చెవి నొప్పి ప్రాణాంతకమైనది కాకపోవచ్చు. కానీ చాలా బాధ పెడుతుంది. ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. చెవి నొప్పి... జలుబు వల్ల లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి డాక్టర్ అందుబాటులో ఉంటారు, కానీ కొన్నిసార్లు వైద్యులు వద్దకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు చెవి నొప్పిని తగ్గించడానికి ఇక్కడ చెప్పిన పద్ధతుల్లో ఏదైనా పాటించండి.
చెవి మధ్య నుండి గొంతు వెనుక వరకు ఒక ట్యూబ్ ఉంటుంది. ఇది ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్యూబులో అడ్డంకులు ఏర్పడితే ద్రవం అధికంగా పేరుకుపోతుంది. ఇది చెవిపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. దీనికి సరైన సమయంలో చికిత్స అందించాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ గా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
జలుబు, దగ్గు అధికంగా ఉన్న వారిలో చెవి నొప్పి వస్తూ ఉంటుంది. చెవిలోకి ఏదైనా కీటకం ప్రవేశించడం వల్ల కూడా విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈత కొట్టేటప్పుడు లేదా స్నానం చేసినప్పుడు చెవిలోకి నీరు ప్రవేశించి అక్కడ ఇన్ఫెక్షన్‌కు కారణమైతే నొప్పి విపరీతంగా వస్తుంది. అలాగే చెవిలో ఉండే గులిమి ఎక్కువగా పేరుకుపోయి గట్టిగా మారిపోయినా కూడా నొప్పి వస్తుంది. కొంతమంది తలకు గాయం తగలడం వల్ల లేదా చెవిలోకి ఏదైనా వస్తువు ప్రవేశించినా కూడా చెవిపోటు వచ్చే అవకాశం ఉంది.
కర్ణభేరికి ఏదైనా గాయాలు తగిలినా కూడా చెవిపోటు విపరీతంగా వస్తుంది. పిల్లల్లో చెవి నొప్పికి సాధారణ కారణం ఓటిటిస్ మీడియా. ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ పెద్దవారు, పిల్లల్లో... ఇద్దరిలో కూడా దంతాలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది చెవి నొప్పికి కారణం అవుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ మీకు దేనివల్ల చెవి నొప్పి వస్తుందో మొదటగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
1. చెవి నొప్పి విపరీతంగా వస్తున్నప్పుడు ఆవనూనెను తీసుకోండి. వెల్లుల్లి రెబ్బను సన్నగా తురిమి ఆవనూనెలో వేసి వేడి చేయండి. ఆ నూనె చల్లారాక వడకట్టండి. చెవిలో ఈ నూనెను రెండు నుంచి మూడు చుక్కలు వేయండి. ఇది చెవి నొప్పిని కొంతవరకు తగ్గిస్తుంది.
2. ఒక చెంచా ఉల్లిపాయ రసాన్ని తీసుకొని వేడి చేయండి. ఆ ఉల్లిపాయ రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేయండి. కాస్త నొప్పి తగ్గుతుంది. ఇలా రోజులో మూడుసార్లు చేయడం వల్ల నొప్పి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
3. తులసి ఆకుల రసాన్ని చెవిలో పోయడం వల్ల కూడా చెవి నొప్పి తగ్గిపోతుంది. రెండు రోజులపాటు తరచూ తులసి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే... చెవి నొప్పి పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంది.
4. వేపాకుల రసంతో కూడా చెవి నొప్పిని తగ్గించుకోవచ్చు. వేపాకుల రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తద్వారా చెవి నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది.
5. అల్లం రసాన్ని తీసి చెవిలో రెండు మూడు చుక్కలు వేస్తే మంచిది. అల్లాన్ని రుబ్బి ఒక వస్త్రంలో వేసి గట్టిగా పిండితే కొంత అల్లం రసం వస్తుంది. రెండు మూడు అల్లం రసాన్ని ఆలివ్ నూనెలో వేసి ఆ మిశ్రమాన్ని రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తూ ఉండాలి. ఈ చిట్కా కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం