Gobi rice: అన్నం మిగిలిపోతే ఇలా టేస్టీగా గోబీ రైస్ చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది-if you have leftover rice make this tasty gobi rice know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gobi Rice: అన్నం మిగిలిపోతే ఇలా టేస్టీగా గోబీ రైస్ చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది

Gobi rice: అన్నం మిగిలిపోతే ఇలా టేస్టీగా గోబీ రైస్ చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 27, 2024 11:30 AM IST

Gobi rice: అన్నం మిగిలిపోయినప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా వేడివేడిగా గోబీ రైస్ చేసుకొని తినండి. దీని రుచి అందరికీ నచ్చుతుంది. రెసిపీ కూడా చాలా సులువు.

గోబీ రైస్ రెసిపీ
గోబీ రైస్ రెసిపీ

కాలీఫ్లవర్‌లు చలికాలంలోనే అధికంగా దొరుకుతాయి. వీటిని శీతాకాలం సీజనల్ వెజిటబుల్‌గా చెప్పుకుంటారు. కాలీఫ్లవర్ తో చేసే ఒక టేస్టీ వంటకం గోబీ రైస్. దీన్ని ఎక్కువగా ఆర్డర్ పెట్టి రెస్టారెంట్ల నుంచి తెప్పించుకుంటారు. అంత అవసరం లేకుండా ఇంట్లోనే ఈ గోబీ రైస్ ను టేస్టీగా వండుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా గోబీ రైస్ చేసుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా బాస్మతి రైస్ ను అన్నంలో వండుకొని వాటితో కూడా గోబీ రైస్ చేయొచ్చు. ఎలా చేసినా రైస్ అదిరిపోతుంది. గోబీ రైస్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

yearly horoscope entry point

గోబీ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

కాలీఫ్లవర్ ముక్కలు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

గరం మసాలా - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

మైదా - పావు కప్పు

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు

పెరుగు - రెండు స్పూన్లు

నీళ్లు - తగినంత

పచ్చిమిర్చి - మూడు

కరివేపాకులు - గుప్పెడు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

క్యారెట్ - ఒకటి

క్యాబేజీ తరుగు - మూడు స్పూన్లు

క్యాప్సికం తరుగు - మూడు స్పూన్లు

సోయాసాస్ - ఒక స్పూను

వెనిగర్ - అర స్పూను

గోబీ రైస్ రెసిపీ

1. గోబీ రైస్ చేసేందుకు ముందుగా తెల్ల అన్నాన్నివండి రెడీ చేసుకోవాలి.

2. అది పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చు.

3. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను ఒకే సైజులో వచ్చేటట్టు కోసుకోవాలి. పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

4. ఆ గిన్నెలో ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, మైదా, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.

5. రెండు స్పూన్ల వాటర్ కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. డీప్ ఫ్రై చేయడానికి ఎంత అవసరమో అంత నూనె వేసుకోవాలి.

8. నూనె వేడెక్కాక ఈ కాలిఫ్లవర్ ముక్కలను విడివిడిగా వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టాలి. అందులో రెండు స్పూన్ల నూనె వేయాలి.

10. ఆ నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

11. తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్లు, క్యాబేజీ, క్యాప్సికం వేసి వేయించాలి.

12. అవి వేగాక వేయించి పక్కన పెట్టుకున్నా కాలీఫ్లవర్ ముక్కలను వేసి వేయించుకోవాలి.

13. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి.

14. మంట చిన్నగా ఉండేలా చూసుకోవాలి.

15. ఇప్పుడు పైన పావు స్పూను మిరియాల పొడి, పావు స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి.

16. ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి.

17. అలాగే సోయాసాస్, వెనిగర్ వేసి అన్నం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.

18. చివర్లో పైన కొత్తిమీర తరుగును చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ గోబీ రైస్ రెడీ అయినట్టే.

ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు ఎంతో ఇష్టంగా తింటారు. రెస్టారెంట్లో చేసిన దానికన్నా ఇది రుచిగా ఉంటుంది. పైగా ఇంట్లోనే మనం పరిశుభ్రమైన పద్ధతిలో దీన్ని చేసాము. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువే. అలాగే కాలీఫ్లవర్ ను పురుగులు లేకుండా చక్కగా ఏరుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెస్టారెంట్లలో పురుగులు ఉన్నాయా లేవా చూడకుండా వండేస్తారు. కాబట్టి గోబీ రెసిపీల విషయంలో జాగ్రత్తగా ఆర్డర్ చేసుకోవాలి.

Whats_app_banner