Holi and Asthma: హోలీ రోజున ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా వచ్చే అవకాశం-if you dont take these precautions on holi you may get asthma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi And Asthma: హోలీ రోజున ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా వచ్చే అవకాశం

Holi and Asthma: హోలీ రోజున ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్తమా వచ్చే అవకాశం

Haritha Chappa HT Telugu
Published Mar 22, 2024 01:30 PM IST

Holi and Asthma: హోలీ వచ్చిందంటే రంగులు చల్లుకునేందుకు అంతా సిద్ధమైపోతారు. కానీ ఆ రోజు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొందరిలో ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి.

హోలీ
హోలీ (PTI)

Holi and Asthma: రంగుల పండుగ హోలీ. ఇది సామాజిక వేడుక. వీధుల్లో అందరూ కలిసి చేసుకునే పండుగ. ఆనందంగా రంగులు జల్లుకుంటూ చేసుకునే హోలీ... కొంతమందిలో ఆస్తమా రావడానికి కారణం అవుతుంది. ఇక ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు హోలీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హోలీ రోజు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాబారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

ఆస్తమా రోగులు, ఆస్తమా లేనివారు కూడా హోలీ సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిది. ఆ రంగులోని రసాయనాలు ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తులకు చేరితే చాలా ప్రమాదం. అందులో హానికరమైన కణాలు ఉంటాయి. ఇవి మీ శ్వాసకోశ వ్యవస్థను ప్రమాదంలో పడేస్తాయి. కాబట్టి ఆస్తమా లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే కచ్చితంగా హోలీ రోజు మాస్కులు ధరించండి.

హోలీ రోజున రంగులు జల్లుకుంటూ, పరిగెడుతూ, డ్యాన్స్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఇది మరింతగా ఆస్తమాను పెంచుతుంది. అధిక శ్రమతో పాటు ఈ రంగులు కూడా శరీరంలో చేరితే శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది.

హోలీ రోజున చల్లుకునే రంగులు పూర్తిగా సహజమైనవి అయ్యేలా చూసుకోండి. సింథటిక్ రంగుల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి ముక్కులో చేరి చికాకుగా మారుతాయి. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి పసుపు పొడి, గులాబీ రేకులతో చేసిన గులాబీ పొడి, బీట్రూట్‌తో చేసిన పొడులను రంగులుగా చల్లుకోవడం మంచిది. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థకు ఎలాంటి నష్టముండదు.

హోలీ రోజున ఆనందంగా ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగే వారి సంఖ్య ఎక్కువ. అలాగే బీర్, చక్కెర పానీయాలు వంటివి కూడా అధికంగా తాగుతూ ఉంటారు. ఇలా తాగితే ఆస్తమా వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ ను తాగడం వల్ల ఆస్తమా రావచ్చు. మీ దాహాన్ని తీర్చడానికి ఆరోజు మజ్జిగ, నీరు వంటివి తాగడం మంచిది.

ఇంట్లోనే హోలీ ఆడడం మానేసి బయట సూర్యరశ్మి తగులుతుండగా హోలీ ఆడడం మంచిది. ఎండ తగులుతుండం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అలెర్జీ కారకాల ప్రభావం కూడా తగ్గుతుంది. అలా అని మరియు తీవ్రమైన వేడికి బహిర్గతం కావొద్దు.

ఆస్తమా రోగులు హోలీ రోజున మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ఎల్లప్పుడూ ఇన్ హేలర్ ఉంచుకోండి. వాయు కాలుష్యం, పొగ, బలమైన వాసనలు వస్తుంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా అధిక పొగ, మంటలు ఉన్నచోటుకు వెళ్లకపోవడమే మంచిది. ఆస్తమా మందులను మాత్రం మీ వెంటే ఉంచుకోండి. శాస సంబంధిత అసౌకర్యం అనిపించినా, ఆస్తమా లక్షణాలు కనిపించినా వెంటనే ఇంట్లోకి వెళ్లిపోండి. వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడండి.

Whats_app_banner