Diabetes: వానాకాలంలో ఈ ఫుడ్ ఐటమ్స్ తిన్నారంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి, జాగ్రత్త
Diabetes: డయాబెటిస్ బారిన పడినవారు తాము తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. వానాకాలంలో ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఏదైనా తినాలన్న కోరిక పుడుతుంది. అందుకే పకోడీలు, ఫ్రైడ్ రైస్‌లు, వేడి వేడి పానీయాలు లాగించేస్తారు.
Diabetes: మధుమేహం ఉన్నప్పుడు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టకపోతే ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకున్నవారవుతారు. రుచిగా ఉండే ఆహారం కన్నా ఆరోగ్యాన్నిందించే ఆహారాన్ని ఎంచుకోవాలి. వానాకాలంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఇవి సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్ని ఆహారాలు, పానీయాలు రక్తంలో చక్కెరను అకస్మాత్తుగా పెరిగేలా చేస్తాయి. కాబట్టి వానాకాలంలో డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.
డయాబెటిస్ డైట్
వానాకాలంలో డయాబెటిస్ రోగులు పకోడీలు, వడలు వంటి డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అనారోగ్య కరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
వానాకాలం వచ్చిందంటే టీ, కాఫీలు వంటి వేడి వేడి పానీయాలను అధికంగా తాగేస్తూ ఉంటారు. ఈ పానీయాల్లో చక్కెర జోడించి కూడా తాగుతారు. కొంతమంది ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌లు వేసుకొని తాగుతారు. ఇవన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేవే. కాబట్టి వేడివేడిగా తాగాలనిపిస్తే గ్రీన్ టీ మాత్రమే తాగండి. వానాకాలంలో వ్యాయామం కూడా తక్కువగానే చేస్తారు. కాబట్టి ఆహారం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
వేడి వేడి అన్నంలో స్పైసీ చట్నీ లేదా ఊరగాయలు వేసుకుని తింటే ఆ కిక్కే వేరు. అలా అని డయాబెటిస్ రోగులు కూడా తినడం మొదలుపెడితే వారి ఆరోగ్యం క్షీణించడం ఖాయం. ఇలా అధిక మొత్తంలో కారం, మసాలాలు ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను అది తక్కువగా తినాలి.
పూరీలు, పరాటాలు, వైట్ బ్రెడ్ వంటివి చూడగానే నోరూరిస్తాయి. ఇక వాటిని వేడివేడిగా తింటే ఆ రుచే వేరు. అలా అని డయాబెటిస్ రోగులు కూడా తినడం మొదలు పెడితే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఎందుకంటే ఇలాంటి ఆహారాలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం వేగంగా గ్లూకోజ్‌ను శోషించుకుంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి డయాబెటిస్ రోగం కూడా పెరిగిపోయే అవకాశం ఉంది.
జిలేబీలు, గులాబ్ జామ్, రసగుల్లా వంటి సాంప్రదాయ స్వీట్లను కూడా పక్కన పెట్టండి. వీటిలో కూడా మైదా, చక్కెర వాడకం అధికంగానే ఉంటుంది. ఇవి కూడా కార్బోహైడ్రేట్లతో నిండిన స్వీట్లు కాబట్టి, వానాకాలంలో వీటిని మితంగా కాదు కదా పూర్తిగా తినక పోవడమే మంచిది. అప్పుడే మధుమేహులు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
డయాబెటిస్ అదుపులో ఉండాలంటే నీరు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. నీటిని అధికంగా తాగే వారిలో డయాబెటిస్ అదుపులో ఉన్నట్టు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ నిండిన ఆహారాలను అధికంగా తినేందుకు ప్రయత్నించండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహుల ఆయుష్షును పెంచుతుంది.
టాపిక్