Night Drink: చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలల్లో ఈ పదార్థాన్ని కలుపుకుని తాగితే ఆ సమస్యలన్నీ దూరం
Night Drink: రాత్రి పడుకునే ముందు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ పాలల్లో బెల్లం కూడా కలుపుకుంటే పాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
పిల్లలైనా, పెద్దవారైనా రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగితే ఎంతో ఆరోగ్యం. పాలు మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తాయి. పాలు చిన్నప్పటి నుండి మన ఆహారంలో భాగంగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు వేడి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా చెప్పారు. వేడి పాలలో బెల్లం కలిపి తాగితే ఎంతో మంచిది. ఇది పాల రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రాత్రిపూట పాలు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
పాలు బెల్లం కలిపి
ఎంతోమందికి చలికాలంలో పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మందకొడిగా సాగడం, గ్యాస్ సమస్య, అజీర్ణం, ఉబ్బరం, కడుపులో మలబద్ధకం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి పాలు జీర్ణం కావడం చాలా కష్టం. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే పాలల్లో బెల్లం కలిపిన ప్రతిరోజూ తాగేందుకు ప్రయత్నించండి. బెల్లం పాలు పొట్టను శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎముకల నొప్పి
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బెల్లం పాలతో కలిపి తీసుకుంటే ఉపయోగాలు మరింత పెరుగుతాయి. బెల్లంలో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. చలికాలంలో ఎముకల నొప్పులతో మీరు బాధపడుతుంటే ప్రతి రాత్రి బెల్లం పాలను తాగేందుకు ప్రయత్నించండి.
ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాంటప్పుడు పాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిజానికి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తం ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుతుంది.
బెల్లం కలిపిన పాలు మీకు హెల్త్ టానిక్ లా పనిచేస్తుంది. మన శరీరంలో కొల్లాజెన్ పెంచడానికి బెల్లం పాలు ఉపయోగపడతాయి. వీటిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, తేమగా ఉంచడానికి పనిచేస్తాయి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం తేలికపాటి ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆధునిక కాలంలో పని ఒత్తిడి, పోటీ వాతావరణం పెరిగిపోయింది. ఆ ఒత్తిడి కారణంగా రాత్రి పడుకున్న తర్వాత గంటల తరబడి నిద్రపట్టదు. అలాంటి వారు ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో బెల్లం కలిపి తాగేందుకు ప్రయత్నించండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఈ డ్రింకును అద్బుతమైన ఔషధంగా చెప్పుకోవాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)