ఫ్యాటీ లివర్ సమస్య... ఆల్కహాల్ తాగే వారికి మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఆల్కహాల్ అలవాటు లేని వారికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఫ్యాటీ లివర్‌ను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అని పిలుస్తారు. అదే మద్యం తాగిన వాళ్లకి వస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. కొన్ని రకాల లక్షణాల ద్వారా కాలేయం కొవ్వు పేరుకుపోయిందో లేదో తెలుసుకోవచ్చు.
ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాలేయంలో కొవ్వు పేరుకుపోతే కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. కానీ వాటిని చాలామంది విస్మరిస్తారు. చివరకు కాలేయం కుళ్ళిపోయే వరకు అలానే ఉంటారు. కాబట్టి ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు చేతిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది పామర్ ఎరిథేమా. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలలో ఒకటి. అరచేతులు అసాధారణంగా ఎర్రగా కనిపిస్తాయి. బొటనవేలు, చిటికెన వేలు మొదలు దగ్గర ఎక్కువగా ఎరుపుదనం ఉంటుంది.
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు చేతులతో సహా శరీరంలోని కొన్ని భాగాలలో దురద పెడుతుంది. జీర్ణక్రియలో పోషకాలు, కొవ్వుల శోషణకు కారణమయ్యే పిత్తంలో లవణాలు రక్త ప్రవాహంలో చేరిపోతాయి. దానివల్ల ఇలా చర్మం పై దురద వస్తుంది. ఇది కూడా కాలేయంలో కొవ్వు పేరుకు పోయిందని చెప్పే లక్షణమే.
కాలేయంలో పోషకాలు సరిగ్గా గ్రహించవు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అప్పుడు చేతులపై ఉండే చర్మం సున్నితంగా మారుతుంది. ఆ చర్మానికి చిన్న దెబ్బ తగిలిన గాయం ఏర్పడుతుంది. పగుళ్లు, పొడిబారే సమస్య కూడా పెరుగుతుంది.
ఫ్యాటీలివర్ ఉన్న వారిలో చేతి వేళ్లపైన భాగం ఉబ్బెత్తుగా, గుండ్రంగా మారిపోతుంది. దీన్ని క్లబ్బింగ్ అంటారు. ఈ లక్షణం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల వస్తుంది. అలాగే సిర్రోసిస్, లివర్ ఫైబ్రోసిస్ వంటి తీవ్ర సమస్యలను కూడా ఇది సూచిస్తుంది. కాబట్టి మీ చేతులు, చేతి వేళ్ళల్లో ఎలాంటి అసాధారణమైన వాపు, ఎరుపుదనం, దురద వంటివి కనిపిస్తే ఆలస్యం చేయకుండా మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)