Kanchipatthu Saree: కంచి పట్టుచీర చరిత్ర తెలిస్తే అది ఎందుకంత ఖరీదో మీకే అర్థమవుతుంది
Kanchipatthu Saree: పెళ్లిళ్లు వచ్చాయంటే కంచి పట్టుచీర ఉండాల్సిందే. బంగారు, వెండి తీగలతో కూడా కంచి పట్టుచీరలను నేస్తారు.ఈ చీర చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Kanchipatthu Saree: కంచి పట్టుచీరని ‘కంజీవరం చీర’ అని కూడా పిలుస్తారు. ఈ చీరలు తమిళనాడులోని కాంచీపురంలో తయారవుతాయి. అక్కడే ప్రత్యేకంగా వీటిని నేస్తారు. భారతీయత అంటేనే చీర. ఇక ఆ చీరలో ప్రధానమైనది కంచిపట్టు చీర. పట్టుపురుగుల నుంచి తీసిన పట్టు దారాలతో బంగారు, వెండి జరీలను కలిపి చీరలను నేస్తారు. పట్టుచీరంటే కాంచీపురమే గుర్తుకొచ్చేంతగా ఇప్పుడు ఫేమస్ అయ్యాయి ఈ చీరలు.
కంచిపట్టు చీర చాలా తేలిక
కంచి పట్టు చీరలు ఎంత ఖరీదైనవైనా కూడా పెద్దగా బరువు ఉండవు. ఎనిమిది వందల గ్రాముల నుంచి కిలో వరకు మాత్రమే ఉంటాయి. ఈ కంచి పట్టుల చీరల చరిత్ర ఈనాటిది కాదు, వాటి వెనుక ఎన్నో వేల చరిత్ర ఉంది. హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం కంచిపట్టు చీర నేసే చేనేతకారులు మార్కాండ మహాముని సంతతికి చెందినవారు అంటారు. మార్కాండ మహాముని పూర్వం దేవతలకు వస్త్రాలను నేసి ఇచ్చే వారని చెబుతారు. కమలం పూల నుంచి సేకరించిన దారాలతో దేవతలకు వస్త్రాలను తయారు చేసేవారని అంటారు. ఆ వస్త్రాలు అంటే శివవిష్ణువులకు ఎంతో ఇష్టమని చెబుతారు. ఆ మార్కాండ మహాముని సంతతికి చెందినవారే ఇప్పుడు కాంచీపురంలో చీరలు నేస్తున్న నేతకారులని అంటారు.
శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలంలోనూ కాంచీపురం చీరలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.ఆ కాలంలోని చేనేతకారులకు పట్టు చీరలు నేయడమే ప్రధాన వృత్తిగా ఉండేది. ఈ చీరలను పరిశుభ్రమైన మల్బరీ పట్టు దారాలతో నేస్తారు. ఈ మల్బరీ పట్టును ప్రత్యేకంగా తెప్పిస్తారు. కర్ణాటక నుండి అధికంగా ఈ శుద్ధమైన మల్బరీ పట్టు కాంచీపురానికి వస్తుంది. ఇక జరీని గుజరాత్ రాష్ట్రం నుంచి ఇక్కడికి తెప్పించుకుంటారు. చీర నేయడం కాంచీపురంలోనే చేస్తారు. ఈ కంచిపట్టు చీర నేయడానికి ఒక నేత పనివాడు, ఒక షటిల్ పనిచేస్తుంది. ఒకవైపు నేత పనివాడు పనిచేస్తూ ఉంటే... మరోవైపు షటిల్ వేగంగా దారాలను అల్లుతుంది.
కంచి పట్టు చీరలకు జియోగ్రాఫికల్ ఇండెక్స్ కూడా వచ్చింది. ఈ గుర్తింపు దానికి 2005లోనే వచ్చింది. అందుకే అంతర్జాతీయంగా కంచిపట్టు చీరలకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఖరీదు కూడా పెరిగాయి.
కంచి పట్టుచీరలపై కళాత్మకమైన డిజైన్లను నేస్తారు. చిలుకలు, హంసలు, మామిడి పండ్లు, ఆకులు, నెమళ్లు, రథాలు ముఖ్యంగా కనిపిస్తాయి. కాంచీపురం చీరలను ఎంతోమంది సెలబ్రిటీలు బంగారు దారాలతో వేయించుకుంటారు. నీతా అంబానీ అధికంగా ఇలా కాంచీపురం పట్టు చీరలను బంగారు దారాలతో నేయించుకుని ధరిస్తారు.
మరొక కథనం ప్రకారం కంచి పట్టు చీరల అధికంగా అమ్ముడైంది చోళ సామ్రాజ్య పాలనలో అని అంటారు. చోళులు 17వ శతాబ్దంలో కాంచీపురాన్ని పాలించారు. ఇక్కడకు ఆంధ్రప్రదేశ్ నుంచే చేనేత కార్మికులు వచ్చి స్థిరపడ్డారని అంటారు.
టాపిక్