శరీర బరువు అధికంగా పెరగడం ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ సన్నగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది జిమ్‌లో కష్టపడటంతో పాటు, ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డైటింగ్ చేస్తుంటారు. నిజానికి వెయిట్ లాస్ డైటింగ్ గురించి చాలా మందిలో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. డైటింగ్ అంటే తక్కువగా తినడం లేదా ఒక పూట మొత్తం ఆహారం తినడం మానేయడం అని చాలామంది అనుకుంటారు. ఇలా అనుకునే చాలామంది రాత్రి భోజనం చేయడం మానేస్తుంటారు. నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.
డైటింగ్ అంటే ఆహారాన్ని స్కిప్ చేయడం కాదు.. తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. ఇలా చేయడం వల్లల శరీర బరువు అదుపులో ఉండటం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు వంటివి రావు. అలా మీ శరీర బరువును పెంచకుండానే మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచే రుచికరమైన ఆహారాలలో నాలుగింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజూ రాత్రి అన్నానికి బదులుగా వీటిని తిన్నారంటే ఈజీగా బరువు తగ్గచ్చు. రుచిని కూడా ఆస్వాదించవచ్చు.
రాత్రి భోజనానికి ఉప్మా ఉత్తమ ఎంపిక. ఇది రుచికరంగా ఉండటంతో పాటు, ఆరోగ్యకరమైన తేలికపాటి ఆహారం. దక్షిణ భారతీయ వంటకం అయిన ఉప్మాను తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. బరువు తగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే రాత్రి పూట మీరు ఓట్స్ ఉప్మాను తినడం చాలా మంచిది. దీన్ని మరింత ఆరోగ్యకరంగా చేయడానికి మీరు ఇందులో మీకు నచ్చిన కూరగాయలను జోడించవచ్చు. ఓట్స్ ఉప్మాను జీర్ణం చేసుకోవడం చాలా సులభం.
రుచిగా తింటూనే బరువు తగ్గాలి అనుకునే వారికి మూంగ్ దాల్ చిల్లా చాలా మంచి ఆహారపదార్థం. పెసరపప్పుతో తయారు చేసే ఈ మూంగ్ దాల్ చిల్లాలలో ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన గింజలతో వీటిని తయారు చేసుకుంటే ఇవి మరింత ఆరోగ్యకరంగా కూడా మారతాయి. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి ప్రతి రోజూ రెండు మూంగ్ దాల్ చిల్లాలను తిన్నారంటే రుచిని ఆస్వాదించవచ్చు అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది తేలికపాటి ఆహారంగా పనికొస్తుంది. ఎందుకంటే దీన్ని జీర్ణం చేసుకోవడం సులభం. ఈ చిల్లాలను మీరు మీకు నచ్చిన చట్నీతో నిర్భయంగా తినచ్చు.
రాత్రి కొంత రుచికరమైన, తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకుంటున్నారా? అయితే మీకు సూప్ మంచి ఆప్షన్. సూప్ తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, అలాగే దీన్ని జీర్ణం చేసుకోవడం చాలా సులభం. మీ ఇష్టాలకు అనుగుణంగా మీరు వెజ్ లేదా నాన్ వెజ్ వంటి ఏ రకమైన సూప్ అయినా తాగచ్చు. బరువు తగ్గడానికి రాత్రి భోజనంలో గుమ్మడికాయ, టమాటో, క్యారెట్ లేదా పాలకూర మొదలైన కూరగయాల సూప్ త్రాగండి. త్వరగా తయారయ్యే ఈ సూప్, పొట్టను చక్కగా నింపుతుంది. అలాగే మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే రాత్రి భోజనంలో ఆవిరిలో ఉడికించిన కూరగాయలు తినడం చాలా మంచిది. క్యారెట్, బ్రోకలీ, గుమ్మడికాయ, సోయా లేదా పాలకూర వంటి కూరగాయలను ఉడికించి తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అలాగే ఈ కూరగాయలను జీర్ణం చేసుకోవడం చాలా సులభం. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి తిన్న తర్వాత పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. తద్వారా ఆకలిని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట తినడానికి ఇవి మంచి ఆహారం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం