పల్లీ చట్నీని ఇలా చేశారంటే అన్ని టిఫిన్లలోకి ఇదే కావాలంటారు, ఇదిగోండి ఈజీ రెసిపీ-if you make palli chutney like this youll want it in all your tiffins heres the easy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పల్లీ చట్నీని ఇలా చేశారంటే అన్ని టిఫిన్లలోకి ఇదే కావాలంటారు, ఇదిగోండి ఈజీ రెసిపీ

పల్లీ చట్నీని ఇలా చేశారంటే అన్ని టిఫిన్లలోకి ఇదే కావాలంటారు, ఇదిగోండి ఈజీ రెసిపీ

Ramya Sri Marka HT Telugu

పల్లీ చట్నీ అందరూ చేస్తారు. కానీ రుచిగా రావాలంటే ప్రతి ఒక్కరికీ చిన్న చిన్న చిట్కాలుంటాయి. మీరు కూడా పల్లీ చట్నీని ఎప్పటిలాగా కాకుండా ప్రత్యేకంగా చేయాలనుకుంటే ఈ టమాటో పల్లీ చట్నీ రెసిపీ మీ కోసమే. ఈజీగా చేసే ఈ చట్నీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది.

టమాటో పల్లీ చట్నీ

ఉదయాన్నే ఇడ్లీ, దోస, వడ వంటి వాటిల్లోకి పల్లీ చట్నీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే రోజూ ఒకేలా తయారు చేసుకుంటే ఇది బోర్ కొట్టేస్తుంది. అందుకే అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడంలో తప్పేం లేదు అనుకునే వారికి కోసమే ఈ టమాటో పల్లీ చట్నీ. ఈ రెసిపీతో ట్రై చేశారంటే రోజూ ఇదే కావాలని అడుగుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతిఒక్కరికీ ఈ టమాటో పల్లీ చట్నీ చాలా బాగా నచ్చుతుంది. అన్ని రకాల టిఫిన్లకు ఇది బాగా సెట్ అవుతుంది.

టమాటో పల్లీ చట్నీ తయారు చేయడానికి కావాలసిన పదార్థాలు:

  • పల్లీలు - రెండు కప్పులు
  • నూనె- రెండు టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిరపకాయలు- నాలుగు లేదా అయిదు
  • టమాటాలు - రెండు
  • ఉప్పు- రుచికి తగినంత
  • చింతపండు- అర చెక్క నిమ్మకాయ అంత
  • బెల్లం - చిన్న ముక్క(ఇంచు)
  • తాళింపు కోసం
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • ఆవాలు- పావు టీ స్పూన్
  • శనగపప్పు- అర టీ స్పూన్
  • ఎండు మిరపకాయలు- రెండు లేదా మూడు
  • కరివేపాకు- రెండు రెబ్బలు

టమాటో పల్లీ చట్నీ తయారు చేసే విధానం:

  1. టమాటో పల్లీ చట్నీ తయారు చేయడం కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో పల్లీలు వేసి దోరగా వేయించండి.
  2. పల్లీలను వేయించే సమయంలో ఎప్పుడూ మంటను మీడియం ఫ్లేంలో మాత్రమే ఉంచాలి. లేదంటే అవి బయటికి మాడిపోయి లోపల ఉడకవు.
  3. వేయించిన పల్లీలను ఒక బౌల్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.(వేయించిన పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు నేరుగా ఉపయోగించుకోవచ్చు)
  4. ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసుకుని వేడి చేయండి.
  5. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేయండి.(మిరపకాయలు నూనెలో వేసేటప్పుడు నేరుగా వేసేయకండి చిటచిట పడిలాడి ముఖం మీదకు వచ్చే ప్రమాదముంది. వీటిని సగం ముక్కలుగా విరిచి నూనెలో వేయండి)
  6. ఇవి కాస్త వేగిన వెంటనే దాంట్లో కట్ చేసుకున్న టమాటో మక్కలను వేయండి.
  7. టమాటో ముక్కలు నూనెలో వేగుతున్న సమయంలో దీంట్లో గళ్ల ఉప్పు లేదా సన్న ఉప్పును మీరుచికి తగినంత వేసుకోండి.
  8. తరువాత ఇందులోనే సగం నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి వేయండి.
  9. ఇప్పుడు దీంట్లోనే ఒక ఇంచు వరకూ బెల్లం ముక్కను తీసుకుని వేయండి.
  10. అన్నీ దోరగా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చల్లారనివ్వండి.
  11. కాసేపటి తర్వాత వేయించిన పల్లీలు, టమాటో పచ్చిమిర్చీ అన్నీ బాగా చల్లారిన తర్వాత వీటన్నింటనీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  12. పేస్టు తయారైన తర్వాత ఉప్పు చూసి మీ రుచికి తగ్గట్టుగా ఇంకాస్త కావాలంటే వేసుకోండి.
  13. ఇప్పుడు తాళింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె పొసి వేడి చేయండి.
  14. నూనె కాస్త వేడెక్కిన వెంటనే దాంట్లో జీలకర్ర, ఆవాలు వేయండి.
  15. ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో మీకు కావాలంటే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప పప్పును కూడా వేసి వేయించండి.
  16. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లొనే ముక్కలుగా చేసుకున్న ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలపండి.
  17. కరివేపాకు కూడా నూనెలో చక్కగా వేగిన తర్వాత ఈ తాళింపు మిశ్రమాన్ని తీసుకెళ్లి పల్లీ టమాటోల పేస్టులోకి వేసి బాగా కలపండి.

అంతే రోజూలా కాకుండా కొత్త రుచితో మిమ్మల్ని ఆకట్టుకునే టమాటో పల్లీ చట్నీ రెడీ అయినట్టే. దీన్ని రుచి చూశారంటే రోజూ ఇదే చట్నీ చేసుకోవాలని ఆశ పడతారు. రెసిపీ సింపుల్‌గా ఉంది కదా. కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ట్రే చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇవాళ చట్నీ బాగుంది అనే మాట అందరూ అనేలా చేస్తుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం