Finland: ఫిన్లాండ్‌లోని ప్రజలు ఎందుకంత సంతోషంగా ఉంటారో తెలిస్తే మీరు కూడా ఆ దేశానికి వెళ్లిపోవాలనుకుంటారు-if you know how happy people are in finland you will want to go there too ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  If You Know How Happy People Are In Finland, You Will Want To Go There Too

Finland: ఫిన్లాండ్‌లోని ప్రజలు ఎందుకంత సంతోషంగా ఉంటారో తెలిస్తే మీరు కూడా ఆ దేశానికి వెళ్లిపోవాలనుకుంటారు

Haritha Chappa HT Telugu
Mar 21, 2024 06:40 PM IST

Finland: ప్రపంచ హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో మళ్లీ ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్లోని ప్రజలు ఎందుకంత సంతోషంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు తెలిస్తే మీరు కూడా ఫిన్లాండ్ వెళ్లాలని కోరుకుంటారు.

ఫిన్లాండ్ దేశం
ఫిన్లాండ్ దేశం

Finland: ఒకసారి కాదు, రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు వరుసగా ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో తొలి స్థానంలో నిలిచింది. మార్చి 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఏ దేశంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారో ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో 143 దేశాలు ప్రజల మనోభావాలను తెలుసుకుంది. ఒకటో స్థానంలో నిలిచింది ఫిన్లాండ్. గత ఏడేళ్లుగా ఫిన్లాండ్ అదే స్థానంలో కొనసాగుతుంది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది. గతేడాది కూడా భారత్ అదే స్థానంలో ఉంది.

ఎలా ఎంపిక చేస్తారు?

ఈ నివేదికను ప్రజలు ఎంత సంతృప్తిగా జీవిస్తున్నారు? వారు తలసరి జిడిపి ఎంత? వారి జీవన కాలం ఎంత ఉంది? స్వేచ్ఛ, అవినీతి, సామాజిక జీవితం వీటన్నింటి ఆధారంగా రూపొందిస్తారు. ఫిన్లాండ్లోని ప్రజలు తాము అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నట్టు గత ఏడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. దానివల్లే ఆ దేశం మొదటి స్థానంలో నిలుస్తోంది. ఫిన్లాండ్ ... స్వీడన్, నార్వే, రష్యా దేశాల మధ్యలో ఉన్న చిన్న దేశం. ఈ దేశంలో కేవలం 55 లక్షల మంది ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు.

తక్కువ పనిగంటలు

ఇలాంటి దేశంలో తక్కువ పనిగంటలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ జీవితానికి విలువివ్వమని ఉద్యోగులకు సంస్థలు కూడా చెబుతాయి. అలాగే కుటుంబం కోసం ఎన్ని సెలవులు అయినా ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వస్తాయి. అవసరమైతే ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచే పని చేసుకోమని అవకాశం ఇస్తాయి. ఫిన్లాండ్ లోని ప్రభుత్వం, ఉద్యోగ సంస్థలు కూడా కుటుంబం, వ్యక్తిగత ఆరోగ్యం, విశ్రాంతికి ప్రాధాన్యతను ఇస్తాయి. దీనివల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యంగా నివసిస్తున్నారు.

ఉచిత విద్య

ఫిన్లాండ్లో ప్రీస్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు విద్య పూర్తిగా ఉచితం. డబ్బున్న వాళ్ళయినా, పేదవాళ్లయినా ఒకే స్కూల్లో చదువుకోవచ్చు. ఎవరూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. విద్యావ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. నాణ్యమైన విద్యను అందిస్తుంది.

స్త్రీలకు సమాన అవకాశాలు

ఫిన్లాండ్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తుంది. స్త్రీ సాధికారతను ప్రోత్సహిస్తుంది. చాలా రంగాల్లో స్త్రీ, పురుషులను సమానంగా చూస్తారు. లింగ బేధం అక్కడ ఉండదు. స్త్రీ పురుషులకు సమానంగా అవకాశాలను ఇస్తారు.

ఆరోగ్యం

ఫిన్లాండ్లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఫిన్నిష్ సంస్కృతిలో ఆవిరి స్నానాలు చాలా ముఖ్యం. దేశంలో మూడు మిలియన్లకు పైగా ఆవిరి స్నానాల గదులు ఉన్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి ఈ ఆవిరి గదులను వినియోగించుకుంటారు. ఎవరికైనా ఒత్తిడిగా అనిపించినా... వెళ్లి ఆవిరి గదిలో సేద తీరుతారు.

అవినీతి

ఫిన్లాండ్ దేశంలో అత్యల్ప స్థాయిలో అవినీతి ఉంది. అక్కడ ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై నమ్మకం ఎక్కువ. ప్రభుత్వం... ప్రజలకు న్యాయమైన విద్య, వైద్యం, చట్టాలను అందిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక పాలన.. అన్నవి ఫిన్లాండ్ ప్రభుత్వంలో ఎక్కువ.

సమాజ జీవితం

ఫినిష్ సమాజం సామూహిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తాయి. ఫినిష్ ప్రజలు ఎవరింట్లో వారు స్వార్ధంగా జీవించడాన్ని ఇష్టపడరు. తమకున్నది లేనివారికి ఇచ్చేందుకు ముందుకు వెళతారు. సంఘంగా, సమానత్వంగా జీవించేందుకు ఇష్టపడతారు.

ఫిన్లాండ్లో ఆరోగ్య సంరక్షణకు మొదటి స్థానం ఉంది. పౌరులందరికీ సమానమైన వైద్య సేవలను అందిస్తారు. ఆరోగ్య సంరక్షణలో పేద, ధనిక అనే తేడా ఉండదు. అందుకే ఫిన్లాండ్లోని ప్రజలు చాలా ఆనందంగా ఎక్కువ కాలం పాటు జీవిస్తారు.

WhatsApp channel

టాపిక్