిది. కొన్ని రోజులు మానేస్తేనే మీ శరీరం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కానీ ధూమపానం మానేయడం అంత సులభం కాదు. ఈ చెడు అలవాటును మీరు మరిచిపోవాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి. ట్రై చేస్తే ఏదైనా సాధ్యమే.. వద్దు అనుకుంటే ఆపేయెుచ్చు.