ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీరు రాంగ్ సైజ్ బ్రా వేసుకుంటున్నారని అర్థం, టైట్ బ్రా వల్ల నష్టాలివిగో-if you see these 4 symptoms it means you are wearing the wrong size bra problems caused by a tight bra ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీరు రాంగ్ సైజ్ బ్రా వేసుకుంటున్నారని అర్థం, టైట్ బ్రా వల్ల నష్టాలివిగో

ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీరు రాంగ్ సైజ్ బ్రా వేసుకుంటున్నారని అర్థం, టైట్ బ్రా వల్ల నష్టాలివిగో

Haritha Chappa HT Telugu

టైట్ బ్రా ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ చాలా సార్లు మహిళలు తమ బ్రా సైజు తెలియక టైట్ బ్రా వేసుకుంటారు. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తే వెంటనే మీ బ్రా సైజును మార్చుకోండి.

రాంగ్ సైజ్ బ్రాతో ఇబ్బందులు (Shutterstock)

బ్రా ధరించడం ప్రతి మహిళకు ఎంతో ముఖ్యం. శరీరానికి అందమైన షేప్ ఇచ్చేందుకు బ్రా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రొమ్ములకు మద్దతు ఇవ్వడానికి ఇవి ఎంతో అవసరం. వాటి ఆకారాన్ని అందంగా కనిపించేందుకు కూడా సహాయపడుతుంది.

సరైన ఫిట్టింగ్ ఉన్న బ్రా ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, ఏ పని చేయడానికైనా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ బ్రా మరీ బిగుతుగా ఉన్నప్పుడు, అది హాని కలిగిస్తుంది. తరచుగా మహిళలు తమ బ్రా సైజు తెలియకుండా ధరిస్తారు. కానీ సరైన పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు. దీని ప్రభావం క్రమంగా శరీరంపై పడుతుంది. టైట్ బ్రా ధరించడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో, అలాగే దాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారమేమిటో తెలుసుకుందాం.

రాంగ్ సైజ్ బ్రా వల్ల కనిపించే మార్పులు

1. చర్మంపై మచ్చలు

మహిళలు టైట్ బ్రా ధరించడం వల్ల చర్మంపై మచ్చలు, చికాకు లేదా దద్దుర్లు ఏర్పడతాయి. మీరు బ్రా పట్టీలు లేదా అండర్ బస్ట్ ప్రాంతంలో ఎరుపు లేదా నలుపు గుర్తులను చూసినట్లయితే, మీ బ్రా చాలా బిగుతుగా ఉందని అర్థం. వాస్తవానికి, బిగుతు పట్టీల బ్రాను నిరంతరం ధరించినప్పుడు అది చర్మపు చికాకు, దురద లేదా దద్దుర్లు కలిగిస్తుంది. ఇలా మీకు అనిపిస్తే వెంటనే బ్రా వెంటనే మార్చండి. కాస్త వదులుగా ఉండే బ్రా వాడడం మంచిది.

2. శ్వాస సమస్యలు

బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల ఛాతీ దగ్గర భారంగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. బ్రా చాలా బిగుతుగా ఉన్నప్పుడు, ఇది పక్కటెముకలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. బ్రా తొలగించిన తర్వాత మీకు హాయిగా అనిపిస్తే, మీ బ్రా చాలా బిగుతుగా ఉందని సంకేతం.

3. వీపు, భుజాల నొప్పులు

చాలాసార్లు మహిళల వీపు, భుజాల నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పి ఎందుకు సంభవిస్తుందో చాలా మంది అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు టైట్ బ్రా ధరించడం వల్ల కూడా వెన్ను, భుజం నొప్పి వస్తుంది. నిజానికి బ్రా మరీ బిగుతుగా ఉన్నప్పుడు శరీర సమతుల్యత దెబ్బతిని వీపు, మెడ, భుజాల్లో నొప్పి వస్తుంది. ఈ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుంది.

4. రొమ్ము ఆకారంలో మార్పులు

బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల రొమ్ము ఆకారంలో మార్పులు రావచ్చు. ఇది కాకుండా రొమ్ములో గడ్డ వంటి సమస్య కూడా ఉండవచ్చు. వాస్తవానికి, చాలా టైట్ బ్రా కారణంగా రొమ్ముపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. దీని వల్ల దాని ఆకారం మారుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే, రొమ్ములో గడ్డలు కూడా ఉండవచ్చు. ఇది పెద్ద అనారోగ్యానికి కారణమవుతుంది.

బ్రా కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు

బ్రా కొనేటపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకు, మీరు బ్రా కొనడానికి వెళ్లినప్పుడల్లా, టైట్ ఫిట్టింగ్ బ్రా కొనడానికి ప్రయత్నించకండి. ఎల్లప్పుడూ వెడల్పాటి పట్టీలు, మృదువైన ప్యాడింగ్ ఉన్న బ్రాను ఎంచుకోండి. పట్టీల పొడవును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అవసరమైతే వాటిని సర్దుబాటు చేయండి. కాటన్ ఫ్యాబ్రిక్ తో కూడిన బ్రాను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా గాలి సౌకర్యవంతంగా తగులుతుంది. ప్రతి 6 నెలలకోసారి మీ బ్రా సైజును చెక్ చేసుకోండి. మీ శరీర పరిమాణాన్ని బట్టి కప్పు పరిమాణం, బ్రా శైలిని ఎంచుకోండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.