Love At Office: ఓరి దేవుడా! కొలీగ్‌తో ప్రేమలో పడితే జాబ్ పోతుందా? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
Love At Office: ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమ పుట్టచ్చు. కానీ మీకు నచ్చిన వ్యక్తి మీ ఆఫీసులోనే ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు లేదా మీ భాగస్వామి చేసే ఒక చిన్న తప్పు మీ ఇద్దరి ఉద్యోగాలపైనా ప్రభావం చూపవచ్చు. ఆఫీసులో ప్రేమ వ్యవహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
మీ కలల రాకుమారుడు లేదా రాకుమారి దొరికారా? మీ ఆఫీసులో పనిచేసే వ్యక్తితోనే మీరు ప్రేమలో పడ్డారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసుకు నచ్చిన వ్యక్తి మీ ఆఫీసులోనే మీతో పాటే ఉండటం, వారితో మీరు ప్రేమలో పడటం సహజమే. కానీ ఇది కొంత ప్రమాదకరమనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వారు ప్రేమలో పడటం వల్ల వారి కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఆఫీసులో ప్రేమాయణం అనేది చేసే పని మీద కెరీర్ ను ప్రభావితం చేస్తుంది.
కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేయడానికి అనుమతి ఉండదు. చాలా ఆఫీసుల్లో ప్రేమ వ్యవహారాలను, ఇతర సంబంధాలను వ్యతిరేకిస్తారు. ఇలాంటి వ్యవహారాల వల్ల వ్యక్తుల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా వారి వారి పనితీరు దెబ్బతిన్నప్పుడు. మీరు కూడా నిజంగా మీ ఆఫీసులో వ్యక్తితోనే ప్రేమలో పడితే మీ ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలంటే, మీ ప్రేమ మీ కెరీర్ పై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
1.కంపెనీ పాలసీ తెలుసుకోండి
ప్రతి ఆఫీసుకు దాని స్వంత నియమాలు ఉంటాయి. కంపెనీలో చేరినప్పుడే ఆ నియమాల గురించి మీకు తెలియజేస్తారు. అయినప్పటికీ, మీకు ఎవరైనా నచ్చితే, ముందుకు వెళ్లే ముందు కంపెనీ పాలసీని మళ్ళీ ఒకసారి చూసుకోండి. కొన్ని చోట్ల ఇలాంటి విషయాల్లో HR కి తెలియజేయాలని కూడా చెబుతారు. కంపెనీ నియమాలను పాటించండి. కెరీర్ మీకు ముఖ్యం అనిపిస్తే ఆలోచించి, ఆలోచించి ముందుకు వెళ్లండి. మీ కంపెనీ దీనికి అనుమతి ఇవ్వకపోతే, మీ సంబంధం నిజంగా ముఖ్యమైనది అయితే వేరే కంపెనీలోకి మారే ప్రయత్నం చేయండి.
2. ప్రొఫెషనల్ గా ఉండండి
కంపెనీ మీకు పని చేయడానికి డబ్బు ఇస్తుందని గుర్తుంచుకోండి, కాబట్టి మీ ప్రియుడి/ప్రియురాలి ముందు కూడా మీ ప్రొఫెషనలిజాన్ని తగ్గించవద్దు. పర్సనల్ గా మీరు ఎంత ప్రేమించే వ్యక్తులైనా సరే ఆఫీసులో పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉండండి. పని నాణ్యతను తగ్గనివ్వవద్దు. మీ భాగస్వామి నుండి ఏదైనా తప్పు జరిగితే, దాన్ని దాచడానికి లేదా ఆ తప్పును మీపై తీసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఇది ఇద్దరి ఉద్యోగాలను దెబ్బతిస్తుంది.
3. జాగ్రత్తగా ఉండండి
కొన్నిసార్లు మన ముందు జరిగేది లేదా మనకు అనిపించేది ఒక భ్రమ కావచ్చు. ఆఫీసులో ఎవరైనా మీకు ప్రేమను వ్యక్తం చేస్తుంటే, మీరు కూడా వారిని ఇష్టపడుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. కొన్నిసార్లు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడంలో వారి స్వంత ప్రయోజనం ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కూడా ప్రారంభం కావచ్చు, వీటన్నటి గురించి అంచనా వేసి ఆలోచించి అడుగేయండి.
4. గోప్యతను కాపాడుకోండి
ఆఫీసులో మీరు చాలా మందితో ఫ్రెండ్లీగా, క్లోజ్‌గా ఉండచ్చు. మీకు సంబంధించిన అన్ని విషయాలను వారితో పంచుకోవచ్చు. కానీ కొలీగ్ తో ప్రేమ విషయం గురించి మాత్రం పంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి మీతో ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలి. మీకు ఎవరైనా నచ్చితే, మీ మనసులోని విషయాలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. మీ పర్సనల్ రిలేషన్‌ప్ గురించి ఎప్పుడూ గోప్యంగానే ఉంచుకోండి. ఆఫీసులో దాని గురించి ఎవరితోనూ మాట్లాడకండి.
5. ముందే అన్నీ మాట్లాడుకోండి
ఆఫీసులో ఎవరితోనైనా సంబంధం ఏర్పరచుకునే ముందు, వారితో ఈ విషయం గురించి స్పష్టంగా మాట్లాడండి. పని ప్రదేశంలో పని ఉండాలని, ప్రేమగా మాట్లాడుకోవడం, వ్యక్తిగతంగా కలవడం వంటివి కేవలం ఆఫీసు బయటే ఉండాలని మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ముందే చెప్పండి. ప్రతి సంబంధంలోనూ ఒడిదుడుకులు ఉంటాయి, కాబట్టి అలా జరిగినప్పుడు మీ సంబంధం మీ ఆఫీసు పనిని ప్రభావితం చేయకూడదు. గొడవలు జరిగినప్పుడు ఆఫీసులో మీరు ఇద్దరూ పని విషయంలో తగ్గకూడదని ముందే మాట్లాడుకుని నిర్ణయించుకోండి.