ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మీ పక్కన బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు-if you find faults in others you will have no relatives or friends by your side ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మీ పక్కన బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు

ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే మీ పక్కన బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు

Haritha Chappa HT Telugu

కొంతమంది ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు. వాటి గురించి వేరొకరితో మాట్లాడుతూ ఆనందం పొందుతారు. ఇలాంటి వ్యక్తులకు జీవితంలో నిజమైన స్నేహితులు, బంధువులు ఎవరూ మిగలరు.

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

గురువింద గింజ చూసేందుకు బయటకు ఎర్రగా కనిపిస్తుంది. కానీ దాని కిందన నలుపు మచ్చలా ఉంటుంది. ఎంతోమంది గురివింద గింజలాంటివారు ఉంటారు. తమ లోపాలను గుర్తించలేరు... కానీ ఎదుటివారిలో తప్పులను ఎంచుతూనే ఉంటారు. వారిని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు.

ఎదుటివారి తప్పులు వెతకడం పనిగా పెట్టుకుంటే మీ పక్కన ఎవరూ మిగలరు. బంధువులు, స్నేహితులు అందరూ దూరమైపోతారు. చివరికి మీరు ఒక్కరే ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది.

ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ, వారిని కించపరచడం, వేలెత్తి చూపించడమే పనిగా పెట్టుకుంటే ఎదుటివారి జీవితం కాదు... మీ జీవితమే అల్లకల్లోలంగా మారుతుంది. సుఖసంతోషాలు అనేవి దూరమైపోతాయి. ఒక్క వేలితో మీరు పక్క వాడిని చూపిస్తే... మిగతా వేళ్లు మీ వైపే చూపిస్తాయని తెలుసుకోండి. ఆ తర్వాతే ఎదుటివారిని నిందించడం ప్రారంభించండి.

నిందించడమే పనిగా పెట్టుకున్న వారికి జీవితంలో పక్కన ఎవరి తోడు ఉండరు. ఆప్యాయతతో ఆదరించే వాళ్ళు, పలకరించే వారు కూడా ఉండరు. ప్రతి మనిషిలోనూ ఎన్నో తప్పులు ఉండవచ్చు. వాటిని సరిదిద్దడం మీ పని కాదు... ముందుగా మీ తప్పులను, మీ లోపాలను సరిదిద్దుకోండి. బయట ప్రపంచాన్ని బట్టి ప్రేమించడం నేర్చుకోండి. పక్కవారితో సంతోషంగా కలిసి జీవించడం మొదలు పెట్టండి. అప్పుడే అసలైన జీవితం ఏంటో తెలుస్తుంది.

మీరు జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎదుటివారికి ఏది ఇస్తారో... అదే మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మీరు ఎదుటివారిని అవమానిస్తే తిరిగి అదే అవమానం మీకు జరుగుతుంది.

ఎదుటివారిలోని లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే అలాంటి వారిని విషపూరితమైన వ్యక్తులుగా చెప్పుకుంటారు. వారు తమ స్వలాభం కోసమే ఆలోచిస్తారు. దురుద్దేశంతోనే ఎదుటివారిని అఘాతంలోకి నెట్టాలని చూస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని ఎంతోమంది భావిస్తారు. అందుకే అలాంటి వారు ఎప్పటికైనా ఒంటరిగా మిగిలిపోతారు. తప్పులు నెత్తి చూపెడితేనే వారికి ఆనందం కలుగుతుంది.

ఇతరుల విశ్వాసాన్ని నాశనం చేసి... ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్న వారు ప్రశాంతంగా జీవించలేరు. అలాంటి వారితో కలిసి ఉండడం ప్రమాదకరం. అందుకే అలాంటి వారికి స్నేహితులు, బంధువులు ఎవరూ ఉండరు. చివరికి ఒంటరిగా మారిపోతారు. ఇలాంటి లక్షణాలు మీలోనే ఉంటే వెంటనే మార్చుకోండి. లేకపోతే జీవితంలో ఎదురు దెబ్బలు చాలా తినాల్సి వస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.